Share News

Global Beauty Contest: అందం అంటే అంతకుమించి

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:56 AM

ప్రపంచ సుందరి పోటీలు అందాన్ని వ్యక్తిత్వంతో కలిపే అందమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. జూలియా మోర్లీ తెలుగు ప్రజల పట్ల ఉన్న ప్రేమతో ఈ సారి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి

Global Beauty Contest: అందం అంటే అంతకుమించి

మిస్‌ వరల్డ్‌ సంస్థ సీఈఓ 85 ఏళ్ల జూలియా మోర్లీని చూస్తే 60 ఏళ్లు అనిపిస్తుంది. ఈ ప్రపంచానికి ఏదో చేయాలనే తపన అనుక్షణం కనిపిస్తూ ఉంటుంది. ‘‘అందం అనేది బాహ్యశరీరంలో మాత్రమే ఉండదు.. వ్యక్తిత్వంలో కూడా ఉంటుంది.. ఈ రెండూ కలిసినదే అసలైన అందం’’ అంటారు జూలియా. కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ) సహా అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన జూలియాకు తెలుగు ప్రజలంటే ప్రత్యేక అభిమానం ఉంది. వచ్చే నెల ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఆమె ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సారి ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణలో నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవటానికి కారణమేమిటి?

ప్రపంచ సుందరి పోటీలను ప్రతి ఏడాది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటాం. ఈ సారి తెలంగాణను ఎంపిక చేశాం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఎవరికీ చెప్పని ఒక విషయం చెబుతాను. నాకు తెలుగు ప్రజలంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే సుమారు రెండు దశాబ్దాల క్రితం నేను, ఎరిక్‌ (జూలియా భర్త) భారత్‌కు వచ్చి అనేక ప్రాంతాలు తిరిగాం. ఆ సమయంలో మేము మహిళలకు శానిటరీ నేప్‌కిన్స్‌ ఇచ్చే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్లం. ఆ సమయంలో హైదరాబాద్‌కు కూడా వచ్చాం. ఆ కార్యక్రమ నిర్వహణలో మాకు పోలీసులు చాలా సాయం చేశారు. అందుకే హైదరాబాద్‌ అనగానే పోలీసుల ఔదార్యం గుర్తుకు వస్తుంది. ఇది చాలా కాలం క్రితం జరిగి నంఘటన. కానీ నిన్న జరిగినట్లు అనిపిస్తోంది.


ఈ సారి కూడా తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నా ఉద్దేశంలో హైదరాబాద్‌ ప్రపంచంలో ఎక్కువ మందికి తెలియని ఒక రహస్యం. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీల ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ఇదొక అందమైన నగరం. కానీ దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. ప్రపంచ సుందరి పోటీలు ఈ నగరానికి కొత్త గుర్తింపు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. ఈ పోటీల తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు మరింతగా రావాలని కోరుకుంటున్నా.

12345.jpg

ప్రపంచ సుందరి పోటీలు దేనికి చిహ్నంగా భావించాలి?

ఒక అందమైన అమ్మాయిని ప్రపంచ సుందరిగా ప్రకటించటం మా ఉద్దేశం కాదు. నా దృష్టిలో అందం అంటే శరీర సౌందర్యం కాదు. అందమైన మొహం.. పెదాలు.. అవయవ సౌష్టవం ఉంటే ప్రపంచ సుందరిలు కారు. వారికి అందమైన వ్యక్తిత్వం ఉండాలి. ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలి. అందుకే ఈ పోటీలను నేను ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ అని పిలుస్తాను. ఇక్కడికి వచ్చే అందగత్తెలందరూ వారి వారి దేశాల్లో చేయదలుచుకున్న ప్రాజెక్టులను తీసుకువస్తారు. వారు ఏ ప్రాజెక్టులు చేయాలనే విషయాన్ని మేము వారికి చెప్పం. వారి ఊహాశక్తి.. కొన్ని అంశాలపై వారికి ఉన్న నిబద్ధతల ఆధారంగా వాటిని వారు ఎంపిక చేసుకుంటారు. ఇలా ప్రతి ఏడాది సుమారు 130 ప్రాజెక్టులు వస్తాయి. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసి వాటికి అవసరమైన వనరులు సమకూరుస్తాం. అందుకే ప్రపంచ సుందరి పోటీలంటే భౌతికపరమైన అందం మాత్రమే కాదని చెప్పగలుగుతున్నాను.


ఈ సారి ప్రపంచ సుందరి పోటీలలో ఫార్మాట్‌ మార్చినట్లున్నారు కదా..

ఫార్మాట్‌లో మార్పులు జరుపుతూనే ఉంటాం. ఉదాహరణకు ఒకప్పుడు స్విమ్‌సూట్‌ రౌండ్‌ ఉండేది. అది ఇప్పుడు లేదు. బీచ్‌లో ఉన్నప్పుడు స్విమ్‌ సూట్‌ వేసుకుంటాం. ప్రతి రోజు దాన్ని వేసుకొని తిరగం కదా! అంతే కాదు ...వ్యక్తిగతంగా కూడా నాకు స్విమ్‌సూట్‌ వేసుకొని ఇతరుల ముందుకు నడుచుకుంటూ రావటం ఇష్టం ఉండదు. కానీ కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ఆ రౌండ్‌ ఉండేది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మేము 1953లో ప్రపంచ సుందరి పోటీలను ప్రారంభించినప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. ప్రపంచమంతా రెండో ప్రపంచయుద్ధ ఒత్తిడి నుంచి తేరుకుంటోంది. ఈ సమయంలో ప్రజలందరిలోను ఒక విధమైన నిరాశ, ఆందోళన ఉండేవి. ఆ సమయంలో వారిలో సంతోషం నింపటానికి ఏదైనా చేస్తే బావుండననిపించింది. ప్రపంచసుందరి పోటీలు అలా పుట్టాయి. దీనిని ప్రపంచ ప్రజలందరూ ఆదరించారు. పరిస్థితులకు అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు మార్పులు తెస్తూనే ఉంటాం.

ప్రపంచ సుందరి పోటీల ద్వారా వచ్చిన సంపాదనను ఏం చేస్తారు? ఎలా ఖర్చు పెడతారు?

మాకు ఈ పోటీల నుంచి వచ్చే డబ్బులో ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. డబు సంపాదించటం పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదు. వచ్చిన డబ్బు మొత్తం మేము నిర్వహించే ప్రాజెక్టులపైనే ఖర్చు పెడతాం. ఈ ప్రాజెక్టులు విజయవంతమయినప్పుడు కలిగే ఆనందానికి వెల లేదు. ఉదాహరణకు మేము ఇండోనేషియాలో ఒక ప్రాంతంలో ఒక వంతెన నిర్మించాం. దాని వల్ల కొన్ని వందల మందికి లబ్ధి చేకూరుతోంది. అక్కడున్న పిల్లలు స్కూలుకు వెళ్లగలుగుతున్నారు. ఆ పిల్లలను కలిసినప్పుడు వారు చూపించిన ప్రేమ అమూల్యమైనది. అంతేకాకుండా- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల మంది వలంటీర్లు తమ పరిధిలో సమాజంలో మార్పు తేవటానికి చేస్తున్న ప్రయత్నాలను డబ్బులతో వెలకట్టలేం.


మీరు ఇన్నేళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నారు కదా.. మరచిపోలేని సంఘటనలు ఏవైనా ఉన్నాయా?

చాలా ఉన్నాయి. కానీ ఒక సంఘటన మాత్రం ఎప్పుడూ మర్చిపోలేను. మేము నైజీరియాలో పోటీలను నిర్వహించాలనుకున్నాం. అక్కడి ప్రభుత్వం కూడా చాలా సాయం చేసింది. పోటీల సమయంలోనే అమీనా అనే అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపారని ఒక అంతర్జాతీయ పత్రికలో వార్త వచ్చింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం చెలరేగింది. వాస్తవానికి ఆ సంఘటన జరగలేదు. కొందరు పాశ్చాత్య జర్నలిస్టులు కావాలని రాసిన వార్త. ఆ విషయం మాకు తెలుసు. కానీ ప్రపంచానికి తెలియదు కదా! ప్రపంచమంతా అలజడి ప్రారంభమయింది. దీనితో రాత్రికి రాత్రి పోటీలను రద్దు చేసుకున్నాం. ఒక విమానాన్ని అద్దెకు తీసుకొని పోటీదారులందరితో ఇంగ్లాండ్‌ వచ్చేశాం. రాత్రికి రాత్రి వందల మందిని ఒక దేశం నుంచి మరొక దేశానికి తీసుకురావాలంటే ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి! ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం.

CHIN.jpg

ఈ పోటీలలో బీద.. ధనిక దేశాల నుంచి వచ్చిన యువతులు ఉంటారు. వారిలో కొందరికి విపరీతంగా ఖర్చు పెట్టే స్తోమత లేకపోవచ్చు. అలాంటప్పుడు అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు..


ప్రతి దేశంలోను మిస్‌వరల్డ్‌ తొలి రౌండ్‌ పోటీలను నిర్వహించటానికి కొందరు లైసెన్స్‌ హోల్డర్స్‌ ఉంటారు. వారు వారి దేశాలలో నెగ్గిన వారికి స్పాన్సరర్స్‌ను తీసుకువస్తారు. ఒకప్పుడు దుస్తుల మీద ఎక్కువ ఖర్చు పెట్టేవారు కాదు. ఇప్పుడు ఆ ఖర్చు విపరీతంగా ఉంటోంది. అందుకే నేను జ్యూరీ సభ్యులకు ‘‘మీరు ఎవ్వరి ఒత్తిడికి లొంగవద్దు. ఇతరులు ఏం చేస్తున్నారే విషయాన్ని చూడద్దు. మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకోండి..’’ అని చెబుతూ ఉంటా. ‘‘ఒక అమ్మాయి అద్భుతమైన డ్రస్సు వేసుకుంటే ప్రపంచ సుందరి అయిపోతుందా? ఇంకో అమ్మాయి ఇతరుల కన్నా బాగా మాట్లాడగలిగితే ప్రపంచ సుందరి అయిపోతుందా?’’ అని అడిగితే ‘‘కాదు’’ అని కచ్చితంగా చెప్పగలను.

  • అందం అనేది చాలా చిత్రమైన పదం. ఒక అమాయకమైన పాప మొహంలో కనిపించే అందం కొందరు మాత్రమే చూడగలుగుతారు. చాలా సార్లు అందం అనే పదాన్ని తప్పుగా వాడుతూ ఉంటారు. నా ఉద్దేశంలో ప్రేమ, నిబద్ధత, ఇతరులకు సేవ చేయాలనే కోరిక, మంచి వ్యక్తిత్వం, చురుకుదనం- ఇవన్నీ కలగసినప్పుడే నిజమైన అందం కనిపిస్తుంది.

  • మొత్తం ప్రపంచమంతా ఒకరితో మరొకరు ఎటువంటి అమరికలు లేకుండా స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకోగలిగిన రోజు రావాలనేది నా కోరిక. అన్ని చోట్ల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. రకరకాల ప్రతికూల భావాలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించగలిగినప్పుడు అందమైన ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతాం.

  • ఈ సారి పోటీల తర్వాత తెలంగాణకు ఏదో విషయంలో మేలు చేయాలనేది మా ఉద్దేశం. ముఖ్యంగా పిల్లలకు, మహిళలకు సంబంధించిన ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటాం.

- సివిఎల్‌ఎన్‌. ప్రసాద్‌


ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 14 , 2025 | 12:56 AM