Share News

Drug Abuse Awareness: మత్తు వదిలిస్తున్నారు..

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:48 AM

కేరళకు చెందిన మాజీ ఉపాధ్యాయురాలు, పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆమె, గ్రామ యువతను డ్రగ్స్‌ బారినుంచి కాపాడేందుకు 'ధీర' అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. వాలంటీర్ల సహకారంతో డ్రగ్‌ వినియోగదారులు, విక్రేతలపై సమాచారం సేకరించి, పోలీసుల సహకంతో చర్యలు తీసుకుంటున్నారు.

Drug Abuse Awareness: మత్తు వదిలిస్తున్నారు..

రాబోయే తరం శ్రేయస్సు కోసం డ్రగ్స్‌ మహమ్మారిని తరిమి కొట్టడానికి దేనికైనా సిద్ధమంటున్నారు ఫరీషా అబిద్‌. కేరళలోని ఓ పంచాయతీ ప్రెసిడెంట్‌ అయిన ఆమె దాదాపు 800 మందితో ఓ సైన్యాన్ని సిద్ధం చేసి, మాదక ద్రవ్యాలపై పోరాడుతున్నారు. తనను, తన కుటుంబాన్ని చంపుతామనే బెదిరింపులను లెక్క చెయ్యకుండా... స్వార్థపరుల ఆట కట్టిస్తున్నారు.

‘‘నాలుగైదు నెలల క్రితం... పంచాయతీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నాను. రోడ్డు పక్కన జనం గుమిగూడి ఉన్నారు. ‘ఏమిటా?’ అని వెళ్ళి చూస్తే పదిహేనేళ్ళ కుర్రాడు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అక్కడికి చేరుకున్న డాక్టర్‌... ఆ కుర్రాణ్ణి పరీక్ష చేసి, అతను డ్రగ్స్‌ తీసుకున్నాడని, మోతాదు ఎక్కువైపోవడం వల్ల అపస్మారక స్థితికి చేరుకున్నాడని చెప్పారు. ఆ కుర్రాణ్ణి నేను గుర్తుపట్టాను. అతను గతంలో నా దగ్గర చదువుకున్నవాడే. తరగతిలో చురుగ్గా ఉండేవాళ్ళలో ఒకడు. అతణ్ణి ఆసుపత్రికి తరలించాం. ఇలాంటి దృశ్యాలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. బడి వయసులోనే పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. వ్యసనాన్ని తీర్చుకోవడానికి డబ్బుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మత్తులో విచక్షణ మరచిపోయి బాలికల మీద, మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. ఇది మా ప్రాంతానికే పరిమితం కాదు. చాలా ప్రాంతాల్లో ఆందోళనకరంగా మారిన సమస్య. ‘కొందరి స్వార్థం కోసం రాబోయే తరం బలైపోతూ ఉంటే... నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఒక మాజీ టీచర్‌గా, పంచాయతీ ప్రెసిడెంట్‌గా... అన్నిటికీ మించి ఇద్దరు పిల్లల తల్లిగా నేను ఏం చేయగలను?’... కొన్నాళ్లపాటు ఇవే ఆలోచనలు.

f.gif

రాద్ధాంతం చెయ్యొద్దన్నారు...

మాది కేరళలోని కన్నూర్‌ జిల్లా మట్టూల్‌ గ్రామం. ఉపాధ్యాయినిగా పని చేసిన నేను కొన్నేళ్ళ క్రితం ప్రజా జీవితంలోకి వచ్చాను. 30 వేలకు పైగా జనాభా ఉన్న మా పంచాయతీకి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. అన్ని రంగాల్లో మా గ్రామాన్ని అత్యుత్తమంగా నిలబెట్టాలనేది నా తపన. ఆ దిశగా పని చేస్తున్న నాకు డ్రగ్స్‌ మహమ్మారి ఒక సవాలుగా మారింది. మత్తుకు అలవాటు పడిన పిల్లల తల్లితండ్రులతో మాట్లాడినప్పుడు... ‘‘అన్యాయంగా మావాడి మీద నిందలు వేస్తున్నారు. వాడు అలాంటి వాడు కాదు’’ అని కొందరు, ‘‘ఈ సంగతి అందరికీ తెలిస్తే మా పరువు పోతుంది. దయచేసి రాద్ధాంతం చెయ్యకండి’’ అని ఇంకొందరు అనడంతో నేను దిగ్ర్భాంతి చెందాను. విదేశాల్లో పని చేసే తల్లితండ్రులు డబ్బు పంపుతూ ఉంటే... దాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ మాదకద్రవ్యాలకు బానిసలైన వారు, తోటివారి ప్రోత్సాహంతో, డ్రగ్స్‌ అమ్మేవారి ప్రలోభాలతో ఈ దురలవాటు చేసుకున్నవారు ఎక్కువమందే ఉన్నారు. చేతిలో డబ్బు లేకపోతే దొంగతనాలకు, అఘాయిత్యాలకు సైతం పాల్పడుతున్నవారూ ఉన్నారు. దీని వెనుక డ్రగ్స్‌ రాకెట్‌ ఉంది. కాబట్టి ఇది అత్యవసర సమస్య అనీ, పెద్ద స్థాయిలో చర్యలు చేపట్టాల్సిందేననీ అర్థమయింది. ఈ దిశలో తొలి అడుగుగా... ‘ధీర’ అనే పేరుతో కొన్ని నెలల క్రితం సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించాను. దానికోసం నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేశాను. చిన్న స్థాయిలో... కొద్దిమందితో మొదలైన వాట్సప్‌ గ్రూప్‌లో ఇప్పుడు 800కు పైగా వాలంటీర్లు ఉన్నారు.


అందరి సాయంతో...

మత్తుపదార్థాలు వినియోగిస్తున్నవారి గురించి, వాటిని సరఫరా చేస్తున్నవారి గురించి తెలిసిన సమాచారాన్ని మా గ్రూపులో పంచుకుంటాం. ఆ సమాచారాన్ని పోలీసులకు అందిస్తాం. దీనికోసం పంచాయతీ అంతటా... ముఖ్యంగా పాఠశాలల్లో, పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రసంగాల ద్వారా, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రజలకు వివరించాం. మా ప్రయత్నానికి చక్కటి మద్దతు లభించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, వ్యాపారులు, దుకాణకారులు, పోలీసు అధికారులు... ఇలా అన్ని వర్గాలవారూ మాతో చేతులు కలిపారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్న 13 మందిని ఇప్పటివరకూ అరెస్ట్‌ చేయించాం. డ్రగ్స్‌కు బానిసలైన అనేకమందికి వైద్య చికిత్స అందిస్తున్నాం. ఇప్పడు మా పొరుగు పంచాయతీ మదాయి కూడా మాతో భాగస్వామి అయింది. దాంతో ‘ధీర: మట్టూల్‌-మదాయి కూటమి’గా ఏర్పడ్డాం. డ్రగ్స్‌ వ్యాపారులంటే భయంతో మొదట్లో ప్రజలు ధైర్యంగా మాట్లాడడానికి వెనుకాడేవారు. ఇప్పుడు డ్రగ్‌ జోన్స్‌, వాడకందారులు, విక్రయదారుల గురించి కీలక సమాచారం ఇస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు కొందరు డ్రగ్స్‌ పంపిణీ చేస్తున్నట్టు గుర్తించి, వారికి హిందీలో కౌన్సెలింగ్‌ ఇచ్చాం. ఎవరి ఇళ్ళలోనైనా అక్రమ కార్యకలాపాలు జరిగితే... వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాం. పోలీసులు, ఎక్సైజ్‌ శాఖలు కూడా దీనికి ఎంతో సహకరిస్తున్నాయి.

వారికి హెచ్చరికగా...

ఇవన్నీ ఒక ఎత్తయితే... నాకు బెదిరింపులు కూడా తీవ్రస్థాయిలోనే వస్తున్నాయి. ఇంటికి ఫోన్‌ చేసి అసభ్యంగా తిట్టడంతో ఇది మొదలయింది. ఇప్పుడు నా కుటుంబం మొత్తాన్ని చంపేస్తామంటూ సందేశాలు పంపిస్తున్నారు. వాళ్ళు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. ‘‘ఫోన్‌ వెనకాల దాక్కోవడానికి బదులు ముఖాముఖి నాతో వచ్చి మాట్లాడు’’ అని వారికి చెబుతున్నాను. ఇలాంటి వాటికి నేను, మా బృందం భయపడేది లేదనే గట్టి హెచ్చరిక వారికి చేయాలనే ఉద్దేశంతో... ఈ మధ్య పెద్ద ఊరేగింపు నిర్వహించాను. దుండగుల బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఏది ఏమైనా... మా కృషి మంచి ఫలితాలనే ఇస్తుందని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో ‘ధీర’ను రిజిస్టర్డ్‌ ఎన్జీవోగా మార్చి... మరింత విస్తరించాలనే ఆలోచన ఉంది. అలాగే చాటుమాటుగా సాగుతున్న డ్రగ్స్‌ కార్యకలాపాలను కనిపెట్టడం కోసం డ్రోన్లతో నిఘా, ధర్మల్‌ స్కానింగ్‌ లాంటివి ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. డ్రగ్స్‌ లేని సమాజంతోనే మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలం. అందుకు అవసరమైన సామాజిక చైతన్యం కోసం నా కృషిని కొనసాగిస్తాను.’’


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 03:48 AM