Krishna Shroff Journey: నాకు నేనే బాస్
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:38 AM
కృష్ణా ష్రాఫ్ తన కుటుంబ వారసత్వాన్ని దాటేసి, పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేకతను సాధించింది. ఫిట్‌నెస్ ప్రియురాలిగా, స్వతంత్ర నిర్ణయాలతో వ్యాపారంలో విజయం సాధించింది

అభిరుచి
కపూర్‌లు... ఖాన్‌లు... ఖన్నాలు... బాలీవుడ్‌లో వారసుల జోరు ఇవాల్టిది కాదు. అగ్ర తారల పిల్లలు తల్లిదండ్రులను అనుసరించడం దశాబ్దాలుగా చూస్తున్నాం. కానీ కృష్ణా ష్రాఫ్ సగటు సినీ వారసులకు భిన్నం. నాన్న జాకీ ష్రాఫ్... అన్న టైగర్ ష్రాఫ్... ఇద్దరూ వెండితెర వేల్పులే. అయినా 32 ఏళ్ల కృష్ణా మాత్రం వారిలా నటనలోకి రావాలని అనుకోలేదు. తనకంటూ ఒక అభిరుచి... దాని కోసం శ్రమించి సాధించే పట్టుదల... ఇవే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
‘‘అందరు నటుల పిల్లల్లా నేను కూడా నాన్న వేసిన మార్గంలో నడవవచ్చు. కానీ అలా చేస్తే ఇక నాకంటూ చెప్పుకోవడానికి, కొత్తగా సాధించడానికి ఏముంటుంది? మొదటి నుంచీ నాకు సవాళ్లంటే ఇష్టం. వాటిని అధిగమించి అందుకున్న విజయంలో సంతోషం, సంతృప్తి ఉంటాయి. జాకీ ష్రాఫ్ కూతురుగానో, టైగర్ ష్రాఫ్ సోదరిగానో నన్ను గుర్తు పెట్టుకొంటానంటే... అందుకు నేను ఇష్టపడను. నన్ను నన్నుగా గుర్తించాలని కోరుకొంటాను. నటన నా ఒంటికి పడదనుకున్నాను. పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకున్నాను. ఆ క్రమంలోనే మా అమ్మ ఆయేషాతో కలిసి ‘ఎంఎంఏ మ్యాట్రిక్స్’ (మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ స్టూడియో) నెలకొల్పాను. మా కుటుంబానికి చిత్ర పరిశ్రమలో, ప్రజల్లో ఉన్న ఆదరణ నా వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. కొత్తగా నా గురించి, నా స్టూడియో గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అదీకాకుండా... ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకకు నాకు నచ్చింది నేను చేసుకొనే స్వేచ్ఛ ఇంట్లో నాకు ఉంది. ఇలాంటి స్వేచ్ఛ అందరికీ లభించదు కదా.
అమ్మానాన్నలు గర్వపడేలా...
ఏం చేసినా ఇంట్లోవాళ్లు ఎదురు చెప్పరు. నిజమే... అలాగని వారు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచకుండా సరైన దారిలో నడవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది కదా. అందుకే నన్ను చూసి అమ్మానాన్నలు గర్వపడేలా ఎదగాలనుకున్నాను. ఆ ఆలోచనతోనే ‘ఎంఎంఏ’ ప్రారంభించాను. ఇది మార్షల్ ఆర్ట్స్ శిక్షణతో పాటు ఫిట్‌నెస్ లక్ష్యాలను అందుకొనేందుకు ఉద్దేశించింది. ఇక్కడ నాకు నేనే బాస్. వేరొకరికి జవాబుదారీ కాదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. దీంతోపాటు పలు రియాలిటీ షోస్‌లో కూడా పాల్గొన్నాను. ఎందుకంటే అక్కడ నిజమైన సవాళ్లు ఎదురవుతాయి. సవాళ్లు, సమస్యలు వచ్చినప్పుడే కదా... మన నైపుణ్యం, మన సామర్థ్యం ఏంటో మనకు తెలిసేది.
అలా చెప్పుకోవడమే ఇష్టం
నేను ఒక డాక్యుమెంటరీ తీశాను... ట్రాన్స్‌జెండర్స్ స్థితిగతుల మీద. కాలేజీ రోజుల్లో బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని. యువ క్రీడాకారులకు కొంతకాలం బాస్కెట్‌బాల్ కోచింగ్ కూడా ఇచ్చాను. ఇక ఫిట్‌నెస్ అనేది నా జీవితంలో ఒక భాగం. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ నా వర్కవుట్ వీడియోలు పోస్టు చేస్తుంటాను. అదేదో ప్రచారం కోసం కాదు... నన్ను చూసి కొందరైనా స్ఫూర్తి పొంది, వ్యాయామాలను తమ దినచర్యల్లో చేర్చుకోకపోతారా అనే ఆశ. ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అనుసరించడమే కాదు... సరికొత్త వస్త్ర శ్రేణులను పరిచయం చేయడంలోనూ ముందుంటాను. ఫిట్‌నెస్‌తో పాటు నా ఫ్యాషన్ ట్రెండ్స్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తుంటాను. అయితే వీటన్నిటి కంటే నన్ను ఒక పారిశ్రామికవేత్తగానే అందరూ గుర్తుపెట్టుకోవాలన్నది నా కోరిక. అలా చెప్పుకోవడానికే నేను ఇష్టపడతాను. మా కుటుంబ వారసత్వానికి భిన్నంగా... ఒక పారిశ్రామికవేత్తగా నాదైన మార్గాన్ని నేను నిర్మించుకున్నాను. ఫిట్‌నెస్ ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనేది నా తాపత్రయం.
వద్దనుకొని వచ్చేశా...
నాన్న, అన్నయ్య హీరోలు. అమ్మ నిర్మాత. సినీ కుటుంబానికి చెందిన అమ్మాయిగా చిన్నప్పటి నుంచీ నా మీద కూడా విపరీతమైన ఒత్తిడి ఉండేది. పరిశ్రమలోనివారు, అభిమానులకు అంతుపట్టని విషయం ఏంటంటే... అసలు నేనెందుకు నటనలోకి రాలేదని! ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి, ఆకాంక్షల కారణంగా ఒక దశలో నేను కూడా పరిశ్రమ వైపే వెళ్లక తప్పదని అనుకున్నాను. దాంతో దుబాయ్ వెళ్లి అక్కడి ‘ఎస్‌ఏఈ ఇనిస్టిట్యూట్’లో ఫిలిమ్ ప్రొడక్షన్‌లో డిగ్రీ పూర్తి చేశాను. భారత్‌కు తిరిగి వచ్చాక అన్నయ్య చిత్రాలు రెండు మూడింటికి అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ సమయంలోనే అర్థమైంది... నేను కోరుకున్నది ఇది కాదని. ఇక అక్కడి నుంచి సమయం వృథా చేయదలుచుకోలేదు. పరిశ్ర వద్దనుకుని వచ్చేశాను.’’
ఫిట్‌నెస్ మీద దృష్టి
అప్పట్లో బొద్దుగా, కాస్త బరువుగా ఉండేదాన్ని. జిమ్‌కు వెళ్లడానికే ఎంతో ఆలోచించేదాన్ని. నాన్నతో కలిసి ఎప్పుడన్నా బయటకు వెళ్లినప్పుడు నా ఫొటోలు తీసి, పత్రికల్లో ప్రచురించి, నా ఆకారం గురించి రాసేవారు. చిన్న వయసులో ఇవి నన్ను ఎంతో బాధించేవి. క్రమంగా ఆ విమర్శలను సానుకూలంగా తీసుకోవడం మొదలుపెట్టాను. అందుకే సినీ రంగం వద్దనుకుని వచ్చేశాక... ముందు నన్ను నేను మార్చుకోవాలని అనుకున్నాను. ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టాను. కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారాను. నిత్యం వ్యాయామాలవల్ల శరీరం సరైన ఆకృతిని సంతరించుకుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఏదో శక్తి నాలో ఆవహించినట్టుగా ఉండేది. ఏకాగ్రత కుదిరేది. దానివల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. అలా చివరకు ఫిట్‌నెస్‌కు సంబంధించిన కంపెనీనే నెలకొల్పాను. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలను... ఒక విజయవంతమైన వ్యాపారవేత్తనని. ఇది నా కష్టం, పట్టుదలతో సాధించిన విజయం. నాన్న డబ్బు కానీ, ఆయన స్టార్‌డమ్ కానీ నాకు ఇంతటి సంతృప్తిని, సంతోషాన్ని ఇవ్వలేవు.
ఇవి కూడా చదవండి:
Supreme Court: గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Earthquake: నేపాల్‌లో భూకంపం..ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు