Share News

Moringa Benefits: దివ్య ఔషధం మునగాకు

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:49 AM

మునగాకు పర్యావరణానికి, పశువులకు, మరియు శుభ్రపరిచే నీటికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది సూక్ష్మజీవులను నశిపించి నీటిని శుభ్రం చేస్తుంది, పశువుల పాల ఉత్పత్తిని పెంచుతుంది, అలాగే ఎనర్జీ డ్రింక్స్ తయారీలో కూడా ఉపయోగపడుతోంది

 Moringa Benefits: దివ్య ఔషధం మునగాకు

నం ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రకృతి అనేక రకాల ఔషధాలను ఆహార రూపంలో అందించింది. అలాంటి వాటిలో మునగ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు కాసే మునక్కాయలను పులుసు, కూర, సాంబారు వంటి వాటిలో వాడుతూ ఉంటారు. ఈ కాయలకన్నా మునగ ఆకులకు అనేక విశిష్టతలు ఉన్నాయి. మునగాకుల్లో ప్రొటీన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఐరన్‌, పొటాషియం కూడా ఎక్కువే. దీనివల్ల ప్రతి రోజూ మునగాకు తినేవారిలో రోగనిరోధకశక్తి మెండుగా ఉంటుంది. అయితే ముదురు ఆకుల కన్నా లేత ఆకులోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. లేత ఆకులను ఎండబెట్టి పౌడర్‌గా చేసి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల పోషక విలువలు తగ్గవు. ఈ ఆకుల గురించి ‘భోజన కుతూహలం’ గ్రంథంలో సవివరమైన వర్ణన ఉంది. మునగాకు లక్షణాలను

గమనిస్తే...

  • ఈ ఆకులు వాతాన్ని హరిస్తాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే కఫాన్ని తొలగిస్తాయి. క్రమం తప్పకుండా తింటే కఫం ఏర్పడకుండా నివారిస్తాయి.

  • కీళ్ల నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. కీళ్లవాతంతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరం.

  • ఇది జీర్ణశక్తిని పెంపొందించటమే కాకుండా.. కడుపులో ఉన్న నులి పురుగులను చంపుతుంది. విరోచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు ఉన్నవారు 15 రోజులు తింటే, ఆ సమస్యలు తొలగిపోతాయి.

  • మునగాకులో పురుష బీజకణాలను పెంచే శక్తి ఉంది. లైంగిక పటుత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ మునగాకును వంటల్లో తప్పనిసరిగా వాడతారు.

  • మూత్రపిండాల సమస్య ఉన్నవారికి మునగాకు మంచి ఫలితాలు ఇస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

  • మునగాకుతో చేసే వంటకాలు తింటే శరీరంలోని నీరు లాగేస్తుంది.

  • మునగాకును తినటంవల్ల గుండె పనితీరు బాగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా స్థూలకాయ నివారణ సులభమవుతుంది.


  • మునగాకు కేవలం మనకే కాదు... మన పర్యావరణానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది. అలాంటి ప్రయోజనాలేమిటో చూద్దాం...

  • మునగాకు పొడిని నీటిలో కలిపితే సూక్ష్మజీవులు నశిస్తాయి. నీరు శుభ్రం అవుతుంది.

  • మునగాకును సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.

  • ఈ ఆకులను పశువుల దాణాలో కలిపితే పాల ఉత్పత్తి పెరుగుతుంది. కోళ్ల మేతలో కలిపితే గుడ్ల ఉత్పత్తి పెరిగే అవకాశముంది.

  • ఈమధ్యకాలంలో మునగాకుతో ఎనర్జీ డ్రింక్స్‌ కూడా తయారు చేస్తున్నారు.

-గంగరాజు అరుణాదేవి


ఇవి కూడా చదవండి:

Supreme Court: గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Earthquake: నేపాల్‌లో భూకంపం..ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు

Updated Date - Apr 05 , 2025 | 01:49 AM