Microplastics in Bubblegum: బబుల్‌గమ్‌లో ప్లాస్టిక్ పారాహుషార్
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:14 AM
బబుల్‌గమ్‌లో ప్లాస్టిక్ అణువులు ఉండటం ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉండవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్వీన్స్ యూనివర్శిటీ చేసిన అధ్యయనంలో, బబుల్‌గమ్‌ను నమలడం ద్వారా మన లాలాజలంలో ప్లాస్టిక్ అణువులు ప్రవేశిస్తాయని తెలుస్తోంది

నోట్లో ఒక బబుల్‌గమ్ పడేసి, అదే పనిగా నములుతూ కాలక్షేపం చేసేవాళ్లుంటారు. దీంతో నోట్లో లాలాజలం పెరిగి, దంతాలు శుభ్రపడతాయని నమ్మేవాళ్లూ ఉన్నారు. అయితే బబుల్‌గమ్‌లో హానికారక ప్లాస్టిక్ అణువులు దాగి ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
క్వీన్స్ యూనివర్శిటీ బెల్ఫాస్ట్ లో చేపట్టిన ఒక అధ్యయనంలో బబుల్‌గమ్‌లో హానికారక పదార్థాలు దాగి ఉన్నాయనే విషయం వెల్లడైంది. జోర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, ఒక గంట పాటు చూయింగ్ గమ్‌ను నమిలిన వ్యక్తి లాలాజలంలో రెండున్నర లక్షల మైక్రోప్లాస్టిక్స్‌ను కనిపెట్టగలిగినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధకులు, ఆటొమేటెడ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా చూయింగ్‌గమ్‌ను నమలడం వల్ల మన లాలాజలంలోకి ఎన్ని ప్లాస్టిక్ అణువులు ప్రవేశిస్తాయన్నది అంచనా వేశారు. ఇలా సూక్ష్మ రూపాల్లో మన శరీరంలోకి చేరుకునే మైక్రో, నానో ప్లాస్టిక్ అణువులు, మన జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, పునరుత్పత్తి వ్యవస్థలను దెబ్బతీస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధనా బృందంతో కలిసి పనిచేసిన క్వీన్స్ యూనివర్శిటీ మరొక పరిశోధకుడు, ఉదిత్ పంత్, చూయింగ్‌గమ్‌లో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ గురించి వివరిస్తూ, చూయింగ్‌గమ్‌ను నమలడం మొదలుపెట్టిన మొదటి 20నిమిషాలు, 20 నుంచి 40 నిమిషాలు, 40 నుంచి 60 నిమిషాల వ్యవధుల్లోని వేర్వేరు లాలాజలాలను పరిశీలించినప్పుడు, ఆ మూడు నమూనాల్లో మైక్రో, నానో ప్లాస్టిక్స్ కనిపించాయి. మానవ శరీరం మీద ఈ కణాల దీర్ఘకాలిక ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది కచ్చితంగా తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకూ ఈ ప్లాస్టిక్స్ కలిగి ఉండే చూయింగ్‌గమ్‌లకు దూరంగా ఉండడమే మేలని పంత్, హెచ్చరిస్తున్నారు.