Share News

స్థితప్రజ్ఞుత అదే

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:29 AM

జాగ్రత్తగా గమనిస్తే శ్రీరాముడి జీవితమంతా విపత్తుల విలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలవుతాడు. తన భార్యను అపహరించిన రావణుడితో తనకు ఏ మాత్రం ఇష్టంలేని...

స్థితప్రజ్ఞుత అదే

భారతీయులకు శ్రీరాముడు ఆరాధ్యదైవం. మన దేశంలో రామాలయం లేని గ్రామమే ఉండదు. భారతీయులందరూ శ్రీరాముడిని ఎందుకు కొలుస్తారు? ఈ ప్రశ్న అనేక మందిలో తలెత్తుతూ ఉంటుంది. దీని వెనకున్న కారణాలు చూద్దాం.

జాగ్రత్తగా గమనిస్తే శ్రీరాముడి జీవితమంతా విపత్తుల విలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలవుతాడు. తన భార్యను అపహరించిన రావణుడితో తనకు ఏ మాత్రం ఇష్టంలేని యుద్దం చేస్తాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత తన భార్య గురించి తన రాజ్య ప్రజలే తక్కువ చేసి మాట్లాడటం విని నొచ్చుకుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో విషాద హృదయంతో.. తనకు అత్యంత ప్రాణప్రదమైన సీతను.. నిండుచూలాలని కూడా చూడకుండా అడవిలో వదిలిపెడతాడు. ఇవన్నీ చాలవన్నట్లు తెలియకుండానే.. పుత్రులతో యుద్ధం చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనర్ధాలు. ఇలాంటి సమయంలో రాముడు ఎలా ప్రవర్తించాడు? ఇతరులకు ఎలా ఉదాహరణగా నిలిచి స్థితప్రజ్ఞుడనిపించుకున్నాడనేదే ముఖ్యమైన విషయం.


అన్నింటినీ తట్టుకొని...

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల వ్యక్తిత్వం రాముడి సొంతం. ఎంతటి విపత్తు వచ్చినా.. దానికి కారణమైన ఇతరులను ఆయన ఎప్పుడూ దూషించలేదు. ఎందుకంటే- బాహ్య పరిస్థితులు మన చేతులో ఎప్పుడూ ఉండవు. అవి తారుమారు అవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోగలగటమే రాముడి వ్యక్తిత్వం. ఒక ఉదాహరణ చూద్దాం. తుఫాను వస్తుందని మీకు ముందే తెలుసు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఊహించిన దాని కన్నా పెద్ద తుఫాను వచ్చి ఇంటిని ఊడ్చుకుపోతే? ‘నాకు ఇలాంటి దుర్ఘటనలు జరగవు’ అనుకోవటం అవివేకుల లక్షణం. ‘ఎలాంటి దుర్ఘటనలు జరిగినా నేను ఎదుర్కొంటాను’ అనుకోవటం వివేకవంతుల లక్షణం. ఇలాంటి వివేకాన్ని పంచగలిగాడు కాబట్టే రాముడు అందరికీ ఆరాధ్యుడయ్యాడు. రాముడు ఎంత విపరీతం ఎదురయినా.. చెక్కు చెదరకుండా.. సత్యమార్గాన్ని వీడకుండా.. స్వధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే కొందరు విపత్తులను కావాలని.. జీవితం సజావుగా సాగకూడదని కోరుకుంటారు. భగవంతుడు తమకు సమస్యల ద్వారా పరీక్షలు పెడితే.. మరణించే ముందు తమకు తాము తెలుసుకొనే అవకాశముంటుందని వారు నమ్ముతారు. సాధనా క్రమంలో ఎంత పరిపక్వత సాధించామనే విషయాన్ని తెలుసుకోవటానికి ఎలాంటి విపత్తులనైనా ఆనందంగా ఎదుర్కొంటారు. మరణం ఆసన్నమయినప్పుడు ఏ మాత్రం తొణకకుండా దానిని హుందాగా అక్కున చేర్చుకోవాలనేది వీరి తపన.


అవలీలగా...

మీ జీవితంలో మీరేం చేశారు.. ఎంత సంపాదించారు.. ఏం జరిగిందీ.. ఏం జరగలేదు.. వంటి విషయాలకు ఎటువంటి విలువా లేదు. సంకటస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఒడ్డుకు ఎలా చేరారనేదే ముఖ్యం. శ్రీరాముడిలా అన్ని కష్టాలను అవలీలగా..హుందాగా ఎలా ఎదుర్కొన్నారన్న విషయంపైనే జీవిత సాఫల్యం ఆధారపడి ఉంటుంది. మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంద్రభవనం లాంటి ఇంటిని ఆనుకుని.. ఓ పూరి గుడిసె కూడా ఉంటుంది. పొరిగింటివాడంత ఐశ్వర్యం లేకపోయినా.. పూరి గుడిసెలో ఉన్నవాడూ అంత గర్వంగానూ ఉంటాడు. దీనికి కారణం అతనికి ఉన్న స్వాభిమానం. దీనికి సిరిసంపదలతో సంబంధం లేదు. ఈ స్వాభిమానం ఉంటే ఉరికంబం వైపు కూడా హుందాగానే నడుస్తారు. అయితే కేవలం స్వాభిమానం ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న బాహ్య పరిస్థితులను తప్పకుండా చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే దానిలో మనతో పాటుగా ఇతరుల హితం కూడా ఉంది. రాముడే దీనికి ఉదాహరణ. ఆయన తన బాహ్యపరిస్థితులను చక్కదిద్దుకోవటానికి ప్రయత్నించాడు. కొన్ని సార్లు విఫలమయ్యాడు. కొన్ని సందర్భాలలో పరిస్థితులు చేయి జారిపోయినట్లు కనిపిస్తాయి కూడా. అయినా ఆయన శాంతాన్ని కోల్పోలేదు. తనకు అనుకూలంగా పరిస్థితులను సృష్టించుకున్నాడు. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన పాఠం. మీ అంతరంగా పరిమళాలు వెదజల్లే పుష్పాలుగా వికసించాలంటే.. దానికి అనువైన వాతావరణాన్ని మీరే సృష్టించుకోవాలి.


పొరిగింటివాడంత ఐశ్వర్యం లేకపోయినా.. పూరి గుడిసెలో ఉన్నవాడూ అంత గర్వంగానూ ఉంటాడు. దీనికి కారణం అతనికి ఉన్న స్వాభిమానం. దీనికి సిరిసంపదలతో సంబంధం లేదు. ఈ స్వాభిమానం ఉంటే ఉరికంబం వైపు కూడా హుందాగానే నడుస్తారు.

ప్రేమాశీస్సులతో సద్గురు

ఈ వార్తలు కూడా చదవండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:29 AM