Share News

Silent Struggles: ఆ ఆసక్తి కొరవండిదా

ABN , Publish Date - Apr 08 , 2025 | 06:36 AM

మహిళల్లో లైంగిక ఆసక్తి లోపం జీవితం యొక్క వివిధ దశల్లో సహజంగానే ఎదురవుతుంది. ఆరోగ్య, మానసిక, హార్మోన్ సమస్యలను పరిష్కరించి మందుల సహాయంతో ఆసక్తిని తిరిగి పొందొచ్చు

Silent Struggles: ఆ ఆసక్తి కొరవండిదా

హిళల్లో లైంగికాసక్తి లోపం అత్యంత సహజం. జీవితంలోని వేర్వేరు దశల్లో, వేర్వేరు ఆరోగ్య కారణాలతో ఈ పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. అలాంటప్పుడు మానసికంగా కుంగిపోకుండా మూల కారణాన్ని సరిదిద్దుకోవడంతో పాటు, లైంగికాసక్తిని పెంచే మందులు వాడుకోవాలంటున్నారు వైద్యులు.

లైంగికాసక్తి లోపం ఏ వయసులోనైనా తలెత్తవచ్చు. లైంగిక కోరికలు తగ్గినప్పుడు, అందుకు కారణాలను వెతికి వాటిని సరిదిద్దుకోవడం మీద దృష్టి పెట్టాలే తప్ప, పరిస్థితితో సర్దుకుపోయే ప్రయత్నం చేయడం సరి కాదు. ఈ ఆసక్తి లోపించడానికి ప్రధాన కారణాలు ఏవంటే....

స్ర్కీన్‌ టైమ్‌: పక్క గదిలో ఉన్న భర్తతో వాట్సాప్‌ మెసేజీలతో సంభాషించే భార్యలున్నారు. లేదంటే ఒకే పడక మీద వేర్వేరు ఫోన్లలో మునిగిపోయే దంపతులూ ఉన్నారు. దంపతులిద్దరూ కలిసి తినడం, కలిసి బయటకు వెళ్లడం, కలిసి సినిమా చూడడం లాంటివన్నీ తగ్గిపోయి, ఎవరి ఫోన్లలో వాళ్లు మునిగిపోయే పరిస్థితి పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలు, ఓటిటిలు, ఫోన్‌కాల్స్‌.... వీటితో అన్యోన్యంగా గడపవలసిన సమయాన్ని స్ర్కీన్స్‌తో వృథా చేసుకునే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. ఈ ధోరణితో లైంగికాసక్తి కుంటుపడడం అత్యంత సహజం.

ఆరోగ్య కారణాలు: మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్‌ సమస్యలు లైంగికాసక్తి మీద ప్రభావాన్ని కనబరచడంతో పాటు, లైంగికాసక్తి లోపాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే ఈ సమస్యలకు వాడుకునే మందుల దుష్ప్రభావాల వల్ల కూడా లైంగికాసక్తి తగ్గుతుంది.

మానసిక కారణాలు: మానసిక కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళనలు కూడా లైంగికాసక్తిని కుంటుపరుస్తాయి. వీటిని అధిగమించేవరకూ సెక్స్‌ పట్ల ఆసక్తి పెరగకపోవచ్చు. అలాగే తమ శరీరంలో లేని లోపాలను ఊహించుకుని కుంగిపోయే మహిళలు ఉంటారు. లైంగికాసక్తి లోపానికి ఈ లక్షణం కూడా ఒక కారణమే!


హర్మోన్లలో హెచ్చుతగ్గులు: గర్భిణిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలిచ్చేటప్పుడు, మెనోపాజ్‌కు చేరుకున్నప్పుడు.. ఇలా మహిళలు వారి జీవితంలో పలు దశల్లో హర్మోన్ల అవతకవకలకు లోనవుతూ, ఆయా సందర్భాల్లో లైంగికాసక్తిని కోల్పోతూ ఉంటారు. కొత్త తల్లులు పిల్లలకు పాలిచ్చినంత కాలం, లైంగికాసక్తి తగ్గిపోతుంది. ఇది అత్యంత సహజం. కొంత మంది ఆడపిల్లలకు పిసిఒడి ఉంటుంది. ఈ చికిత్సలో తీసుకునే హార్మోన్‌ మాత్రల వల్ల కోరికలు తగ్గిపోతాయి. మందులున్నాయి

లైంగికాసక్తి లోపానికి మూల కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దుకోగలిగితే సమస్య పరిష్కారమవుతుంది. అధిక బరువు తగ్గి, థైరాయిడ్‌, పిసిఒడి, అధిక రక్తపోటు సమస్యలను అదుపు చేసుకోగలిగితే, ఆ సమస్యలకు వాడే మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. తద్వారా కోల్పోయిన లైంగికాసక్తిని తిరిగి పొందవచ్చు. అయినప్పటికీ లైంగికాసక్తి పెరగనప్పుడు, ఆ ఆసక్తిని పెంచే అదనపు మందులు కూడా అవసరమవుతాయి. ఇప్పుడు తాజాగా మూడు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.


మెనోపాజ్‌లో...

మెనోపాజ్‌కు చేరుకోగానే అక్కడితో లైంగిక జీవితం ముగిసిపోయిందని కుంగిపోయే మహిళలే ఎక్కువ మంది ఉంటారు. కానీ నిజానికి లైంగిక జీవితానికి సంబంధించిన రెండో దశ, నడి వయసులోనే మొదలవుతుంది. ఈ దశలో గర్భం దాల్చే భయం ఉండదు, పిల్లలను పెంచే బాధ్యతలు ఉండవు. తీరుబడిగా ఇళ్లలో కాలక్షేపం చేసే ఆ దశను అనవసరపు కుంగుబాటుతో వృథా చేసుకోకూడదు. వయసైపోయిందని బాధపడుతూ లైంగిక క్రీడకు దూరంగా ఉండిపోకూడదు. మరీ ముఖ్యంగా పెరి మెనోపాజ్‌, మెనోపాజ్‌ దశలకు చేరుకున్న మహిళల్లో, హార్మోన్ల హెచ్చుతగ్గులకు శరీరం అలవాటుపడడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ సమయంలో హార్మన్ల హెచ్చుతగ్గుల వల్ల లైంగికాసక్తి కొరవడుతుంది. తర్వాత పరిస్థితి సర్దుకున్నప్పటికీ కొందర్లో తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలు కూడా వేధిస్తాయి. అలాంటప్పుడు హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ తీసుకోవచ్చు. హార్నోమ్‌ ప్యాచెస్‌ కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. వీటికి తోడు లైంగికాసక్తిని పెంచే మాత్రలు, శరీర అసౌకర్యాన్ని తొలగించే లూబ్రికెంట్లు కూడా వాడుకోవచ్చు. క్యాల్షియం మాత్రలతో ఎముకలను దృఢంగా ఉంచుకోగలిగితే, ఈ వయసులో ఒళ్లు నొప్పులు వేధించకుండా ఉంటాయి. వ్యాయామంతో శరీరాన్ని చురుగ్గా ఉంచుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, మనసును హుషారుగా ఉంచుకోగలిగితే, మెనోపాజ్‌లో సైతం, మునుపటిలా లైంగికాసక్తిని పుంజుకోగలుగుతారు.

-డాక్టర్‌ షర్మిల మజుందార్‌

సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకొ అనలిస్ట్‌

Updated Date - Apr 08 , 2025 | 06:36 AM