Viral: అపాయింట్‌మెంట్ లెటర్ అందిన మరుసటి రోజే రిటైర్మెంట్.. టీచర్‌కు వింత అనుభవం!
ABN , Publish Date - Jan 03 , 2025 | 10:59 AM
బీహార్‌లో ఓ ప్రభుత్వ టీచర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. స్పెషల్ టీచర్‌గా ఎంపికై నియామకపత్రం అందుకున్న మరుసటి రోజే ఆమెకు 60 ఏళ్లు నిండటంతో రిటైర్ కావాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో తాజాగా ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక టీచర్ జాబ్‌కు ఎంపికైన ఓ మహిళ ఉద్యోగంలో చేరాల్సిన తేదీకి ఒక రోజు ముందే రిటైర్ కావాల్సి వచ్చింది. జమూయీ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది (Viral).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, జిల్లాలోని ఖైరా బ్లాక్‌కు చెందిన అనితా కుమారి అనే కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలు ప్రత్యేక టీచర్ పోస్టుకు ఎంపికయ్యారు. డిసెంబర్ 30న ఆమె అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నారు. జనవరి 1 నుంచి 7 తారీకు మధ్య రిపోర్టు చేయాలంటూ ఆమె నియామకపత్రంలో ఉంది. కానీ, డిసెంబర్ 31కే ఆమెకు 60 ఏళ్లు నిండటంతో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
Viral: ప్రపంచంలో అతి భారీ ట్రాఫిక్ జామ్! 100 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
అనితా కుమారి 2006లో పంచాయతీ స్కూల్ టీచర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 2014లో టెట్ పరీక్ష ఉత్తీర్ణురాలైన ఆమె హైస్కూల్ టీచర్ అయ్యారు. ఇక మార్చి 2024లో ఆమె కాంపిటెన్సీ వన్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి స్పెషల్ టీచర్‌గా ఎంపికయ్యారు. ఆ తరువాత నియామకపత్రం వచ్చినా ఆ మరుసటి రోజే పదవీవిరమణ చేయాల్సి రావడంతో ఆమె లక్ష్యాన్ని అడుగు దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది.
Viral: ఇది అత్యంత చిన్న దేశం.. ఇక్కడి సైనికులకు మాత్రం ఏకంగా రూ. కోటి జీతం!
ఈ పరిణామంపై అనితా కుమారి స్పందించారు. రిటైర్మెంట్ వచ్చేయడంతో తనకు స్పెషల్ టీచర్‌గా కొనసాగేందుకు అనుమతి లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. అయితే, పాఠశాల విద్యార్థులు, సహ అధ్యాపకులు మాత్రం ఆమెకు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ‘‘నేను ప్రభుత్వ స్కూల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తు్న్నాను. కాంపిటెన్సీ టెస్టులో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలినయ్యాను. కానీ దురదృష్టవశాత్తూ నేను జాయినింగ్‌కు ఒక రోజు ముందే రిటైర్ కావాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఇది నిబంధనలకు సంబంధించిన అంశం. ఈ విషయంలో ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు’’ అని అన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ కూడా ఈ ఉదంతంపై స్పందించింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం, 60 ఏళ్ల దాటాక రిటైర్మెంట్ తప్పదని పేర్కొంది. అయితే, నిబంధనల ప్రకారం ఆమె స్పెషల్ టీచర్‌గా ఎంపికయ్యారు కాబట్టి నియామక పత్రం జారీ చేయాల్సి వచ్చిందని వివరించింది.
Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్