Share News

Space Tourism Cost: అంతరిక్ష యాత్రలకు ఖర్చు ఎంత.. ఉచితంగా కూడా వెళ్లి రావొచ్చని తెలుసా

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:09 PM

అంతరిక్ష యాత్రలకు ఖర్చు ఎంత అవుతుంది ఉచితంగా ఈ జర్నీ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు నెట్టింట ప్రస్తుతం ట్రెండవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏంటంటే..

Space Tourism Cost: అంతరిక్ష యాత్రలకు ఖర్చు ఎంత.. ఉచితంగా కూడా వెళ్లి రావొచ్చని తెలుసా
Space Tourism Cost

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు విమాన ప్రయాణాలంటే అబ్బురంగా అనిపించేది. ఇప్పుడు అంతరిక్ష యాత్రలు కూడా సర్వ సాధారణంగా మారిపోయింది. ప్రముఖ పాప్ స్టార్ కేటీ పెర్రీ అంతరిక్ష యాత్ర తరువాత మరోసారి ఈ టాపిక్ నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. డబ్బున్నోళ్లే ఈ యాత్ర చేయగలరన్న విషయం అందరికీ తెలిసినా అసలు ఈ యాత్రకు ఖర్చు ఎంత, ఎవరిని అనుమతిస్తారు అన్న ప్రశ్నలకు జనాలు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు. అయితే, ఈ యాత్రలను పైసా ఖర్చు లేకుండా చేయొచ్చన్న విషయం కూడా ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ ద్వారా పాప్ స్టార్ కేటీ పెర్రీ అంతరిక్ష యాత్ర చేశారు. ఈ యాత్రలో పాల్గొన్న వారందరూ మహిళలే. జెఫ్‌ బెజోస్‌కు కాబోయే భార్య లారెన్ కూడా ఇందులో ఉన్నారు. దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూవాతావరణం అంచుల వరకూ వెళ్లి వచ్చారు. అయితే, ఈ యాత్రకు ఖర్చు ఎంతైందీ.. ఒక్కో సెలబ్రిటీ ఎంత చెల్లించిందీ మాత్రం బ్లూ ఆరిజిన్ సంస్థ వెల్లడించలేదు.

బ్లూ ఆరిజిన్ యాత్రకు టిక్కెట్ బుకింగ్ ఇలా..

వాస్తవానికి బ్లూ ఆరిజిన్ ద్వారా ఎవ్వరైనా అంతరిక్ష యాత్ర చేసి రావచ్చు. కావాల్సిందల్లా డబ్బు మాత్రమే. అంతరిక్ష యాత్ర చేద్దామనుకునే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోని రిజర్వేషన్ పేజీలో ఓ దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తులు తమ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ తదితర వివరాలతో పాటు తమ గురించి 500 పదాల్లో వ్యాసరూపంలో చెప్పాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే ఈ యాత్రకు అర్హులు,


జర్నీకి ఖర్చెంత..

బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా అంతరిక్ష యాత్రకు ఖర్చెంత అవుతుందన్నది మిస్టరీనే. దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు ముందుగా 150,000 డాలర్లు చెల్లించాలన్న సూచన రిజర్వేషన్ పేజీ చివర్లో ఉంటుంది. అయితే ఈ డబ్బు పూర్తిగా రిఫండబుల్. ఇక 2021లో బ్లూ ఆరిజిన్ నిర్వహించిన తొలి అంతరిక్ష యాత్ర సందర్భంగా వ్యోమనౌకలోని ఓ సీటును వేలం వేయగా 28 మిలియన్ డాలర్లు వచ్చాయి. అయితే, బ్లూ ఆరిజిన్‌కు పోటీగా ఉన్న మరో సంస్థ వర్జిన్ గాలెక్టిక్ మాత్రం ఒక్కో యాత్రకు 2 లక్షల నుంచి 4.5 లక్షల డాలర్ల వరకూ వసూలు చేస్తుంది.

వీళ్లకు మాత్రం ఉచితంగా అంతరిక్ష యాత్ర

బ్లూ ఆరిజన్ ద్వారా కొందరు ఉచితంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చారు. అయితే వీరందరూ ప్రముఖలు, సమాజంలో పలుకుబడి హోదా ఉన్న వారు. స్టార్ ట్రెక్ నటుడు విలియమ్ షాట్‌నర్, అమెరికా టెలివిజన్ హోస్ట్ మైఖేల్ స్టాహన్ ఉచితంగానే బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేసొచ్చారు. ప్రత్యేక అతిథులుగా వారికి ఈ అవకాశం దక్కిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.


‘‘అంతరిక్ష యాత్రలంటే కేవలం డబ్బుతో ముడిపడినవి కావు. నువ్వు ఎవరు, సమాజంలో నీ పలుకుబడి, హోదా, యాత్ర లక్ష్యాలకు నీ అభిప్రాయాలు కలుస్తాయా లేదా అన్న అంశాలపైనే ఇది ఆధార పడి ఉంటుంది’’ అని స్పేస్ ట్రావెల్ బుకింగ్ కంపెనీ స్పే్స్ వీఐపికి చెందిన ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ఇక తాజాగా మహిళలు నిర్వహించిన అంతరిక్ష యాత్రలో కూడా కొందరు ఉచితంగానే జర్నీ చేసి వచ్చారట. కానీ వారి వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

వృద్ధుడిని చీదరించుకుంటున్న జనం.. ఇతడు ఏం చేశాడో తెలిస్తే..

17 డాక్టర్లకు సాధ్యం కానిది చేసి చూపించిన చాట్ జీపీటీ

యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై

Read Latest and Viral News

Updated Date - Apr 15 , 2025 | 05:19 PM