Viral: భారత పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకుడిని మోసం చేసే ప్రయత్నం! చివరకు..
ABN, Publish Date - Feb 09 , 2025 | 05:48 PM
విదేశీ పర్యాటకుడి నుంచి అదనపు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఓ ఢిల్లీ యువకుడి ఆటలకు స్థానికులు అడ్డుకట్ట వేశారు. ఒక్క పైసా అదనంగా ఇచ్చేది లేదని అతడిని తిప్పి పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: పురాతన సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన భారత్‌కు నిత్యం ఎందరో విదేశీ ప్రయాణికులు వస్తుంటారు. ఇక్కడి ఆధ్యాత్మిక వైశిష్ట్యాన్ని చూడాలని కోరుకుంటారు. అయితే, విదేశీ పర్యాటకులను ఇబ్బంది పెట్టి అదనపు డబ్బులు వసూలు చేసేందుకు ఆటోవాలాలు, టూర్ గైడ్‌ల వంటి వారు ఒక్కోసారి ప్రయత్నిస్తుంటారు. అతిథి దేవో భవ, అతిథులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా కూడా జనాల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ వీడియో వైరల్ అవుతోంది. విదేశీ పర్యాటకుడిని ఇబ్బంది పెట్టబోయిన ఓ టూర్‌గైడ్ తీరుపై జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు (Viral).
Viral: విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, బల్గేరియాకు చెందిన యూట్యూబర్ విక్టర్ బ్లాహో ఇటీవల ఢిల్లీలో పర్యటించాడు. ఈ సందర్భంగా అక్కడి దర్శనీయ స్థలాలు చూపించేందుకు ఓ గైడ్ సాయం తీసుకున్నాడు. రూ.500కు బేరం కుదిరింది. దాదాపు గంటన్నర పాటు వారు ఢిల్లీలోని పలు ప్రాంతాలను చుట్టొచ్చారు. ఇద్దరు కలిసి భోజనం కూడా చేశారు. టూర్ ముగిశాక గైడ్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. రూ.2 వేలు ఇవ్వాలంటూ పట్టుబట్టాడు. నడి రోడ్డు మీద వాదనకు దిగాడు. కానీ, విక్టర్ మాత్రం సహనం కోల్పోలేదు. రూ.500 మించి పైసా ఇచ్చేది లేదని సౌమ్యంగానే స్పష్టం చేశాడు. కానీ గైడ్ మాత్రం వాదన పెద్దది చేశాడు.
Viral: అనుమతి లేకుండా తొటి ప్రయాణికుడి చార్జర్ తీసుకున్న మహిళ! ఎందుకని ప్రశ్నిస్తే..
విదేశీ పర్యాటకుడి ఇబ్బంది గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు యువకుడిని నిలదీశారు. ఇద్దరు ఎంత సేపు నగరంలో పర్యటించారని అన్నారు. గైడ్ ఏమో తాము గంటన్నర తిరిగామని అన్నాడు. దీంతో, అతడికి గడ్డి పెట్టిన స్థానికులు.. విదేశీ టూరిస్టు ఇచ్చింది తీసుకోమని తేల్చి చెప్పారు. అతడికి రూ.200కు మించి ఇవ్వొద్దని విదేశీ పర్యాటకుడికి కూడా సూచించారు. అయితే, విక్టర్ మాత్రం రూ.500 ఇచ్చేశాడు. దీంతో, స్థానికులు ఆ గైడ్‌ను అక్కడి నుంచి పంపించేశారు.
ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా సదరు గైడ్‌పై జనాలు దుమ్మెత్తిపోశారు. ఇలా చేస్తేనే విదేశీయుల ముందు దేశం పరువు మంట కలిసేది అంటూ మండిపడ్డారు. వీళ్లల్లో మార్పు ఎప్పటికీ రాదేమో అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఇక విదేశీయుడికి అండగా నిలిచి స్థానికులపై కూడా నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
Updated Date - Feb 09 , 2025 | 05:50 PM