ప్రకృతి ఒడిలో పరవశం..
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:26 PM
కొండలు, లోయల్లో ప్రయాణం... కనుచూపు మేర పచ్చందనమే... హిమాలయాలకు చేరువగా ఉకొండలు, లోయల్లో ప్రయాణం... కనుచూపు మేర పచ్చందనమే... హిమాలయాలకు చేరువగా ఉండే ఉత్తరాఖండ్ ఎప్పుడూ మంచుదుప్పటి కప్పుకునే ఉంటుంది. అక్కడి కత్గోడం, కౌసాని, బిన్‌సార్, అల్మోరా ప్రాంతాల్లో పర్యటన అంటే అచ్చంగా ప్రకృతిలో పరవశించడమే.
కొండలు, లోయల్లో ప్రయాణం... కనుచూపు మేర పచ్చందనమే... హిమాలయాలకు చేరువగా ఉకొండలు, లోయల్లో ప్రయాణం... కనుచూపు మేర పచ్చందనమే... హిమాలయాలకు చేరువగా ఉండే ఉత్తరాఖండ్ ఎప్పుడూ మంచుదుప్పటి కప్పుకునే ఉంటుంది. అక్కడి కత్గోడం, కౌసాని, బిన్‌సార్, అల్మోరా ప్రాంతాల్లో పర్యటన అంటే అచ్చంగా ప్రకృతిలో పరవశించడమే. ఆ విశేషాలే ఇవి...ండే ఉత్తరాఖండ్ ఎప్పుడూ మంచుదుప్పటి కప్పుకునే ఉంటుంది. అక్కడి కత్గోడం, కౌసాని, బిన్‌సార్, అల్మోరా ప్రాంతాల్లో పర్యటన అంటే అచ్చంగా ప్రకృతిలో పరవశించడమే. ఆ విశేషాలే ఇవి...
హైదరాబాద్ విమానాశ్రయంలో రద్దీ చూసి పొరపాటున బస్టాండ్‌కి వచ్చామా అనే అనుమానం కలిగింది. బస్సులు, రైళ్ళు, థియేటర్‌లో సినిమా మొదటి 15 నిమిషాలు మిస్ అవడం... ఈ లిస్ట్‌లో విమాన ప్రయాణం కూడా జత చేరిందని తెలియగానే మా ముగ్గురి మొహాలు కళ తప్పాయి. గుడ్డిలో మెల్ల ఏమిటంటే, మా లాంటి బాధితులు చాలామందే ఉండేసరికి, సదరు విమాన సంస్థవాడు మమ్మల్ని పక్కకి తీసుకెళ్ళి బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా, పంత్నగర్ (ఉత్తరాఖండ్)కి ఆ రోజు వేరే సర్వీస్ లేదు కాబట్టి డెహ్రాడూన్‌కి (కొద్దిగా ఎక్కువే డబ్బులు కట్టి మరీ) తొమ్మిది గంటల ఫ్లైట్‌కి టికెట్ ఇచ్చాడు. డెహ్రాడూన్‌తో కొద్దిగా పూర్వ అనుబంధం ఉండడం వలన ఒక రకంగా మనసు తేలికపడింది. హైదరాబాద్‌లో విమానం ఎక్కకముందే, డెహ్రాడూన్ ‘కత్గోడం ఎక్స్‌ప్రెస్’ రైలులో కత్గోడం కి టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ రైలులో రాత్రి పదకొండున్నరకి ఎక్కితే, పొద్దున్నే ఏడు గంటలకి కత్గోడం చేరుకున్నాం. పంత్నగర్ విమానాశ్రయం దగ్గర ఎక్కాల్సిన టాక్సీని ముందుగానే మాట్లాడుకుని, కత్గోడం రైల్వేస్టేషన్‌కి రమ్మన్నాం.
ముందుగా భీంతాల్‌లో ఆగి, అక్కడ నుంచి బిన్‌సార్, ముక్తేశ్వర్, చివరగా కౌసాని వెళ్దామనేది మొదటి ప్లాన్. కానీ టాక్సీడ్రైవర్ ఇచ్చిన సూచన ఏమిటంటే ముందుగా దూర ప్రదేశానికి (కౌసానికి) వెళ్ళి, అక్కడి నుంచి మా తిరుగు ప్రయాణం పంత్నగర్ నుంచి కాబట్టి, ఆ వైపుగా ప్రయాణిేస్త మంచిదని. లాజికల్‌గా ఆలోచిస్తే అదే సరైన నిర్ణయం అనిపించింది. స్థానికులు, గూగుల్‌ని సంప్రదించే టూర్ ప్లాన్ చేసినా, టాక్సీడ్రైవర్ల అనుభవం ముందు ఏదీ పనికిరాదు అనిపించింది.
కత్తెరను పోలిన కొండలు...
కత్గోడం నుంచి బయలుదేరి టిఫిన్ చేయడానికి 9 కి.మీ. దూరంలో ఉన్న భొవాలిలో కొండ పక్కనే ఒక హోటల్ దగ్గర ఆగాం. దూరంగా ఉన్నా, దగ్గరే అనిపిస్తున్న మధ్య హిమాలయ పర్వత శ్రేణులు, ఒకదాని మీదకి ఒకటి పెరుగుతూ వస్తున్నట్లే భ్రమ. ఆపైన పచ్చటి తివాచీ పరచిన కొండల నడుమ అక్కడక్కడా పొడవాటి పైన్ చెట్లు. భీంతాల్‌కి వెళ్ళే దారిలోనే ‘ కైంచీ ధామ్’ ఆశ్రమం పైనుంచే చూశాం. జనం పోటెత్తినట్లుగా ఉన్నారు. చుట్టూ కొండలు, అడవులు, పక్కనే ప్రవహిస్తున్న కోసి నది కైంచీ ధామ్ ప్రత్యేకత. నీం కరోలీ బాబా మహారాజ్ ఈ ఆశ్రమాన్ని స్థాపించాడని, అందరి బాబాల్లాగే ఏవో మహిమలు చూపించి, ప్రవచనాల ద్వారా పేరు సంపాదిం చాడని, డ్రైవర్ చెప్పినదాని బట్టి అర్థమైంది. రెండు కొండలు ఒక దానికి ఒకటి అడ్డంగా పెరిగి, కత్తెర ఆకారం వలన ‘కైంచీ’ (కైంచీ అంటే కత్తెర) అనే పేరు వచ్చిందని తెలిసింది.
అల్మోరా గోపేశ్వర్ మార్గం మధ్యలో భోజనం చేసుకుని, ఐదున్నర గంటలు (134 కి.మీ.) ప్రయాణం చేసి కౌసానికి చేరుకున్నాం. మా అమ్మాయి, ఎక్కడ ఎలా జల్లెడ పట్టిందో తెలియదు కానీ, కొండపైన లోయ వాలుగా, ఎదురుగా పొడవాటి చెట్లు, సుదూరంగా మబ్బులతో దోబూచులాడుతున్న హిమాలయ కొండలు... మధ్యలో అతి సుందరమైన ఒక పర్ణశాల. ముందు చిన్న వరండా, లోపల చిన్న హాల్‌లో భాగంగానే, వంటిల్లు, మరో పక్క బాత్రూమ్. వంటింట్లో చేతికి అందేలా వంటసామాన్లు, సరుకులు, ఒక బుల్లి ఫ్రిజ్. ఓ పక్కగా పైకి తేలికగా ఎక్కగలిగే కొద్దిపాటి మెట్లు. పైన చిన్న పార్టీషన్‌తో రెండు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. కిటికీలు తెరిేస్త ఎదురుగా పరుచుకున్న లోయ. అన్నింటికన్నా నచ్చింది ఇంటి ముందు తోటలో పూల మొక్కలు. ఆ ఇంటికి సంబంధించినవి ఏవైనా కళాత్మకంగా, అందంగా ఉంటే, ప్రకృతి మరింత సొగసుని అలవోకగా అద్దింది.
కొద్ది ేసపు విశ్రాంతి తీసుకుని, కౌసానిలో చూడదగ్గ ప్రదేశాల్లో దగ్గరే ఉన్న ‘అనాసక్తి ఆశ్రమం’కి వెళ్లాం. 1929లో గాంధీగారు కౌసానికి వచ్చినప్పుడు ఈ ప్రకృతిని చూసి ‘భారత దేశ స్విట్జర్లాండ్’ అన్నారట. వాతావరణం నచ్చి ఆయన ఇక్కడే రెండు వారాలుండి ‘అనాసక్తి యోగ’ సాధన చేశారు. అనాసక్తి యోగాకి ప్రేరణ భగవద్గీత అని, మెటీరియలిస్టిక్ ధోరణి విడనాడి, భౌతిక వస్తువుల మీద ఆసక్తి లేదా అనుబంధం పెంచుకోరాదనేది ఈ యోగ ముఖ్య సారాంశం. ‘అనాసక్తి ఆశ్రమం’ కొండపైన ఒక చిన్న కుటీరంలా ఉండి, గాంధీ జీవితచరిత్రకి సంబంధించిన ఫొటోలు ప్రదర్శించారు. అక్కడే ప్రత్యేకంగా ధ్యానం, ప్రార్థన చేసుకునే గదులున్నాయి.
గోమతి నది ఒడ్డున పార్వతీ పరమేశ్వరులు
ఉత్తరాఖండ్‌లో అందమైన ప్రకృతితో పాటు ఎక్కువగా దేవాలయాలున్నాయని, మౌనా దగ్గరున్న బోర్డు మీద చూశాం. రెండవ రోజు మేము వెళ్ళిన బైద్యనాథ్ గుడి కాట్యూరి సామ్రాజ్యానికి రాజధాని కార్తికేయపురంగా వెలుగొందిన ప్రదేశం. చాలా పురాతనమైనది, ఎంతో పేరు పొందింది. ఇక్కడి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు పన్నెండవ శతాబ్దానికి చెందినవి. ఇందులో పద్దెనిమిది గుళ్ళు ఉండగా, గ్యాన్‌చంద్ హయాంలో పునరుద్దరించారని తెలిసింది. మళ్ళీ 17వ శతాబ్దంలో రోహిల్లాలు మందిర గోపురాన్ని ధ్వంసం చేశారట. ఈ బైద్యనాథ్ గుడి గోమతి నది ఒడ్డున, సముద్రమట్టానికి 1125 మీటర్లు ఎత్తులో ఉంది. అతి తక్కువ గుళ్ళల్లో ఇలా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు కలిసి ఉండడం చూస్తామేమో. కాట్యూరి రాజులు శివ, గణేశ్, పార్వతి, చండిక, కుబేరుడు, సూర్య, బ్రహ్మ... ఇలా అందరికీ గుళ్లు కట్టించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో, శివుడిని వైద్యదేవుడిగా భావించి, బైద్యనాథ్‌గా కొలుస్తారు. ప్రధాన గుడిలో నల్లరాతిలో చెక్కిన పార్వతి కొలువై ఉండగా, బయట కాలభైరవ విగ్రహం ఉంది. ఆ రోజు ఆషాఢమాసం ఆఖరి రోజు కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువే ఉంది.
మరుసటి రోజు 60 కి.మీ. దూరంలో 8 వేల అడుగుల పైన ఉన్న ‘బిన్‌సార్ అభయారణ్యం’ మా మజిలీ. సుమారుగా రెండు గంటల ప్రయాణం. పదకొండు నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు కుమావ్ ప్రాంతాన్ని పాలించిన చాంద్ రాజవంశం బిన్‌సార్ ప్రదేశాన్ని వేసవి విడిదిగా, జంతు వేటకి వాడుకున్నారు. మధ్య హిమాలయాల ప్రాంతానికి చెందిన ఓక్ చెట్లు, మరీ ముఖ్యంగా వెడల్పు ఆకుల ఓక్ చెట్లు (క్వెర్కస్ జాతి) అంతరించిపోకుండా కాపాడి, సంరక్షించడానికి, 1988లో ఈ ప్రదేశాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. పైకి వెళ్ళే కొద్దీ ఓక్, రోడోడెండ్రాన్ చెట్లుఎక్కువున్నాయి. ఓక్ చెట్లు పచ్చటి ఫెర్న్ మొక్కల స్వెటర్ తొడుక్కోవడం ఎంతో ముచ్చటగా అనిపించింది. ఇక జీరో పాయింట్ దగ్గర సుదూరంగా హిమాలయాల పర్వత శ్రేణులు, మబ్బులతో దోబూచులాడేయి. అనంతంగా పరుచుకున్న లోయ, వెనక హిమాలయ శ్రేణులు కళ్ళముందు మెదులుతుండగా, కిందకి రావడం కష్టమే అయినా శ్రమే అనిపించలేదు.
అత్యంత శక్తిమంతమైన ప్రాంతం ...
అక్కడి నుంచి (బిన్‌సార్) 30 కి.మీ. దూరం, అల్మోరాకి 10 కి.మీ. సమీపాన ఉన్న కసార్‌దేవి గుడికి వెళ్ళాం. గుడి నిర్మాణం రెండవ శతాబ్దంలో జరిగినట్లు చెప్తున్నా, గుడి పరిసరాలని చాలా శుభ్రంగానే ఉంచారు. 1890లో వివేకానందుడితో పాటు దేశ, విదేశాలనుంచి ఎందరో తత్వవేత్తలు, కళాకారులు ధ్యానం చేసుకోడానికి రావడం వలన ఈ గుడికి మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కసార్ దేవి గ్రామాన్ని, హిప్పీల కొండ, క్రాంక్ రిడ్జ్ అని కూడా అంటారు. ఇదొక కళాకారుల, ఆధ్యాత్మిక గురువుల సంగమ ప్రదేశం. ఇక్కడి కొండ రాళ్ళమీద కూర్చుని కొందరు ధ్యానం చేయడం కనిపించింది.
కసార్ దేవి గుడికి మరో ప్రాముఖ్యత ఉంది. నాసా పరిశోధన ప్రకారం, ఈ ప్రదేశంలో వాన్ అల్లెన్ బెల్ట్ ప్రభావం ఉందని, కాస్మిక్ కిరణాలు, సూర్య కిరణాల సంగమంతో ఒక శక్తిమంతమైన విద్యుదయస్కాంత శక్తి తయారయ్యిందని కనిపెట్టారు. ప్రపంచంలో ఇలాంటి అతి పురాతనమైన, ఆధ్యాత్మికమైన, శక్తిమంతమైన ప్రదేశాలు మూడే ఉన్నాయని అక్కడి బోర్డు మీద చదివి ఆశ్చర్యపోయాం. వాటిలో మొదటిది పెరూలోని ‘మాచు పిచు’, రెండవది ఇంగ్లాండ్ లోని ‘స్టోన్‌హింజ్’. కసార్‌లో ప్రకృతి నిశ్శబ్దంగా ప్రశాంతతను మేళవించుకుని అద్భుతంగా తోచింది. కసార్‌దేవి నుంచి అల్మోరాకి వెళ్ళి ఆ రోజు రాత్రి, కొండవాలు మీదున్న ఒక ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో బస చేశాం. మరుసటి రోజు, ముక్తేశ్వర్‌కి ప్రయాణం. దారి పొడవునా దట్టమైన అడవులు, చల్లటి వాతావరణం. ముందుగా ముక్తేశ్వర్‌కి 14 కి.మీ. దూరంలో ‘భాలూగాడ్’ జలపాతం ఉంది. కిలోమీటరు పైనే కొండ ఎక్కి నడిచి వెళ్తే, స్వచ్ఛమైన నీటితో నిండిన జలపాతం ఆకట్టుకుంది. అక్కడికి ఎలుగుబంట్లు ఎక్కువగా వస్తాయని, అందుకే ‘భాలూగాడ్’ అనే పేరు వచ్చిందని చెప్పారు.
ముక్తేశ్వర్ గుడి సుమారుగా 2 వేల మీటర్ల ఎత్తున ఉంది. అక్కడి నుంచి నందాదేవి, నందకోట్, త్రిశూల్ మొదలైన హిమాలయాల పర్వత శ్రేణులు చూడొచ్చు. 400 ఏళ్ళ పురాతనమైన ఈ గుడిని పాండవులు తమ 12 ఏళ్ళ వనవాసంలో, కష్టాల నుంచి ముక్తి చెందడానికి, ఇష్టదైవమైన శివుడి గుడి కట్టించారని చెబుతారు. శివుడు ఒక రాక్షసుడిని చంపి, ముక్తిని ప్రసాదించాడని, అందుకే ముక్తేశ్వర్ అనే పేరు వచ్చిందట. గుడి ఒక చిన్న గోపురం కిందే ఉంది. పాలరాతితో చేసిన శివలింగం, బ్రహ్మ విగ్రహాలున్నాయి. గుడి పక్కనుంచి వెళ్తే ‘చౌలి-కి-జాలి’ అంటే వేలాడుతున్న క్లిఫ్... కొండలు ఎక్కే సాహసికులకు చక్కని వినోదం. పంత్నగర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఇలాంటి కొండ ప్రదేశాలకి ఆరు నెలలకు ఒకసారైనా వెళ్ళాలని ఓ వందసార్లయినా అనుకుని ఉంటాను.
- చెరుకుపల్లి లావణ్య, 94416 97943
Updated Date - Jan 12 , 2025 | 12:27 PM