Share News

విహారం... సరికొత్తగా...

ABN , Publish Date - Apr 13 , 2025 | 10:57 AM

‘బాహుబలి’ సినిమాలో ఒక పాటలో కనిపించే హంస నావ గుర్తుందా? తెరచాపలతో ఉన్న అలాంటి నావలు పూర్వం ఉన్నాయి కానీ ఇప్పుడెక్కడివి? సినిమా కోసం దానిని తయారుచేశారు. అయితే ఇండోనేషియాలో అలాంటి నౌక ఒకటి పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది.

విహారం... సరికొత్తగా...

అన్ని ప్రయాణాలు, మజిలీలు ఒకేలా ఉండవు. కొన్ని ఆనందాన్ని పంచితే, మరికొన్ని ఆహ్లాదాన్ని పంచుతాయి. కొన్ని మాత్రమే జీవితాంతం మర్చిపోలేని మధురానుభూతుల్ని అందిస్తాయి. రెగ్యులర్‌ పర్యాటక ప్రదేశాలను చాలామంది సందర్శిస్తారు. కానీ అరుదైన, ఆసక్తికర ప్రాంతాలు, ప్రయాణాలు కొన్నే ఉంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికర ప్రదేశాలు, ప్రయాణాల విశేషాలను ఇటీవల ప్రసిద్ధ ‘టైమ్‌ మ్యాగజైన్‌’ విడుదల చేసింది. వాటిలో కొన్నింటికి చూసొద్దామా!

స్వర్గ లోకంలో ప్రయాణం

‘బాహుబలి’ సినిమాలో ఒక పాటలో కనిపించే హంస నావ గుర్తుందా? తెరచాపలతో ఉన్న అలాంటి నావలు పూర్వం ఉన్నాయి కానీ ఇప్పుడెక్కడివి? సినిమా కోసం దానిని తయారుచేశారు. అయితే ఇండోనేషియాలో అలాంటి నౌక ఒకటి పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. ‘సెలెస్టియా’ అని పిలిచే ఈ నౌక ఇండోనేషియాలోని ద్వీప సమూహాల్లో ప్రయాణిస్తుంది. ఈ అందమైన నౌక 45 మీటర్ల పొడవుంటుంది. సెలెస్టియా అంటే ‘స్వర్గలోకపు అందం’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇందులో ప్రయాణం కూడా స్వర్గంలో విహరించిన అనుభూతిని అందిస్తుంది.


ఈ నౌకలో 7 సూట్‌లు ఉంటాయి. 14 మంది పర్యాటకులకు అనుమతి ఉంటుంది. సిబ్బంది సైతం 14 మంది ఉంటారు. శతాబ్దాలుగా పడవ తయారీలో పేరొందిన ‘బులుకుంబా’ తయారీదారులు దీన్ని రూపొందించారు. పురాతన హస్తకళతో ఆకట్టుకునేలా ఉంటుందీ నౌక. ఇందులో పర్యాటకులు కొమోడో నేషనల్‌ పార్క్‌, రాజా అంపట్‌, స్పైస్‌ ఐలాండ్స్‌ వంటి ప్రదేశాలను చుట్టి వస్తారు. 3 నుంచి 14 రాత్రుల వరకు ప్రయాణం ఉంటుంది. నౌక టెర్రస్‌పై కూర్చుని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఉచిత విందు భోజనం అందిస్తారు. సముద్రంలో ఉండే ప్రశాంతతను ఆస్వాదించడానికి ఈ నౌకా యానం సరైన ఎంపిక.

.


దేశం అటు నుంచి ఇటు...

దేశం ఒక చివర నుంచి మరో చివరకు మూడు రోజుల పాటు రైలు ప్రయాణం అంటే తప్పకుండా మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆస్ట్రేలియాలోని ‘ది ఘాన్‌’ రైలు ఈ కోవకు చెందినదే. ఈ రైలు ఆస్ట్రేలియాలో దక్షిణ దిక్కున చివరి నగరమైన ఎడిలైడ్‌ నుంచి ఉత్తర దిక్కులో చివరి నగరమైన డార్విన్‌ వరకు ప్రయాణిస్తుంది. సుమారు 2979 కి.మీ మేర సాగే ఈ ప్రయాణానికి మూడు రోజుల సమయం పడుతుంది. దీన్ని ‘లెజెండరీ ట్రెయిన్‌’ అని పిలుస్తారు. ఈ రైలులో గోల్డ్‌, ప్లాటినం సర్వీసులు ఆఫర్‌ చేస్తారు. సింగిల్‌, ట్విన్‌, డబుల్‌ క్యాబిన్స్‌లో ఏది కావాలో ఎంచుకోవచ్చు. గ్రూప్‌గా వస్తే ఒక బోగీ మొత్తం కేటాయిస్తారు. క్యాబిన్‌లో లాంజ్‌ సౌకర్యవంతంగా ఉంటుంది. రాత్రివేళ దీన్ని స్లీపర్‌ క్యాబిన్‌గా మార్చుకోవచ్చు. డ్రింక్స్‌, స్నాక్స్‌ అందిస్తారు. ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించేలా వసతులు ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు ఈ ప్రయాణం బాగా ఉపకరిస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ‘నార్త్‌- సౌత్‌ ట్రెయిన్‌ జర్నీ’గా దీనికి గుర్తింపు ఉంది.

book6.2.jpg


మామూలు స్టేడియం కాదు...

ఆధునిక టెక్నాలజీ అన్నింటి రూపురేఖల్ని ఇట్టే మార్చేస్తోంది. కాలిఫోర్నియాలోని ఇంగిల్‌వుడ్‌లో నిర్మించిన స్టేడియాన్ని చూస్తే... టెక్నాలజీకి ప్రేక్షకుడు ఫిదా కావాల్సిందే. ‘ఇంట్యూట్‌ డోమ్‌’గా పిలిచే ఈ ఇండోర్‌ స్టేడియాన్ని సంగీత వేడుకలు, క్రీడల కోసం సరికొత్త ప్రమాణాలతో నిర్మించారు. ఇందులో ప్రధానాకర్షణ 40 వేల చదరపు అడుగుల ‘హాలో బోర్డ్‌’. ఇది డబుల్‌ సైడ్‌ అలా్ట్ర హై డెఫినిషన్‌ డిస్‌ప్లే. స్టేడియంలోని ప్రతి సీటుకు సౌండ్‌ సిస్టమ్‌, యూఎస్‌బి పోర్టు ఉంటుంది. ప్రేక్షకులు ముఖ గుర్తింపుతో స్టేడియంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. డోమ్‌ యాప్‌ ద్వారా ఫేసియల్‌ రికగ్నిషన్‌ పనిచేస్తుంది. స్టేడియంలో అమర్చిన ప్లాజా ఎల్‌ఈడీ స్ర్కీన్‌కు లాస్‌ఏంజెల్స్‌లోనే అతి పెద్ద అవుట్‌డోర్‌ 4కె ఎల్‌ఈడీ స్ర్కీన్‌గా గుర్తింపు ఉంది. దీనికి సుమారు 23 కోట్ల ఎల్‌ఈడీ లైట్లను వినియోగించారు. స్టేడియంలో సీటింగ్‌ కెపాసిటీ 17 వేల700. ఇందులో 5వేల చదరపు అడుగుల స్థలంలో రిటైల్‌ స్టోర్‌ ఉంది. 120కి పైగా రెస్ట్‌ రూమ్‌లున్నాయి. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు 300పైగా ఉన్నాయి. ఈ స్టేడియం ద్వారా ఏటా 2,300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. నిర్మాణ సమయంలోనే 7 వేల ఉద్యోగాలు కల్పించారు. ఈ స్టేడియం ఇప్పటికే గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం సంపాదించింది.


విశ్వాన్ని చూసేందుకు...

విశ్వంలో అంతు చిక్కని రహస్యాలెన్నో... వాటి నిగ్గు తేల్చేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గ్రహాలు, వాటిపై జీవం ఉనికిని కనుక్కు నేందుకు అబ్జర్వేటరీలలో గంటల తరబడి పనిచేస్తూనే ఉన్నారు. 1894లో ఖగోళ శాస్త్రవేత్త పెర్సివల్‌ లోవెల్‌ అంగారక గ్రహంపై జీవం ఉనికిని కనుక్కునేందుకు అరిజోనాలో ప్రయోగశాలను ప్రారంభించారు. దీన్ని ‘లోవెల్‌ అబ్జర్వేటరీ’ అని పిలుస్తారు. లోవెల్‌ ప్రారంభించిన ప్రయోగశాలలో అన్వేషణ ఇప్పటికీ కొన సాగుతూనే ఉంది. అనేకమంది శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచి తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇదే ప్రయోగశాల నుంచి ఖగోళ శాస్త్రవేత్త క్లైడ్‌ టూంబాగ్‌ 1930లో ప్లూటోని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ అబ్జర్వేటరీని సందర్శకుల కోసం మరింత విస్తరించారు. ఇక్కడి టెలిస్కోపుల్లో నుంచి విశ్వంలోకి చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు. చంద్రునిపై ఎగిసిపడుతున్న ధూళిని కూడా స్పష్టంగా చూడొచ్చు. మంచుకురిసే వేళలో ఖగోళాన్ని వీక్షించేందుకు అనువుగా హీట్‌ చైర్స్‌ ఉంటాయి. గ్రహాలు, నక్షత్రాలను చూసే సమయంలో వాటిని గుర్తించేందుకు లోవెల్‌ సిబ్బంది సహకరిస్తారు. ఈ అబ్జర్వేటరీలో నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఉల్కాపాతాన్ని వీక్షించవచ్చు. ఈమధ్య ఆస్ట్రో టూరిజం బాగా పెరుగుతోంది. ఆస్ట్రో టూరిజానికి అనధికారిక రాజధానిగా అరిజోనా గుర్తింపు పొందింది.

book6.3.jpg


అమెజాన్‌ అడవిలో బస

అమెజాన్‌ అడవిని ‘లంగ్స్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌’ అని పిలుస్తుంటారు. అమెజాన్‌లో బస ఒక అద్భుతమైన అనుభవం. కొన్ని వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న అమెజాన్‌ ఇప్పటికీ అంతుచిక్కని ప్రాంతమే. రకరకాల జంతుజాతులు, చెట్లు, కీటకాలు, జీవవైవిధ్యం ఈ అడవుల్లో కనిపిస్తుంది. ప్రపంచ పర్యావరణంలో అమెజాన్‌ అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అలాంటి అడవిలో బస చేస్తే.... ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలను వింటూ, సూర్యోదయాన్ని చూస్తూ కాఫీ సిప్‌ చేస్తే... అమెజాన్‌ అందాలను ఆస్వాదిస్తూ లంచ్‌ చేస్తే... ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం కదూ! అలాంటి అరుదైన అవకాశాన్ని అందిస్తోంది ‘అల్టా శాంక్చరీ’. పెరూవియన్‌ అమెజాన్‌ రెయిన్‌ఫారెస్ట్‌లో ఎతైన చెట్టుపై ఒక ట్రీహౌజ్‌ నిర్మించారు. చెట్టు మీద కదా ఏదో గుడిసెలా ఉంటుందనుకుంటే పొరపాటే. అందులో సకల సదుపాయాలు ఉంటాయి. లగ్జరీ విల్లాకు తీసిపోని విధంగా ఉంటుంది. 110 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ట్రీ హౌజ్‌లో నుంచి అమెజాన్‌ అందాలు సందర్శకుల మదిని ఆకట్టుకుంటాయి.


అమెజాన్‌ అడవిలో బస అంటే క్రూరమృగాలు, క్రిమి కీటకాల భయం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రొఫెషనల్‌ టీం పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. ట్రీ హౌజ్‌లో ఆధునిక వసతులు అందుబాటులో ఉంటాయి. వేడినీళ్లు, 24 గంటల పాటు సోలార్‌ విద్యుత్తు అందుబాటులో ఉంటాయి. 360 డిగ్రీల కోణంలో అమెజాన్‌ అందాలు చూడొచ్చు. ముందుగా విమానంలో పెరూలోని ప్యూర్టో మాల్డోనాడో చేరుకుని హోటల్‌లో విశ్రాంతి తీసుకోవాలి. మరుసటి రోజు ఉదయం ట్రీహౌజ్‌కు ప్రయాణం ఉంటుంది. నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి అమెజాన్‌ అడవిలోకి చేరుకోవాల్సి ఉంటుంది. లాస్‌ పిడ్రాస్‌ నదిలో పవర్‌ బోటులో ప్రయాణం తర్వాత నడక దారిలో ట్రీహౌజ్‌కి చేరుకుంటారు. అక్కడ గడిపిన ప్రతీ క్షణం ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

book6.4.jpg


సముద్రానికి స్టీల్‌ నెక్లెస్‌

సముద్రం చెంతన రిసార్టులు మామూలే. అయితే సముద్రానికి స్టీల్‌ నెక్లెస్‌ తొడిగినట్టుగా ఉన్న విల్లాలు ఎక్కడైనా చూశారా? నీలం రంగులో మెరిసిపోతున్న సముద్రం... ఆహ్లాదకరమైన వాతావరణం... వెరసి పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోంది సౌదీ అరేబియాలోని ‘షెబారా’ రిసార్ట్‌. ఆధునిక వసతులతో ఉన్న ఈ రిసార్టును ఎర్రసముద్రంలో ఉన్న ‘షెబారా దీవి’లో నిర్మించారు. ప్రధాన భూభాగం నుంచి 25 కి.మీ దూరంలో ఉంటుంది. బోట్‌లో లేదా సీప్లేన్‌ ద్వారా రిసార్టును చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రిసార్టుకు అవసరమైన విద్యుత్తు సోలార్‌ ద్వారానే అందుతుంది. జీరో ఎనర్జీ, జీరో వాటర్‌, జీరో వేస్ట్‌ ఫీచర్లతో ఈ రిసార్టును నిర్మించారు. ఈ రిసార్టులో 73 విల్లాలున్నాయి. అందులో 38 నీళ్లలో ఉంటే, 35 బీచ్‌ ఫ్రంట్‌ ఆప్షన్‌ను కలిగి ఉన్నాయి. విల్లాల నిర్మాణానికి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను ఉపయోగించారు. సముద్ర ఉపరితలం, ప్రకృతి అందాలు విల్లాలపై ప్రతిబింబిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక్కో విల్లాకు 150 టన్నుల రిఫ్లెక్టివ్‌ స్టీల్‌ను వాడారు. ‘కిల్లా డిజైన్‌’ అనే సంస్థ ఈ రిసార్టు ఆకృతిని డిజైన్‌ చేసింది. రిసార్టులో బసచేసిన వారికి జపనీస్‌తో పాటు మెడిటెరేనియన్‌ వంటకాలను సిద్ధం చేసి అందిస్తారు. స్పా, ఫిట్‌నెస్‌ సెంటర్‌ వసతులు ఉంటాయి. ‘రెడ్‌ సీ గ్లోబల్‌’ అనే సంస్థ ఈ రిసార్టును అభివృద్ధి చేసింది. నెక్లెస్‌లా వంపులు తిరిగినట్టుగా రిసార్టు విల్లాలు కనిపిస్తాయి. దుబాయ్‌లోని ‘మ్యూజియం ఆఫ్‌ ఫ్యూచర్‌’ను డిజైన్‌ చేసింది ఈ సంస్థే.


పనికిరాని వస్తువులతో శిల్పాలు...

సాధారణంగా పనికిరాని వస్తువులను బయటపడేస్తాం. ఖాళీ బాటిళ్లు, డబ్బాలను చెత్త అని పారేస్తాం. కానీ మిన్నెసొటాలోని ఒక ఎగ్జిబిషన్‌లోకి అడుగుపెడితే... ఆలోచనను మార్చుకుంటాం. పనికిరాని వస్తువులతో చేసిన శిల్పాలను చూసి వారి ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెబుతాం. అందుకే స్థానికులతో పాటు పర్యాటకులు ఆ ఎగ్జిబిషన్‌ను చూసేందుకు క్యూ కడుతుంటారు. ఈ ట్రెజర్‌ హంట్‌ థీమ్డ్‌ ఎగ్జిబిషన్‌ పేరు ‘అలెక్సా ఎలిక్సిర్‌’. డెన్మార్క్‌కు చెందిన థామస్‌ డాంబో అనే ఆర్టిస్టు ఈ ఎగ్జిబిషన్‌ను రూపొందించారు. ఈ భారీ ఎగ్జిబిషన్‌ రూపకల్పనలో 300 నుంచి 400 మంది వలంటీర్లు ఆయనకు సహాయం చేశారు. ఇప్పటివరకు డాంబో తయారుచేసిన వాటిలో 42 అడుగుల ఎత్తైన ‘లాంగ్‌ లీఫ్‌’ అతి పెద్ద కళాకృతిగా గుర్తింపు పొందింది. ఈ ఎగ్జిబిషన్‌లో మూడు మ్యాజిక్‌ పోర్టల్స్‌, గోల్డెన్‌ రాబిట్‌, ఐదు అతి పెద్ద శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ రీసైకిల్డ్‌ వస్తువులతో తయారైనవే. ఇందులో శిల్పాల నిర్మాణం పూర్తయ్యాక వాటిని కొన్ని ప్రదేశాలలో దాచిపెడతారు. సందర్శకులు వాటిని కనుగొనాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఎగ్జిబిషన్‌ను 60 లక్షల మంది సందర్శించారు. ‘‘పనికిరాని చెత్త అని పడేస్తారు. కానీ ఆ చెత్తకు కూడా ప్రజలను ఆకర్షించే శక్తి ఉందని మేం నిరూపించాం. రీసైక్లింగ్‌ ఎందుకు ముఖ్యమైందో ప్రజలకు వివరించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాను’’ అని డాంబో అంటారు.


ఏడాదంతా మంచు

మంచు శీతాకాలంలో మాత్రమే కురుస్తుంది. ఆ సీజన్‌లో ఏ ప్రదేశంలో కురుస్తోందో తెలుసుకుని వెళ్లాలి. అయితే ఏడాదిలో 365 రోజులూ మంచు కురిసే ప్రదేశం లేదా? అలాగైతే చైనాలోని షాంఘైలో ఉన్న ‘ఎల్‌ స్నో ఇండోర్‌ స్కీయింగ్‌ థీమ్‌ రిసార్టు’కు వెళితే సరి. 2022 వింటర్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పటి నుంచి చైనా మంచు క్రీడలపై ఆసక్తిని పెంచుకుంది. ఆ తరవాతే ఈ అతిపెద్ద ఇండోర్‌ స్కీయింగ్‌ సౌకర్యాన్ని అందించే రిసార్టును ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్‌ స్కీయింగ్‌ రిసార్టుగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమైన ఈ రిసార్టును ఇప్పటి వరకు లక్ష మందికి పైగా సందర్శించారు. 2025 చివరి నాటికి కోటీ యాభై లక్షల మంది సందర్శిస్తారని అంచనా. స్కీయింగ్‌ వంటి మంచు ఆటలతో పాటు రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌తో కావాల్సినంత వినోదాన్ని పంచే వేదికగా ఈ రిసార్టు నిలుస్తోంది


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Rahul Raj: కారడవిలో కాలి నడక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 13 , 2025 | 10:57 AM