Jhansi: అమ్మను నాన్నే చంపాడు..బొమ్మ వేసి మరీ చెప్పిన నాలుగేళ్ల చిన్నారి!
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:35 PM
యూపీలో ఇటీవల జరిగి యువతి అనుమానాస్పద మృతి ఉదందం మరో మలుపు తిరిగింది. తండ్రే తల్లిని చంపాడంటూ వారి నాలుగేళ్ల కూతురు చెప్పడంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల యూపీలో కలకలం రేపిన 27 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కేసులో తాజాగా కీలక విషయాలు బయటపడ్డాయి. మొదట ఇది ఆత్మహత్య అన్న వాదన తెరపైకి వచ్చినా కూతురి వాగ్మూలం తరువాత తండ్రే దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. మృతురాలి నాలుగేళ్ల కూతురు తన తల్లి హత్య గురించి బొమ్మ గీసి మరీ వివరించింది. ఝాన్సీలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే (Uttarpradesh)..
సోనాలీ బుధోలియాకు 2019లో వివాహం జరిగింది. ఆమె భర్త సందీప్ బుధోలియా మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తాడు. వారు ఝాన్సీలోని పంచవటి శివ్ పరివార్ కాలనీలో ఉంటున్నారు. అయితే, పెళ్లి జరిగిన కొద్ది రోజులకే సోనాలీని అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఈ జంటకు పాప పుట్టాక సోనాలీకి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోనాలి సోమవారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెది ఆత్మహత్య అన్న వాదన తెరపైకి వచ్చినా కూతురి చెప్పిన విషయాలతో ఉదంతం మరో మలుపు తిరిగింది. భర్తే ఆమెపై దాడి చేసి హత్య చేసి ఉంటాడన్న అనుమానం బలపడింది.
Groom Returns Dowry: వరుడికి రూ.5.51 లక్షల కట్నం! ఆ మరుక్షణం అతడు చేసింది చూసి..
పోలీసులతో మృతురాలి కూతురు చెప్పిన విషయాలు, తల్లి మరణానికి సంబంధించి ఆమె వేసిన బొమ్మ ఆధారంగా సోనాలీని భర్తే హత్య చేసినట్టు తేటతెల్లమైంది. ‘‘నాన్న అమ్మని కొట్టాడు. నువ్వు ఛస్తే చావు అన్నాడు. ఆమెను వేలాడదీశాడు. తలపైకి రాయితో కొట్టాడు. ఆ తరువాత ఆమెను కిందకు దింపాడు, బ్యాగులో పెట్టి పడేశాడు’’ అని సోనాలీ కూతురు దర్శిత తెలిపింది. అంతేకాకుండా, దాడి జరిగిన తీరుపై తను వేసిన బొమ్మ కూడా చూపించింది.
అంతకుముందు నుంచే తండ్రి భార్యపై వేధింపులకు దిగినట్టు చిన్నారి చెప్పుకొచ్చింది. ‘‘అమ్మను ఏమైనా అంటే చేయి విరగ్గొడతా అని ఓసారి నాన్నకు చెప్పా. నాన్న అమ్మను కొడుతుండే వాడు. నువ్వు బతకకూడదు అని అంటుంటే వాడు’’ అని చిన్నారి తెలిపింది.
పెళ్లైన కొద్ది రోజులకే తన కూతురికి అత్తారింట్లో వేధింపులు మొదలయ్యాయని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘పెళ్లి రోజున నేను వాళ్లకు రూ.20 లక్షలు కట్నం ఇచ్చాను. ఆ తరువాత కొన్ని రోజులకే వారు అదనపు కట్నం డిమాండ్ చేయడం ప్రారంభించారు. కారు కావాలని అన్నారు. కానీ, తన స్థోమతకు కారు ఇవ్వలేనని చెప్పాము. ఆ తరువాత వాళ్లు నా కూతురిని వేధించడం ప్రారంభించారు. మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. చివరకు అక్కడ రాజీకొచ్చాము’’
Divorce Over Kids Surname: పిల్లలకు తన ఇంటి పేరు పెట్టుకోనివ్వలేదని భార్యకు విడాకులు
‘‘కానీ కూతుర్ని కన్నాక సోనాలీ పరిస్థితి మరింత దిగజారింది. ఆడ పిల్ల పుట్టడంతో డెలివరీ తరువాత వారు నా బిడ్డను ఆసుపత్రిలోనే ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోయారు. నేను వెళ్లి బిల్లు మొత్తం చెల్లించి ఇంటికి ఆమెను తీసుకురావాల్సి వచ్చింది. ఓ నెల తరువాత అల్లుడు వచ్చి సోనాలీ, చిన్నారిని తీసుకెళ్లాడు’’ అని మృతురాలి తండ్రి తెలిపారు.
ఇటీవల సోనాలీ తన బంధువు పెళ్లిలో ఉండగా సందీప్ వచ్చి ఇంటికి పిలుచుకెళ్లాడని అన్నారు. ‘‘ఈ రోజు ఉదయం నాకు వారి నుంచి ఫోన్ వచ్చింది. నా కూతురి ఆరోగ్యం దిగజారుతోందని చెప్పారు. ఆ తరువాత కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి నా కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు’’ అని అతడు కన్నీరుమున్నీరయ్యాడు. పోస్టుమార్టం నివేదిక తరువాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.