Share News

పరకలతోనే ప్రపంచాన్ని గెలిచాడు..

ABN , Publish Date - Apr 13 , 2025 | 09:23 AM

అనంత్‌ అజ్మీరా సొంతూరు గౌహతీ. తండ్రి నూలు దారాల తయారీ పరిశ్రమ నడిపేవాడు. అనంత్‌ చిన్నప్పటి నుంచే విభిన్నమైన వ్యాపారం చేయాలని ఆలోచించేవాడు. చదువుకుంటూనే జంగిల్‌ ఆగ్రో అనే కంపెనీలో పనిచేశాడు. సంస్థ నిర్వహణపైన అనుభవం వచ్చింది.

పరకలతోనే ప్రపంచాన్ని గెలిచాడు..

రోజూ ఇంటిని శుభ్రం చేసే చీపురు అంటే చిన్నచూపు. కానీ, అదే చీపురు పొద్దున్నే కనిపించకపోతే కాళ్లూ చేతులు ఆడవు. అదీ దానికున్న శక్తి..!. అలాంటి గడ్డి పరకతో వ్యాపార విప్లవం సృష్టించాలనుకున్నాడు గౌహతీకి చెందిన అనంత్‌ అజ్మీరా.. అనుకున్నదే చేశాడు.. పరకలతోనే ప్రపంచాన్ని గెలిచాడు..

‘‘ఛీ.. ఛీ.. ఏంట్రా.. పీహెచ్‌డీ మానేసి చీపుర్ల వ్యాపారం చేస్తావా? నీకేమైనా మతి ఉండే మాట్లాడుతున్నావా? నిన్నందరూ ఇక నుంచి చీపుర్ల అనంత్‌ అంటారు.. జాగ్రత్త!’’ అంటూ పకపకా నవ్వేశారు మిత్రులు. విశ్వవిద్యాలయ క్యాంటిన్‌లో దోస్తులతో కలిసి కాఫీ తాగుతున్న అనంత్‌.. ఆ విమర్శలను చిరునవ్వుతో స్వీకరించాడు.

ఈ వార్తను కూడా చదవండి: Tamanna: ప్రేమకు షరతులు ఉండవు..


అనంత్‌ అజ్మీరా సొంతూరు గౌహతీ. తండ్రి నూలు దారాల తయారీ పరిశ్రమ నడిపేవాడు. అనంత్‌ చిన్నప్పటి నుంచే విభిన్నమైన వ్యాపారం చేయాలని ఆలోచించేవాడు. చదువుకుంటూనే జంగిల్‌ ఆగ్రో అనే కంపెనీలో పనిచేశాడు. సంస్థ నిర్వహణపైన అనుభవం వచ్చింది. గౌహతిలోనే పార్ట్‌టైమ్‌ టీచర్‌గా కూడా చేయాల్సి వచ్చింది. పేరున్న కాలేజీలో ఎంబీఏ చదివాడు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ ఎంపిక పరీక్ష రాశాక మంచి ర్యాంకు వచ్చింది. ఆ స్కాలర్‌షిప్‌తో పీహెచ్‌డీ చేయాలన్నది అనంత్‌ లక్ష్యం. విశ్వవిద్యాలయ పరిశోధనలో చేరాడు. అతడు సమర్పించిన ఎనిమిది పరిశోధన పత్రాలకు గుర్తింపు వచ్చింది. డాక్టరేట్‌ పూర్తి కాకుండానే విసుగొచ్చింది. ఎందుకంటే తను ఏదో ఒక కొత్త ఆలోచనతో వ్యాపారం చేయాలన్న లక్ష్యం మెలిపెడుతుండేది


book3.2.jpg

కాబట్టి!. పరిశోధనను మధ్యలోనే వదిలేశాడు. ఏం చేయాలో తెలుసుకోవడానికే కొత్త ప్రదేశాలు తిరిగాడాయన. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు... మేఘాలయలో చీపుర్లను తయారుచేసే గడ్డి అడవుల్లో కనిపించింది. స్థానికులతో మాట్లాడాడు. అప్పటికే చీపుర్ల పరిశ్రమ అసంఘటితంగా ఉంది. గ్రామీణులకు శ్రమ ఎక్కువ.. ఆదాయం తక్కువ. మేఘాలయలో చీపుర్ల గడ్డిని రైతులు సాగుచేస్తున్నారు. చీపుర్ల తయారీ కుటీర పరిశ్రమలు, పనిమనుషులు, గృహిణుల వద్దకు వెళ్లి మరీ అధ్యయనం చేశాడు. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల తయారు చేస్తున్న ప్పటికీ... చీపుర్ల కొరత మాత్రం చాలానే ఉంది. అందులోనూ నాణ్యమైన, సౌకర్యవంతమైన చీపుర్లకు మార్కెట్‌లో గిరాకీ బాగుంది.


గడ్డితో మొదలై..

నేపాల్‌లో చీపుర్ల గడ్డిని ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఆ తర్వాత మన దేశంలో మేఘాలయలో అత్యధికం. మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చీపుర్లను తయారుచేస్తున్నారు. గడ్డి సేకరణ ఒక ప్రహసనం అయితే.. దానిని శుభ్రపరిచి క్రమపద్ధతిలో పేర్చి.. సౌకర్యవంత మైన హ్యాండిల్‌ను బిగించడం మరొక ప్రహసనం. ఇంతకుమునుపు ఇదే పని చేస్తున్న వాళ్లతో కొత్త వాళ్లకు శిక్షణ ఇప్పించాడు. గౌహతీలోనే చీపుర్ల పరిశ్రమను నెలకొల్పాడు అనంత్‌. మొదట్లో అందరూ ఎగతాళి చేశారు. ‘చీపుర్లే కదాని చిన్నచూపు చూడకండి. ఇందులోనే జీవితాన్ని వెతుక్కున్నాను’ అనేవాడు అనంత్‌. పదిలక్షల రూపాయలతో మొదలైన ఆయన చీపుర్ల వ్యాపారం ఇప్పుడు రూ.20 కోట్ల లావాదేవీలకు చేరుకుంది. ‘‘మన దేశంలో చీపుర్ల తయారీ పరిశ్రమ విలువ ఏడాదికి ఆరువందల కోట్ల రూపాయలు.

book4.jpg


అస్సోం, మేఘాలయలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని వేలమంది మహిళలకు చీపుర్ల తయారీతో ఉపాధి లభిస్తోంది..’’ అని వివరించాడు అనంత్‌. అతడు నెలకొల్పిన చీపుర్ల పరిశ్రమ స్వల్ప కాలంలోనే విస్తరించింది. మేఘాలయలోని జిరాంగ్‌లో 40 వేల చదరపు అడుగుల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలతో పాటు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లకు చీపుర్లను ఎగుమతి చేసే స్థాయికి అనంత్‌ కంపెనీ చేరుకుంది. ఇప్పటికే ఐదు లక్షల చీపుర్లు కావాలంటూ వివిధ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు సైతం వచ్చాయి. ఇదొక తిరుగులేని వ్యాపారంగా ఎదిగింది. గడ్డి పరకతో విప్లవం అంటే ఇదేనేమో!. ‘‘మన దేశంలోని దుమ్మును ధూళినే కాదు.. దరిద్రాన్నీ ఊడ్చేస్తాను’’ అంటూ తనను ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్లకు.. చీపుర్లతోనే సమాధానం ఇచ్చాడు అనంత్‌ అజ్మీరా.


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Rahul Raj: కారడవిలో కాలి నడక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 13 , 2025 | 09:23 AM