Student Earns Lakhs With AI: ఏఐ ఎఫెక్ట్.. నెలకు రూ.1.5 లక్షలు ఆర్జిస్తున్న పదో తరగతి కుర్రాడు

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:28 PM

పదో తరగతి లోనే ఏఐ సాయంతో నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్న ఓ కుర్రాడి ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. కుర్రాడి తెలివిని చూసి జనాలు తెగ ముచ్చపడిపోతున్నారు.

Student Earns Lakhs With AI: ఏఐ ఎఫెక్ట్.. నెలకు రూ.1.5 లక్షలు ఆర్జిస్తున్న పదో తరగతి కుర్రాడు
Class 10 student earns lakhs using AI

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో కొలువులు పోతాయన్న భయంతో ఎందరో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఏఐతో కొన్ని జాబ్స్ తెరమరుగు కావడం పక్కా అని ఆయా రంగాల నిపుణులు కూడా చెబుతున్నారు. ఏఐ దెబ్బకు మధ్య తరగతి కనుమరుగవుతుందని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఏఐ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇందుకు తాజాగా ఉదాహరణే ఓ పదో తరగతి బాలుడు. పద్ధెనిమిదేళ్లు కూడా లేని ఇతడు ఏఐ సాయంతో నెలకు ఏకంగా రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట ట్రెండవుతోంది.

ఏఐ ఆధారిత కంపెనీ నిర్వహిస్తున్న ఓ రెడిట్ యూజర్ సదరు బాలుడి ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు. అతడి తెలివి నిజంగా అద్భుతమంటూ కితాబునిచ్చాడు. సదరు బాలుడు తన ఏఐ సంస్థలో మస్క్ పేరిట ఓ అకౌంట్ ఓపెన్ చేశాడని చెప్పాడు. తరచూ బాలుడు తన సంస్థలో ఏఐ క్రెడిట్స్ కొంటుంటే కూతూహలం కలిగి బాలుడు ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు తాను ప్రయత్నించానని తెలిపాడు.


Also Read: గూగుల్‌లో వీటిని అస్సలు వెతకొద్దు.. చిక్కుల్లో పడతారు

మస్క్ ఓ స్కూల్ స్టూడెంట్ అని తెలిశాక తనకు చెప్పలేనంత ఆశ్చర్యం కలిగిందని అన్నాడు. ‘‘అతడు మా వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా వాడుతున్నాడు. క్రెడిట్స్ కొంటున్నాడు. డౌటొచ్చి అతడి ప్రొఫైల్ చెక్ చేస్తే ఆశ్చర్యమేసింది’’ అని ఏఐ సంస్థ అధినేత చెప్పుకొచ్చారు.

‘‘మా ఏఐ ప్లాట్‌ఫామ్ ద్వారా అతడు వెబ్‌సైట్స్ డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో సైట్ డిజైన్ చేసేందుకు 250 నుంచి 300 డాలర్లు చార్జి చేస్తున్నాడు. రూ.1.5 లక్షల వరకూ సంపాదిస్తున్నాడు. కానీ ఏఐ టూల్‌పై మాత్రం అతడు కేవలం 2500 మాత్రమే ఖర్చు చేస్తున్నాడు’’ అని ఏఐ సంస్థ యజమాని తెలిపారు. అతడు కనీసం ప్రోగ్రామింగ్ తెలిసిన వ్యక్తి కూడా కాకపోవడం మరింత ఆశ్చర్యం కలిగించిందని వివరించాడు. ఉత్సాహం, సృజనాత్మకత కారణంగా అతడు మంచి సంపాదన కళ్ల చూస్తున్నాడని తెలిపారు. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు అటుంచితే కొత్త అవకాశాలు కూడా వస్తాయనేందుకు ఇదో ఉదాహరణ అని సదరు రెడిట్ యూజర్ కామెంట్ చేశారు.


Also Read: ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్

ఇక ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ‘‘ఏఐ అంటే భయపడిపోతున్న వారందరికీ ఇది ధైర్యాన్నిచే ఉదంతం. భారతీయులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఏదో మార్గం ద్వారా బయటపడతారు. మన టాలెంట్ ఇదే’’ అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Apr 03 , 2025 | 05:52 PM