బట్టతలపై జట్టు మొలిపించే మందు.. క్యూ కట్టిన జనం.. తీరా చూస్తే..
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:48 PM
Hair On Bald Head: 200 రూపాయలకే 8 రోజుల్లో బట్టతలపై జట్టు మొలిపిస్తానని వకీల్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నాడు. దీంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి క్యూ కట్టారు. హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా చుట్టు పక్కలనుంచి కూడా జనం వస్తున్నారు.

ఆడకావచ్చు.. మగ కావచ్చు.. మనుషులకు జట్టు తెచ్చే అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టు అనేది నిజంగా చెప్పాలంటే ఓ ఎమోషన్. అందుకే ఉన్న జట్టును కాపాడుకోవడానికి జనం వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇక, బట్ట తల ఉన్నవారు పడే బాధలు ఆ దేవుడికే తెలుసు. మానసికంగా, శారీరకంగా వారికి నరకం కనిపిస్తుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బట్టతలపై జట్టు మొలిపించే అవకాశం ఉన్నా.. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. తక్కువ డబ్బుతో అయిపోతుందని కొంతమంది ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారు. లాభం ఉండదని తెలిసినా మార్కెట్‌లోకి వచ్చే ప్రతీదాన్ని కొని ట్రై చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బట్టతల బాబుల కష్టాలను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది సిద్ధం అవుతున్నారు.
8 రోజుల్లో బట్టతలపై జుట్టు
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వకీల్ అనే సెలూన్ వ్యాపారి 200 రూపాయలకే 8 రోజుల్లో బట్టతలపై జట్టు మొలిపిస్తానని బాగా ప్రచారం చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ ఫేమ్‌కు కూడా తాను బట్టతలపై జుట్టు మొలిపించానని చెప్పుకొచ్చాడు. ఆ ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. బట్టతలతో బాధపడుతున్న మగాళ్లు పెద్ద ఎత్తున సెలూన్‌కు క్యూ కట్టారు. కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా.. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. అతడు ఢిల్లీకి సంబంధించిన ఓ కెమికల్‌ను క్రీములా బట్టతలపై పూస్తున్నాడు. అలా చేయటం వల్ల సరిగ్గా 8 రోజుల్లో బట్టతలపై జట్టు వస్తుందని హమీ ఇస్తున్నాడు.
గత కొద్దిరోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. దీంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి క్యూ కడుతున్నారు. ఓ వ్యక్తి తన బట్టతలపై వెంట్రుకలు వచ్చాయని చెబుతున్నాడు. 10 రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నాడు. గుండు కోసం 50 రూపాయలు తీసుకున్నాడని, మందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నాడు. డిమాండ్ విపరీతంగా పెరగటంతో ఢిల్లీ నుంచి తెచ్చిన మందు అయిపోయింది. దీంతో వకీల్ మందు తేవడానికి మళ్లీ ఢిల్లీ వెళ్లాడు. జనం ఆ మందు కోసం షాపు దగ్గర పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు. రెండు,మూడు రోజుల నుంచి ఎవ్వరికీ కెమికల్ ఇవ్వటం లేదని తెలుస్తోంది.
షరతులు వర్తిస్తాయి
తన కెమికల్ వాడినా కూడా బట్టతలపై జట్టు మొలవాలంటే షరతులు వర్తిస్తాయని అన్నాడు. గుండు ఆరిపోకూడదని.. గుండు పైన నీళ్లు చల్లుతూ ఉండాలని.. నీళ్లు కిందికి జారకుండా బట్ట కట్టాలని చెప్పాడు. అతడు చెప్పినట్లుగా చేసిన వారికి ఇబ్బందులు తలెత్తాయి. బట్టతలపై మంట రావడంతో పాటు.. రియాక్షన్స్ అయి బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో కొందరు బాధితులు ఆస్పత్రికి పరుగులు పెట్టారు. ఇక, ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
బట్టతల ఎలా వస్తుంది?
బట్ట తల రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది డై హైడ్రో టెస్టోస్టిరాన్ ( DHT). ఇదొక పురుష సెక్స్ హార్మోన్. సాధారణంగా జట్టు ఊడిపోయిన తర్వాత మళ్లీ అదే చోట కొత్త జట్టు మొలుస్తుంది. ఇది ప్రాసెస్. కానీ, ఎప్పుడైతే DHT ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుందో.. అది కుదుళ్లను బ్లాక్ చేస్తుంది. కొత్త జట్టు మొలవటం ఆగిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో సరైన పోషణలేకపోవటం, శారీరక, మానసిక రుగ్మతలు కూడా బట్టతల రావడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా పొల్యూషన్ కారణంగా జట్టు రాలిపోవటం, తిరిగి రాకపోవటం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి.
బట్టతలపై జట్టు మొలిపించొచ్చా?
బట్టతలపై జట్టు మొలిపించటం సాధ్యమే.. ముందుగా జట్టు ఎందుకు రాలుతోందో తెలుసుకోవాలి. సరైన పోషణ లేకపోవటం వల్ల జట్టురాలుతూ ఉంటే.. పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. ఒక వేళ DHT కారణంగా బట్టతల వస్తుంటే.. DHT బ్లాకర్స్ ఉపయోగపడతాయి. ఫెనస్ట్రైడ్, మినాక్సిడెల్ వంటి వాటిని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వాడుతున్నారు. అయితే, వీటి కారణంగా శృంగారపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో.. వారు సూచించిన మోతాదు మేరకే వాడాలి. లేదంటే రిస్కులో పడే అవకాశం ఉంటుంది. చివరి ఆప్చన్ ఏంటంటే.. ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవటం. మనకొచ్చిన బట్టతల గ్రేడ్‌ను బట్టి.. గ్రాఫ్ట్ ప్రకారం వెంట్రుకల్ని బట్టతలపై నాటుతారు. తర్వాత అవి సాధారణ జట్టులాగే తిరిగి మెలుస్తాయి.
ఇవి కూడా చదవండి:
Vastu Tips: ఇంట్లో అద్దం పగిలిపోవడం శుభమా.. లేదా అశుభమా..
Hajj 2025: భారత్ సహా 13 దేశాల వీసాలు తాత్కాలికంగా నిషేధం..కారణమిదే..