Viral: విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!
ABN, Publish Date - Feb 09 , 2025 | 05:10 PM
విండో సీటు బుక్ చేసుకున్న ఓ ఇండిగో ప్రయాణికుడు చివరకు కిటికీనే లేని సీటులో కూర్చోవాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అతడు ఎయిర్‌లైన్స్‌ను నెట్టింట ప్రశ్నించిన తీరు తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొందరు విమాన సర్వీసుపై ప్రశంసిస్తూ పోస్టులు పెడితే మరికొందరు సేవాలోపాన్ని హైలైట్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఈ రెండో రకానికి చెందిన మరో ఉదంతం ఇండిగో పేరును మరోసారి ట్రెండింగ్‌లోకి తెచ్చింది. ఇండిగోలో విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడి పరిస్థితి చివరకు ఏమైందో తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు (Viral).
ముత్తుప్రదీప్ అనే ట్విట్టర హ్యాండిల్‌లో ఈ పోస్టు కనిపించింది. సదరు ప్రయాణికుడు తాను విమానంలో కిటికీ పక్కనున్న సీటు బుక్ చేసుకున్నట్టు చెప్పాడు. కానీ విమానం ఎక్కాక అతడికి దిమ్మతిరిగినంత పనైంది. తన సీటు పక్కన కిటికీ లేదు. కేవలం గోడ మాత్రమే ఉంది. దీంతో, తన సీటులో కూర్చుని కిటికీ ఏదని ప్రశ్నిస్తున్నట్టు పోజు పెట్టి అతడు సెల్ఫీ దిగాడు. దీన్ని నెట్టింట పంచుకుని ఇండిగోను నిలదీశాడు. ‘‘ఇండిగో.. నేను కిటికీ పక్కనున్న సీటు కోసం డబ్బులు కట్టా. కానీ ఇక్కడ కిటికీ మాత్రం లేదు’’ అని పోస్టు పెట్టాడు.
Viral: అనుమతి లేకుండా తొటి ప్రయాణికుడి చార్జర్ తీసుకున్న మహిళ! ఎందుకని ప్రశ్నిస్తే..
ప్రయాణికుడి ప్రశ్నతో పాటు సెల్ఫీలో అతడు ఇచ్చిన తుంటరి పోజు కూడా జనాలను బాగా ఆకట్టుకోవడంతో ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. అతడి ప్రశ్న నవ్వు తెప్పించేదిగా ఉందని అనేక మంది వ్యాఖ్యానించారు. ఎయిర్‌లైన్స్ రిఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంస్థపై కేసు వేయాలని కూడా కొందరు సలహా ఇచ్చారు. ‘‘విండో సీటుకు డబ్బులు కట్టావంటే దానర్థం అది సీటు ధర మాత్రమే. కిటికీ కోసం అదనంగా చెల్లించాలి’’ ఓ వ్యక్తి సెటైర్ వేశాడు. ఇకపై విండో సీటు టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు వెంట సుత్తి కూడా తీసుకెళితే మంచిదని మరో వ్యక్తి సరదా వ్యాఖ్య చేశాడు. విండో సీటు అందుబాటులో లేనప్పుడు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ముందుగానే ప్రయాణికుడికి సమాచారం ఇస్తాయని, ఇండిగో కూడా ఈ పద్ధతిని అనుసరించాలని కొందరు సూచించారు.
Viral: విమానం గాల్లో ఉండగా కిటికీ అద్దం విరగగొట్టిన ప్యాసింజర్! ఎందుకో తెలిస్తే..
మరోవైపు, ఈ ఉదంతంపై ఇండిగో కూడా స్పందించింది. అతడికి ఎదురైన పరిస్థితిపై విచారం వ్యక్తం చేసింది. అతడు ప్రయాణించిన ఫ్లైట్, టిక్కెట్ బుకింగ్ వివరాలను నేరుగా మెసేజీ చేస్తే సమస్యపై దృష్టిసారిస్తామని స్పందించింది. ఇక రెండు రోజులుగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ పోస్టుకు ఇప్పటివరకూ లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.
Updated Date - Feb 09 , 2025 | 05:12 PM