Death due Extreme Dieting: బరువు తగ్గేందుకు కఠిన డైటింగ్.. టీనేజర్ దుర్మరణం
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:10 PM
అధిక బరువు అపోహలో పడి ఓ టీనేజర్ తీవ్రంగా డైటింగ్ చేసి దుర్మరణం చెందిన షాకింగ్ ఘటన కేరళలో వెలుగు చూసింది. 18 ఏళ్ల వయసులో, 24 కేజీల బరువుతో మంచాన పడ్డ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం చెందింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆ టీనేజర్ వయసు 18 ఏళ్లు.. బరువు కేవలం 24 కేజీలు. ఇష్టారీతిన డైటింగ్ చేసిన యువతి చివరకు మంచంపై లేవలేని స్థితిలో కన్నుమూసింది. కేరళలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. తాను బరువు పెరుగుతున్నానని భయపడిపోయిన యువతి ఆన్‌లైన్ కనిపించిన పలు డైటింగ్ ప్లాన్స్‌ను ఫాలో అయ్యి చివరకు మరణించిందని బంధవులు చెప్పుకొచ్చారు.
కొన్ని నెలల నుంచి శ్రీనంద అనే టీనేజర్ భోజనాలు మానేయడం ప్రారంభించింది. బరువు పెరుగొచ్చనే భయంతో కసరత్తులు ప్రారంభించింది. ఆన్‌వేదికలు సూచించిన పలు డైట్ ప్లాన్స్‌కు కూడా ఫాలో అయ్యంది. ఒకానొక దశలో కేవలం వాటర్ డైట్ మొదలెట్టింది. పరిస్థితి ముదిరిపోయి ఆరోగ్యం పూర్తిస్థాయిలో చెడిపోవడంతో ఆసుపత్రి పాలై కన్నుమూసింది (Health).
High BP Myths: హైబీపీ.. ప్రజల్లో అపోహలు.. వాస్తవాలు!
ఎనొరెక్సియా నర్వోసా అనే సమస్యతో శ్రీనంద బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ సమస్య ఉన్న వారు తమ బరువు, తింటున్న ఆహారం గురించి అసాధారణ రీతిలో భయపడుతుంటారు. బరువు తక్కువగా ఉన్నా కూడా తాము ఊబకాయులమనే భ్రమలో పడి తిండి మనేస్తారు. దారుణంగా పస్తులుంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిందని కూడా వైద్యులు చెబుతున్నారు.
గత ఐదు ఆరు నెలలుగా శ్రీనంద ఇలాంటి రకరకాల డైట్‌లు ఫాలో అయ్యి కడుపు మాడ్చుకుందట. కుటుంబ సభ్యులు ఆహారాన్ని ఇస్తే తినకుండా దాన్ని దాచిపెట్టేది. కేవలం గోరు వెచ్చని నీరు తాగేది. సుమారు ఐదు నెలల క్రితం ఆరోగ్యం పాడవడంతో ఆమెను వైద్యులకు చూపించాల్సి వచ్చింది. ఆమెకు మంచి పోషకాహారం పెట్టాలని తల్లిదండ్రులకు సూచించిన వైద్యులు సైకియాట్రిస్టులకు కూడా చూపించాలని సలహా ఇచ్చారు. రెండు నెలల క్రితం మళ్లీ ఆమె ఆరోగ్యం చెడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు మళ్లీ అవే సూచనలు చేశారు.
రెండు వారాల క్రితం ఆమె బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో యువతిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందించినా ఉపయోగం లేకపోయింది. ‘‘ఆమె కనీసం 24 కేజీల బరువు కూడా లేదు. మంచానికే పరిమితమైపోయింది. చక్కెర స్థాయిలు, సోడియం, బీపీ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశాము. అయినా ప్రయోజనం లేకపోయింది’’ అని యువతికి చికిత్స చేసిన వైద్యులు ఒకరు తెలిపారు.