Viral: ఇన్ఫీ నారాయణ మూర్తిని మించిపోయిన ఎల్ అండ్ టీ చైర్మన్! వారానికి 90 గంటలు పనిచేయాలంటూ పిలుపు
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:03 PM
ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్‌అండ్‌టీ చైర్మన్ చేసిన సూచన ప్రస్తుతం నెట్టింట సంచలనం కలిగిస్తోంది. ఉద్యోగులు ఆదివారాలు ఆఫీసులకు రావాలన్న వ్యాఖ్యలు నెట్టింట మరోసారి పెద్ద చర్చకు దారితీశాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఇంకా చర్చ కొనసాగుతున్న తరుణంలోనే ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరింత సంచలనానికి దారి తీశాయి. నెట్టింట జనాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. సంస్థ అంతర్గత మీటింగ్ సందర్భంగా చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ప్రస్తుతం పెద్ద చర్చకు తెరలేపాయి (Viral).
ఎల్ అండ్ టీలో పని సంస్కృతిపై ఓ ప్రశ్నకు సమాధానంగా సుబ్రమణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మీతో ఆదివారాలు కూడా పని చేయించలేకపోతున్నందుకు నాకు కొంత విచారంగా ఉందని చెప్పకతప్పదు. ఇది సాధ్యమై ఉంటే నేను సంతోషించే వాణ్ణి. ఎందుకంటే నేను ఆదివారాలు పని చేస్తా’’ అని ఆయన కామెంట్ చేశారు.
సెలవుపై ఇంట్లో ఉండి చేసేదేముందని కూడా సుబ్రమణ్యన్ ప్రశ్నించారు. ‘‘ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తారు. మీ భార్యల ముఖాలను చూస్తూ ఎంత సేపు ఉండగలరు. భార్యలు వారి భర్తలను చూస్తూ ఎంత సేపు ఉంటారు? ఇదంతా కట్టిపెట్టి ఆఫీసుకు వచ్చి పని మొదలెట్టాలి’’ అని సరదా వ్యాఖ్యలు చేశారు.
ఇక తన వాదనను సమర్థించుకునేందుకు తనకెదురైన ఓ అనుభవాన్ని కూడా సుబ్రమణ్యన్ ప్రస్తావించారు. అమెరికాను అధిగమించే స్థితిలో తమ దేశం ఉందంటే దానికి కారణం పని విషయంలో తాము పాటించే విలువలే అని ఓ చైనా వ్యక్తి తనతో అన్న విషయాన్ని ప్రస్తావించారు. తాము వారానికి 90 గంటలు పనిచేస్తామని సదరు చైనా వ్యక్తి చెప్పినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కానీ అమెరికన్లు మాత్రం కేవలం 50 గంటలే పనిచేస్తారని చైనా వ్యక్తి అన్నట్టు సుబ్రమణ్యన్ తెలిపారు. కాబట్టి, ఎల్ అండ్ టీ ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని అవలంబించేలా తాము ప్రోత్సహిస్తామని అన్నారు. ‘‘సో.. ప్రపంచంలో టాప్‌లో ఉండాలంటే వారానికి కచ్చితంగా 90 గంటలు పనిచేయాలి’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
Viral: వేలంలో రూ.56 లక్షలకు అమ్ముడుపోయిన రూ.100 హజ్ నోటు’
ఇక వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. గొప్ప జీతాలు తీసుకునే సీఈఓల్లా సాధారణ ఉద్యోగులు పనిచేయాల్సిన అవసరం ఏమిటని అన్నారు. ఎల్ అండ్ టీలో పని వాతావరణంపై కొందరు విమర్శలు గుప్పించారు. అయితే, కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు అధికపని గంటల విధానాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్న యువత చివరకు సంతానభాగ్యానికి దూరమవుతున్నారని, ఇది దేశభవిష్యత్తుకు మంచిది కాదని జోహో కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్ వెంబు ఇటీవల సూచించారు.
Tuna: మోటర్‌సైకిల్ సైజులో ఉన్న చేప వేలం.. ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిన వైనం
Updated Date - Jan 09 , 2025 | 04:03 PM