Man Steals Ex-Girlfriend's Father's Ashes: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..

ABN, Publish Date - Apr 06 , 2025 | 07:18 PM

మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి దక్కించుకోవాలనుకున్న ఓ వ్యక్తి ఆమె తండ్రి అస్థికలను దొంగిలించి బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు కటకటాల పాలయ్యారు. తైవాన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Man Steals Ex-Girlfriend's Father's Ashes: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..
Man Steals Ex-Girlfriend's Father's Ashes

ఇంటర్నెట్ డెస్క్: బాయ్‌ఫ్రెండ్‌తో పదిహేనేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిందా మహిళ. అది తట్టుకోలేకపోయిన అతడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. ఏకంగా మహిళ తండ్రి అస్థికలను దొంగిలించి ఆమెను బెదిరించాడు. అతడి ప్రయత్నం వికటించడంతో చివరకు జైలుపాలయ్యాడు. తైవాన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతంలో నిందితుడిపై ఇటీవలే కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే (Man Steals Ex-Girlfriend's Father's Ashes)..

57 ఏళ్ల లీవ్‌ గత 15 ఏళ్లుగా టాంగ్ (48) అనే మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. అతడికి కోళ్ల పెంపకం వ్యాపారం ఉంది. గత రెండు మూడేళ్లుగా అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇతర కుటుంబసభ్యుల మీద ఆధారపడ సాగాడు. అతడి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండటంతో టాంగ్ 2023లో అతడికి గుడ్‌బై చెప్పేసింది. ఇది లీవ్‌కు సుతరాము నచ్చలేదు. దీంతో, ఆమెను మళ్లీ తన వద్దకు ఎలాగైనా రప్పించుకోవాలని కంకణం కట్టుకున్నాడు.


అప్పటి నుంచీ ఆమెనే ఫాలో కావడం ప్రారంభించాడు. ఈ క్రమంలో టాంగ్ తన తండ్రి అస్థికలను ఓ స్మశానంలో పెట్టిన విషయం గుర్తించాడు. వాటి సాయంతో ఆమెను దక్కించుకోవాలనుకుని వాటిని చోరీ చేశాడు. 2023 ఆగస్టులో వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ఎత్తుకెళ్లిపోయాడు.

అదే ఏడాది డిసెంబర్‌లో లీవ్ టాంగ్ ఇంటికి వెళ్లి ఆమె తండ్రి చిత్రపటాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టాడు. ఆమెను తిరిగి రావాలని డిమాండ్ చేశాడు. కానీ టాంగ్ పెద్దగా పట్టించుకోలేదు. తన తండ్రి అస్థికలు చోరీకి గురయ్యాయన్న విషయం అప్పటికి ఆమెకు తెలియదు.

మరుసటి ఏడాది ఫిబ్రవరిలో లీవ్ టాంగ్‌కు ఓ బెదిరింపు లేఖ రాశాడు. ఆమె తండ్రి అస్థికలు ఉన్న కుండ ఫొటోలను కూడా షేర్ చేశాడు. తన వద్దకు తిరిగి రాకపోతే తండ్రిని ఆమె ఇక ఎన్నడూ చూడలేదని కూడా హెచ్చరించాడు. దీంతో, టాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఈ క్రమంలో పోలీసులు, మిలిటరీ సాయంతో శ్మసానంలో వెళ్లి చూడగా టాంగ్ తండ్రి అస్థికలున్న కుండ చోరీ అయిన విషయం స్పష్టమైంది. అప్పటికే లీవ్ మరో కేసులో జైలుపాలయ్యాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని ప్రశ్నించగా తాను ఏ తప్పు చేయలేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టి అతడి నేరాన్ని ఆధారాలతో సహా రుజువు చేశారు. ఈ ఏడాది మార్చి 28న టాంగ్ తండ్రి అస్థికలను స్వాధీనం చేసుకుని ఆమెకు అప్పగించారు. మరోవైపు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

మొసలితో మహిళ యుద్ధం! దాని వీపు మీదెక్కి భీకర పోరాటం

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోడిని ఎత్తుకెళ్లి.. పోలీసులు వచ్చేసరికి వలవలా ఏడుస్తూ..

దేవుడా..ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా.. ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Apr 06 , 2025 | 07:25 PM