Mother Dog Survives Leopard Attack: తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
ABN, Publish Date - Apr 07 , 2025 | 05:05 PM
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడినా కూడా ఓ తల్లి శునకం తన కూనల ఆకలి తీర్చేందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: తల్లికి పిల్లల పట్ల ఉండే ప్రేమ వెలకట్టలేనిది. తను పస్తులు ఉన్నా సరే పిల్లలు మాత్రం కడుపు నిండా తినాలని కోరుకుంటుంది. నిండు నూరేళ్లు పిల్లలు చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఈ భావనకు మనుషులు జంతువులు అన్న తేడా ఉండదు. ఇందుకు తాజాగా ఉదాహరణగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడినా లెక్క చేయకుండా ఓ కుక్క తన కూనల కడుపు నింపేందుకు సిద్ధమైంది. అంత బాధలోనూ కుక్కల పిల్లల ఆకలి తీర్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలను కదిలిస్తోంది (Mother Dog Survives Leopard Attack Returns to Feed Puppies).
ముంబైలోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది. తల్లి కుక్క ప్రేమ, బిడ్డల కోసం ఎంత బాధనైనా ఓర్చుకునే సహనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఓ చిరుత దాడిలో ఆ కుక్క తీవ్ర గాయాల పాలైంది. కుక్క నిద్రపోతున్న సమయంలో చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. దాని గొంతు పట్టి కొంత దూరం ఈడ్చుకుని వెళ్లడంతో కుక్క గొంతుకకు రంధ్రాలు పడ్డాయి. అదృష్టం బాగుండడంతో చిరుత బారి నుంచి కుక్క ఎలాగొలా తప్పించుకోగలిగింది.
అంతకుముందే, ఆ కుక్క పది పిల్లల్ని పెట్టింది. అయితే చిరుత వచ్చిన సమయంలో కుక్క పిల్లలు అక్కడ లేకపోవడంతో వాటి ప్రాణాలు నిలిచాయి. చిరుత దాడిలో తీవ్ర గాయాల పాలైనా కూడా కుక్క మళ్లీ తన కూనల ఆకలి తీర్చేందుకు వచ్చింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
చిరుత దాడిలో ఆ కుక్కకు భారీ గాయాలే అయ్యాయని స్థానిక సోషల్ వర్కర్ యామిని తెలిపారు. అది నీరు తాగుతుంటే కుత్తుక నుంచి బయటకు కారిపోతున్నాయని అన్నారు. ఇంత వేదనలో కూడా తల్లి కుక్క తన కూనల బాగోగులు మర్చిపోలేదని అన్నారు. ఆ కుక్క పేరు శక్తి అని, ఈ కుక్కకు ప్రస్తుతం తాము చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఇటీవలే శునకానికి విజయవంతంగా ఆపరేషన్ చేశామని ఓ ఎన్‌జీఓకు చెందిన వైద్యులు తెలిపారు. గొంతుకకు పడ్డ చిల్లులకు కుట్లు వేసి మూసేశామని, ప్రస్తుతం శక్తి కోలుకుంటోందని తెలిపారు. మరోవైపు, ఈ వీడియో నెట్టింట కూడా వైరల్‌గా మారింది. తల్లి హృదయం ఏజీవికైనా ఒకటే అని అనేక మంది కామెంట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..
ఇతరులను టచ్ చేస్తే షాక్.. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా
పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏటా రూ.40 లక్షల ఆదాయం.. నెట్టింట పోస్టు వైరల్
Updated Date - Apr 07 , 2025 | 05:05 PM