Share News

పగటికలలకు బ్రేక్‌ వేద్దాం..

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:40 PM

మండే ఎండల్లో హిమాలయాల్లో విహరించినట్టుగా కలలు కనడం ఓకే. కాలేజీ ఈవెంట్‌లో ఫస్ట్‌ ప్రైజ్‌ అందుకున్నట్టుగా ఊహించడం ఓకే. కానీ ఎప్పుడూ పగటి కలల్లోనే ఉండిపోకూడదు. అలా అయితే అది కేవలం కాలక్షేపమే అవుతుంది కానీ కార్యసాధన ఎంతమాత్రం కాదు. అందుకే దీనినో మానసిక రుగ్మతగానే గుర్తించింది వైద్యశాస్త్రం. ఇలాంటి ఫాంటసీలు పెరగకుండా చెక్‌ పెట్టడం సాధనతో సులభమే.

పగటికలలకు బ్రేక్‌ వేద్దాం..

అందరిదీ ఒకే జీవితం. కానీ అందరి జీవితం ఒకేలా ఉండదు. అంచనాలకు, ఊహలకు తగినట్టు వాస్తవాలు ఉండడం లేదని బాధపడేవాళ్లే చాలామంది. అందుకే అస్తమానం గాలిమేడలు కడుతూ, ఊహాప్రపంచంలో బతికేస్తుంటారు. ఊహలు కొంత వరకు బాగుంటాయి కానీ... అదే ప్రపంచంగా బతకడం ఒకరకంగా అనారోగ్యమే. ఇలాంటి వారిలో వాస్తవాన్ని అంగీకరించే శక్తి ఉండదు. ఆదుర్దా, చిరాకు, అధిక ఆలోచనలతో గడుపుతూ మానసిక రుగ్మతలకు చేరువవుతారు. అతిగా సాగే పగటి కలలకు బ్రేక్‌ వేస్తే కానీ జీవితంలో ఎదుగుదల ఉండదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. దానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని...

- ప్రస్తుతంలో బతకడం: మనిషి ఇక్కడ, మనసు ఎక్కడోలా గడిపేస్తుంటారు కొంతమంది. ‘ఎక్కడ ఉన్నాం’, ‘ఏమి చేస్తున్నాం’ అనే విషయాల మీద పూర్తి దృష్టి పెట్టాలని అంటున్నారు మానసిక వైద్యులు. దీనికి బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏది చేసినా కూడా ఏదో మొక్కుబడిలా కాకుండా పూర్తిగా అందులో మమేకమై చేయాలి. ఆఖరికి భోంచేస్తున్నా, నీళ్లు తాగుతున్నా కూడా ఆ పనిపైనే ధ్యాసపెట్టాలి.


- ధ్యానం: ఎప్పుడూ ఏవో ఆలోచనలతో గడిపితే మానసికంగానే కాదు శారీరకంగా కూడా అలసిపోతాం. తెలియని ఒత్తిడికి లోనవుతాం. దీన్నుంచి బయట పడడానికి ధ్యానానికి మించిన మార్గం లేదు. నిరంతర ఆలోచనలకు బ్రేక్‌ ఇచ్చేందుకు ధ్యానం ఉపయోగపడుతుంది. అటూ ఇటూ వెళ్లకుండా మెదడును, మనసును నియంత్రించే శక్తి అలవడుతుంది. ప్రాణాయామం, ధ్యానం ద్వారా పగటికలలకు చెక్‌ పెట్టవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

- ప్రాధాన్యతలు, లక్ష్యాలు: జీవితంలో ఏం సాధించాలి? అన్న దానిపై చాలామందికి స్పష్టత ఉండదు. ఆ క్షణంలో ఏది తోస్తే ఆ వైపునకు ఆలోచనలను మళ్లిస్తారు. ఒకరకంగా ఇది సులువు కూడా. అలాంటప్పుడు పగటి కలల్లో మునిగిపోతారు. అందుకే కెరీర్‌ పరంగానే కాదు... జీవితంలో మన లక్ష్యాలు ఏమిటన్నది స్పష్టంగా నిర్ధారించు కోవాలి. దీనివల్ల కార్యోణ్ముఖులు అవుతారు. నెమ్మది నెమ్మదిగా పగటికలలు తగ్గిపోతాయి.


book9.2.jpg

- అనుబంధాలు: ఫాంటసీలు ఎక్కువగా ఉండేది రిలేషన్స్‌లోనే. అధిక శాతం యువతీయువకులు జీవితభాగస్వామి గురించిన ఫాంటసీలతో బతికేస్తుంటారు. వాస్తవికంగా తమ గురించి ఆలోచించి, ఎటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఆహ్వానించాలన్న స్పష్టత ఉంటే వీటికి చెక్‌ పెట్టినట్టే.

- జర్నలింగ్‌: అసలు ఎందుకు పగటి కలల్ని కంటున్నాం అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికోసం ఎక్కువగా కంటోన్న పగటి కలల్ని ఓచోట రాసుకోవాలి. చదువు, ఉద్యోగం, పెళ్లి, ఆఫీసు, కారు... ఇలా ఏదైనా సరే రాసుకుని దాన్ని సాధించేందుకు కష్టపడడం మంచిది.


- టైమ్‌ మేనేజ్‌మెంట్‌: జీవితంలో లక్ష్యసాధనకు టైమ్‌టేబుల్‌ చాలా ముఖ్యం. ఎప్పుడు, ఎంతసేపు, ఏ పని చేయాలన్నది టైమ్‌టేబుల్‌ రాసుకుని... దాన్ని అనుసరించడం వల్ల పగటికలలు కనేందుకు సమయం దొరక్కపోవచ్చు. లక్ష్యాన్ని తొందరగా సాధించేందుకూ మార్గం సుగమం అవుతుంది. వీలైనంత వరకు మల్టీటాస్కింగ్‌ చేయకపోవడమే ఉత్తమం. దీనివల్ల ఏ పని మీదా సరిగా దృష్టిని కేంద్రీకరించలేరు.

- అభిరుచి: కొందరికి జీవితం నిస్సారంగా తోస్తుంది. అందుకే పగటికలల్లో గడిపేస్తుంటారు. ఇటువంటి వాళ్లు ఏదైనా హాబీని అలవరచుకోవడం మంచిది. రాయడం, పెయింటింగ్‌, కుట్టుపని, క్రీడలు... ఇలా ఏవైనా సరే. దీని వల్ల జీవితం కొత్తగా అనిపిస్తుంది. జీవిత దృక్కోణమూ మారుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Rahul Raj: కారడవిలో కాలి నడక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 13 , 2025 | 12:40 PM