Viral: బిడ్డను కన్నందుకు పరిహారంగా భార్యకు ‘మహిళా పన్ను’ చెల్లింపు! ఇదేం తీరు దేవుడా..
ABN , Publish Date - Jan 19 , 2025 | 05:18 PM
మహిళగా తాను నిత్య జీవితంలో ఎదుర్కునే ఇక్కట్లకు పరిహారంగా భర్త తనకు మహిళా పన్ను చెల్లిస్తున్నాడంటూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ నెట్టింట పంచుకున్న ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. జనాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబంలో ఆలుమగల బాధ్యతలు కొన్ని సందర్భాల్లో వేర్వేరుగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. నెలసరి మొదలు బిడ్డల్ని కనడం వరకూ మహిళలకు ఉన్న ప్రతిబంధకాలు కాస్త ఎక్కువే. సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ వ్యక్తి తన భార్యపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. మహిళగా ఆమె ఎదుర్కొంటున్న ప్రతికూలతలకు పరిహారంగా మహిళా పన్ను చెల్లించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని అతడి భార్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది (Viral).
పూర్తి వివరాల్లోకి వెళితే, తన భర్త తనకు మహిళా పన్ను చెల్లిస్తున్నాడంటూ కెమిల్లా డొ రొసారియో సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. రెండు వారాలకు ఓసారి తన భర్త తనకు 85 పౌండ్లు పరిహారంగా చెల్లిస్తున్నట్టు చెప్పింది. ఏడాదికి తనకు 2500 పౌండ్లు చెల్లిస్తాడని పేర్కొంది. వీటిని తాను మేకప్ వంటి అవసరాలకు, తల్లిగా నిర్వహించే బాధ్యతల తాలూకు స్ట్రెస్ తగ్గించే పనులపై వెచ్చిస్తానని వివరించింది.
Viral: తల్లి కోసం యువకుడి ఖరీదైన బహుమతి.. వైరల్ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు
ఈ చెల్లింపులను తాను మహిళా పన్నుగా వ్యవహరిస్తానని కూడా ఆమె పేర్కొంది. ‘‘ఓ మహిళగా నేను ఎన్నో ఇబ్బందులు పడతాను. నెలసరి సమస్యలకు తోడు, రెండు సార్లు గర్భం దాల్చడం, సిజేరియన్లు వంటివన్నీ నన్ను ఇక్కట్ల పాలు చేశాయి’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇందుకు పరిహారంగా భర్త నుంచి పన్ను స్వీకరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
అయితే, ఇలా మహిళగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు కొంత పరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా భర్తదే అని తెలిపింది. తల్లిదండ్రులుగా తమ బాధ్యతల విషయంలో ఓ సమతుల విధానం అవలంబించాలనే ఆలోచనల్లోంచి భర్తకు ఈ ఐడియా వచ్చిందని చెప్పింది. ఈ డబ్బు తీసుకోవడాన్ని కూడా ఆమె సమర్థించుకుంది. పురుషుల లైఫ్ చాలా ఈజీ. ‘‘మహిళలుగా మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఇలాంటి పరిహారం తీసుకోవడంలో తప్పేమీ లేదు’’ అని సమర్థించుకుంది. తన కూతుళ్లకు కూడా ఇదే విషయాన్ని బోధిస్తానని, తమ గురించి తాము శ్రద్ధ ఎలా తీసుకోవాలో వారికి నేర్పిస్తానని పేర్కొంది.
Viral: లండన్‌లో నెలకు రూ.లక్ష ఇంటి అద్దె కడుతున్నా తప్పని ఇక్కట్లు.. ఎన్నారై వీడియో వైరల్
కాగా, ఈ వీడియోపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యులు లేదా భార్యాభర్తల మధ్య ఇలాంటి లావాదేవీలు సబబు కాదని కొందరు అన్నారు. భార్యగా తల్లిగా కొన్ని బాధ్యతలు ఉంటాయని ఇందుకు తగిన పరిహారం కోరడంలో తప్పేమీ లేదని కొందరు అన్నారు.