Viral: పగటిపూట కంటే రాత్రిళ్లు వేగంగా ప్రయాణించే రైళ్లు! కారణాలు ఇవే!
ABN, Publish Date - Jan 11 , 2025 | 10:08 PM
రాత్రి సమయాల్లో రద్దీ తక్కువగా ఉండటంతో రైళ్లు పగటిపూట కంటే వేగంగా ప్రయాణిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయట. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది నిత్యం రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. అయితే, రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఒక్కోసారి రైలు మరింత వేగంగా వెళుతున్నట్టు అనిపిస్తుంది. పగటి పూట ప్రయాణాలతో పాటు రాత్రి కూడా రైళ్లల్లో వెళ్లే వారికి ఇలా ఎప్పుడోసారి కచ్చితంగా అనిపించే ఉంటుంది. అయితే, ఇది వాస్తవమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలను కూడా సవివరంగా చెబుతున్నారు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, పగటి పూట రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఫ్రైట్ రైళ్లు, షటిల్ సర్వీసులు వంటివి అనేకం ఉంటాయి. ఈ పరిస్థితి కారణంగా రద్దీ పెరిగి రైళ్లు సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు ఆగాల్సి ఉంటుంది. అంతిమంగా ఇది వాటి ప్రయాణవేగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది (Viral).
ఇక ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేందుకు రైళ్లు అనేక చోట్లు మార్గం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా వేగం తగ్గడానికి ఒక కారణం. పగటి పూట ఒకే ట్రాక్‌పై పలు సర్వీసులు ప్రయాణించాల్సి రావడంతో సిగ్నల్స్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ సంక్లిష్టంగా మారుతుంది. వాటిపై ఒత్తిడి పెరుగుతుంది.
Viral: భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రైలు ఏదో తెలుసా?
అయితే, రాత్రి సమయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. రైళ్ల రాకపోకలు కాస్త తక్కువగా ఉండటంతో రద్దీ కూడా సహజంగానే తక్కువగా ఉంటుంది. దీంతో, మిగతా రైళ్లు కాస్త వేగంగా ప్రయాణించే వీలు చిక్కుతుంది. రాత్రి సమయాల్లో సిగ్నల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ సాఫీగా సాగుతుంది రైళ్లకు ఎప్పటికప్పుడు గ్రీన్ సిగ్నల్ అందడంతో వాటి వేగం కూడా పెరుగుతుంది.
Viral: విమానంలో వైఫై సర్వీసు వెనక సాంకేతికత ఏంటో తెలుసా?
పగటి పూట లోకల్ ప్యాసింజర్ రైళ్లు పలు చోట్ల ఆగాల్సి ఉంటుంది. రాత్రి సమయాల్లో కొన్ని స్టేషన్లలో ఆగాల్సిన అవసరం ఉండదు కాబట్టి రైళ్ల సగటు వేగం పెరుగుతుంది. పగటి పూట వేగం కారణంగా రైలు పట్టాలు కాస్త సాగినట్టు అవుతాయి. దీని వల్ల రైలు వేగం తగ్గుతుంది. రాత్రి వేళ చల్లని వాతావరణం కారణంగా పట్టాలు స్థిరంగా ఉండి రైళ్లు వేగంగా వెళ్లేందుకు అవకాశం చిక్కుతుంది. ఇక రాత్రి సమయాల్లో ట్రాక్ రిపెయిర్లు కూడా తక్కువగానే ఉంటాయి కాబట్టి రైళ్లు నిరాటంకంగా సాగిపోతాయి.
Updated Date - Jan 11 , 2025 | 10:09 PM