Static Shocks: ఇతరులను టచ్ చేస్తే షాక్.. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా
ABN , Publish Date - Apr 06 , 2025 | 09:11 PM
ఇతరులను టచ్ చేస్తే షాక్ కొట్టడానికి కారణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని నిపుణులు చెబుతున్నారు. భిన్న పదార్థాలతో తయారైన వస్తువుల మధ్య ఎలక్ట్రాన్ల బదిలీ కారణంగా ఇలాంటి షాకులు తగులుతాయని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇలాంటి అనుభవం మనందరికీ ఎప్పుడోకప్పుడు కలిగే ఉంటుంది. ఇతరులను తాకినప్పుడే కాకుండా తలుపుల గడియలు, తాళం చెవులతో పాటు ఒక్కోసారి మన జుట్టును మనం తాకినా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటి షాక్‌ల వెనక పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు (Why Static Electric Shocks Happen).
శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం, భిన్నమైన పదార్థాలతో తయారైన వస్తువులు పరస్పరం తగిలినప్పుడు వాటి మధ్య ఎలక్ట్రాన్ల బదిలీ జరుగుతుంది. రుణావేశం ఉన్న ఎలక్ట్రాన్ల బదిలీ ఇలా జరిగినప్పుడు ఆయా వస్తువులకు మధ్య విద్యుదావేశంలో వ్యత్యాసం ఏర్పడుతుందట. ఇలాంటి విద్యుదావేశం ఉన్న వస్తువులను మనం తగిలిన సందర్భాల్లో మళ్లీ ఎలక్ట్రాన్ల బదిలీ జరిగి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది.
ఇక ఇనుము లాంటి వస్తువులు ఎలక్ట్రాన్లను గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ప్లాస్టిక్ లాంటి వస్తువులు వాటిని త్వరగా కోల్పోతాయి. అందుకే ఇలాంటి వస్తువులను తాకిన సందర్భాల్లో సులభంగా ఎలక్ట్రాన్ల మార్పిడి జరిగి షాక్ కొడుతుందని నిపుణులు చెబుతున్నారు. వస్తువులపై ఎలక్ట్రాన్లు ఇలా పేరుకోవడాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీగా పిలుస్తారు.
ఈ పరిస్థితిని నివారించేందుకు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి నూనె రాయడం లేదా తేమ ఉండేలా జాగ్రత్త పడితే ఎలక్ట్రాన్లు పేరుకోకుండా ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.
వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కూడా స్టాటిక్ అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో నీళ్లు చిలకరిస్తే తేమ శాతం పెరిగి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ముప్పు తగ్గుతుంది.
చలికాలంలో ఉన్ని దుస్తుల కారణంగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అవకాశాలు ఎక్కువని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ దుస్తులపై ఎలక్ట్రాన్లు పేరుకునే అవకాశం ఎక్కువని అంటున్నారు. కాటన్ దుస్తులతో ఈ సమస్య తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి మీరూ ఈ కిటుకులను ఓసారి ట్రై చేసి చూడండి.
ఇవి కూడా చదవండి:
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..
మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోడిని ఎత్తుకెళ్లి.. పోలీసులు వచ్చేసరికి వలవలా ఏడుస్తూ..
దేవుడా..ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా.. ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే..