Nitish Kumar Reddy: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి..
ABN , Publish Date - Jan 16 , 2025 | 07:00 PM
వైజాగ్ కుర్రాడైన నితీష్ టీమిండియాలో స్థానం సంపాదించుకున్న తక్కువ కాలంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సెంచరీ సాధించి సత్తా చాటాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

టీమిండియా యంగ్ క్రికెటర్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అతి తక్కువ కాలంలోనే క్రికెట్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వైజాగ్ కుర్రాడైన నితీష్ టీమిండియాలో స్థానం సంపాదించుకున్న తక్కువ కాలంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సెంచరీ సాధించి సత్తా చాటాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సంక్రాంతి వేడుకల్లో కూడా పాల్గొన్నాడు.
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ అపెక్స్ బాడీతో కలిసి చంద్రబాబు వద్దకు నితీష్ వెళ్లాడు. ఈ సందర్భంగా నితీష్‌ను చంద్రబాబు ప్రశంసించారు. మరింతగా రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని నితీష్‌తో సీఎం అన్నారు. ఎంపీ కేశనేని చిన్ని, ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ సభ్యులు అందరూ నితీష్‌తో పాటు సీఎంను కలిశారు. నితీష్ సెంచరీ సాధించిన తర్వాత ప్రోత్సాహకంగా ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ రూ.25 లక్షల చెక్కును ప్రకటించింది. ఆ చెక్కును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గతేడాది రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎంపికయ్యారని, వచ్చే ఏడాది 15 మంది ఎంపిక అయ్యేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ కేశనేని చిన్ని అన్నారు. రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇక, ఈ సందర్భంగా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ``ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో సెంచరీ చేసినా మ్యాచ్ కోల్పోవడం బాధ అనిపించింది. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్. అందరూ రాణిస్తేనే విజయం సాధ్యం అవుతుంద``ని నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..