Chennai Super Kings Win: చెన్నై గెలిచిందోచ్
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:02 AM
ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రషీద్, దూబే, ధోనీ కీలక ప్రదర్శనతో లఖ్‌నవూపై 5 వికెట్ల తేడాతో గెలిచింది

సత్తా చాటిన బౌలర్లు
ఆదుకున్న దూబే, ధోనీ
5 వికెట్ల తేడాతో లఖ్‌నవూ ఓటమి
లఖ్‌నవూ: ఒకటా.. రెండా.. వరుసగా ఐదు ఓటములతో నిరుత్సాహపర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయం రుచి చూసింది. సీజన్‌లో తొలిసారిగా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చగా.. అటు బ్యాటింగ్‌లో శివమ్ దూబే (43 నాటౌట్) నిలకడ, ఎంఎస్ ధోనీ (11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) మెరుపు ఆటతీరుతో చివరి ఓవర్‌లో చెన్నై గట్టెక్కింది. మరోవైపు హ్యాట్రిక్ విజయాల జోష్‌లో ఉన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఓడాల్సి వచ్చింది. ఇక మూడేళ్లగా చెన్నై జట్టుతోనే ఉంటున్న ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (19 బంతుల్లో 6 ఫోర్లతో 27) అరంగేట్రంలోనే రాణించాడు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (63), మిచెల్ మార్ష్ (30) రాణించారు. జడేజా, పథిరనలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. రచిన్ (37) ఆకట్టుకున్నాడు. బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధోనీ నిలిచాడు.
రషీద్-రచిన్ శుభారంభంతో..: ఓ మాదిరి ఛేదనలో చెన్నైకి అదిరే ఆరంభం లభించింది. తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే షేక్ రషీద్ ఓపెనర్‌గా బరిలోకి దిగి బెదురులేకుండా ఆడాడు. చూడముచ్చటైన షాట్లతో జట్టుకు తనపై నమ్మకం కుదిరేలా ఆకట్టుకున్నాడు. తొలి ఓవర్‌లో మరో ఓపెనర్ రచిన్ రెండు ఫోర్లు బాదగా.. ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్ మూడు ఫోర్లు బాది వహ్వా అనిపించాడు. అంతేకాకుండా శార్దూల్ వేసిన ఓవర్‌లోనూ మరో మూడు ఫోర్లతో 14 రన్స్ అందించాడు. అయితే ఆత్మవిశ్వాసంతో కనిపించిన అతడు భారీ షాట్‌కు యత్నించి అవేశ్‌కు చిక్కాడు. రషీద్ 27 పరుగుల్లో ఆరు ఫోర్లు ఉండడం విశేషం. అతని జోరుతో పవర్‌ప్లేలో చెన్నై 59/1 స్కోరుతో పటిష్ఠంగా కనిపించింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్లు హవా చూపడంతో ఒక్కసారిగా తడబడింది. స్కోరు నెమ్మదించడంతో పాటు స్వల్ప వ్యవధిలోనే రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్ శంకర్ (9)ల వికెట్లను కోల్పోయింది. అప్పటికి స్కోరు 111/5. ఈ స్థితిలో ప్రేక్షకుల హోరు మధ్య అడుగుపెట్టిన ధోనీ 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు, తర్వాత శార్దూల్ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో ఒత్తిడి తగ్గించాడు. ఇక 19వ ఓవర్‌లో దూబే 4,6.. ఎంఎస్ 4తో 19 రన్స్ రావడంతో ఎల్‌ఎ్‌సజీ ఆశలు వదులుకుంది. ఆరు బంతుల్లో ఐదు రన్స్ కావాల్సిన వేళ దూబే 4తో మరో మూడు బంతులుండగా చెన్నైకి విజయం దక్కింది.
పంత్ పోరాటం: సీజన్‌లో తొలిసారిగా చెన్నై బౌలర్లు క్రమశిక్షణాయుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. మధ్య ఓవర్లలో మరింత కట్టుదిట్టం చేయడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ పరుగుల కోసం చెమటోడ్చింది. ముఖ్యంగా స్పిన్నర్ నూర్ అహ్మద్ తన మ్యాజిక్ బంతులతో వణికించాడు. అయితే పంత్ మాత్రం తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. చివరి మూడు ఓవర్లలో అతడి ఎదురుదాడికి లఖ్‌నవూ 44 రన్స్‌తో గౌరవప్రదమైన స్కోరందుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మార్‌క్రమ్ (6)ను ఖలీల్ అవుట్ చేశాడు. కవర్ పాయింట్‌లోకి కొట్టిన బంతి గాల్లోకి లేవగా త్రిపాఠి వేగంగా పరిగెత్తుతూ డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. అలాగే నాలుగో ఓవర్‌లోనే ప్రమాదకర పూరన్ (8)ను అన్షుల్ కాంబోజ్ ఎల్బీ చేయడంతో జట్టు పవర్‌ప్లేలో 42/2 స్కోరుతో నిలిచింది. క్రీజులో మార్ష్, పంత్ ఉన్నా బంతి బ్యాట్ మీదికి రాకపోవడంతో భారీ షాట్లకు ఇబ్బందిపడ్డారు. మూడో వికెట్‌కు 50 పరుగులు చేరిన వెంటనే మార్ష్‌ను జడేజా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్‌లో బదోని (22) రెండు వరుస సిక్సర్లతో కాస్త కదలిక తెచ్చాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే తను క్యాచ్ అవుటైనా అది నోబ్‌గా తేలింది. అలాగే 14వ ఓవర్ తొలి బంతికి అంపైర్ ఎల్బీ ఇచ్చినా రివ్యూలో బతికిపోయాడు. కానీ నాలుగో బంతికి ధోనీ స్టంప్ చేయడంతో వెనుదిరగక తప్పలేదు. మరోవైపు 14-17 ఓవర్ల మధ్య చెన్నై బౌలర్లు 18 పరుగులే ఇవ్వడంతో 150 స్కోరు కూడా కష్టమే అనిపించింది. ఈ దశలో పంత్ రెండు సిక్సర్లతో 18వ ఓవర్‌లో 18 రన్స్ రాబట్టాడు. అలాగే ఐపీఎల్‌లో 19 ఇన్నింగ్స్ తర్వాత తను అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్‌లోనూ పంత్, సమద్‌ల సిక్సర్లతో 16 రన్స్ సమకూరాయి. ఇక చివరి ఓవర్‌లో పంత్, శార్దూల్ (6)ల వికెట్లను పథిరన తీయగా సమద్ రనౌటయ్యాడు. అయితే 10 రన్స్‌తో ఎల్‌ఎస్‌జీ 160 స్కోరు దాటగలిగింది.
చెన్నై కాదు లఖ్‌నవూనే
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సొంత గడ్డపైనే కాదు.. దేశంలో ఏ వేదికపై ఆడినా అభిమానులకు కొదవుండదు. తాజాగా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై లఖ్‌నవూకు వచ్చినప్పటికీ.. సీఎ్‌సకేపై తమ ప్రేమను చాటుకుంటూ స్టేడియం మొత్తం పసుపుమయమైంది. దీనికంతటికీ కారణం ఎంఎస్ ధోనీయేనని వేరే చెప్పనవసరం లేదు. స్థానిక జట్టు అభిమానులకన్నా రెండింతలు ఎంఎస్ నెంబర్ 7 జెర్సీలతోనే ఫ్యాన్స్ కనిపించడంతో మ్యాచ్ జరుగుతోంది చెపాక్‌లోనా? ఏక్‌నా స్టేడియంలోనా? అనే సందేహం కలిగింది.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: మార్‌క్రమ్ (సి) త్రిపాఠి (బి) ఖలీల్ 6; మార్ష్ (బి) జడేజా 30; పూరన్ (ఎల్బీ) కాంబోజ్ 8; పంత్ (సి) ధోనీ (బి) పథిరన 63; బదోని (స్టంప్) ధోనీ (బి) జడేజా 22; సమద్ (రనౌట్) 20; మిల్లర్ (నాటౌట్) 0; శార్దూల్ (సి) రషీద్ (బి) పథిరన 6; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 166/7. వికెట్ల పతనం: 1-6, 2-23, 3-73, 4-105, 5-158, 6-158, 7-166; బౌలింగ్: ఖలీల్ 4-0-38-1; కాంబోజ్ 3-0-20-1; ఒవర్టన్ 2-0-24-0; జడేజా 3-0-24-2; నూర్ అహ్మద్ 4-0-13-0; పథిరన 4-0-45-2.
చెన్నై: రషీద్ (సి) పూరన్ (బి) అవేశ్ 27; రచిన్ (ఎల్బీ) మార్‌క్రమ్ 37; త్రిపాఠి (సి అండ్ బి) బిష్ణోయ్ 9; జడేజా (సి) మార్‌క్రమ్ (బి) బిష్ణోయ్ 7; దూబే (నాటౌట్) 43; విజయ్ శంకర్ (సి) అవేశ్ (బి) దిగ్వేష్ 9; ధోనీ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.3 ఓవర్లలో 168/5. వికెట్ల పతనం: 1-52, 2-74, 3-76, 4-96, 5-111; బౌలింగ్: శార్దూల్ 4-0-56-0; ఆకాశ్ 1-0-13-0; దిగ్వేష్ 4-0-23-1; అవేశ్ 3.3-0-32-1; బిష్ణోయ్ 3-0-18-2; మార్‌క్రమ్ 4-0-25-1.