Lucknow Super Giants: విజయాన్ని లాగేశారు

ABN, Publish Date - Apr 05 , 2025 | 03:40 AM

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. మార్ష్‌ మెరుపు బ్యాటింగ్‌తో లఖ్‌నవూ 203 పరుగులు చేయగా, ముంబై 191 పరుగులు చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా దిగ్వేష్‌ రాఠి నిలిచాడు

Lucknow Super Giants: విజయాన్ని  లాగేశారు
  • సత్తా చాటిన లఖ్‌నవూ బౌలర్లు

  • ముంబై పరాజయం

  • మార్ష్‌ మెరుపు ఇన్నింగ్స్‌

  • సూర్య పోరాటం వృధా

ఐపీఎల్‌లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా. అలాగే అతడి టీ20 కెరీర్‌లోనూ ఈ ఫీట్‌ సాధించడం ఇదే మొదటిసారి.

లఖ్‌నవూ: సొంత గడ్డపై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ సత్తా చాటుకుంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) మెరుపు ఆటతీరు కనబర్చగా.. అటు గెలుపు ఖాయమే అనుకున్న వేళ ముంబై ఇండియన్స్‌ను ఆఖర్లో లఖ్‌నవూ బౌలర్లు దెబ్బతీశారు. దీంతో శుక్రవారం ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో పంత్‌ సేన 12 పరుగుల తేడాతో నెగ్గింది. అలాగే ఐపీఎల్‌లో ముంబైతో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో లఖ్‌నవూకిది ఆరో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53) అర్ధసెంచరీ సాధించగా, ఆయుష్‌ బదోని (19 బంతుల్లో 4 ఫోర్లతో 30), మిల్లర్‌ (14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) సహకరించారు. హార్దిక్‌కు ఐదు వికెట్లు లభించాయి. ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. సూర్యకుమార్‌ (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 67), నమన్‌ ధిర్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) పోరాడారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా దిగ్వేష్‌ రాఠి నిలిచాడు.


నమన్‌-సూర్య పోరాడినా..

భారీ ఛేదనలో ముంబై తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు జాక్స్‌ (5), రికెల్టన్‌ (10) వికెట్లను కోల్పోయింది. అప్పటికి స్కోరు 17 పరుగులే. ఈ దశలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ ధిర్‌- సూర్యకుమార్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నమన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఎల్‌ఎ్‌సజీ బౌలర్లపై ఎదురుదాడి ఆరంభించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీలు బాదేస్తూ స్కోరును చకచకా పెంచాడు. నాలుగో ఓవర్‌లో 6,6,4,4తో 21 రన్స్‌ రాబట్టాడు. అతడి ధాటికి పవర్‌ప్లేలో స్కోరు 64/2తో ఛేదన దిశగా సాగింది. అటు సూర్య సహకారం అందించడంతో దాదాపు 11 రన్‌రేట్‌తో ఇన్నింగ్స్‌ సాగింది. అయితే స్పిన్నర్‌ దిగ్వేష్‌ తొమ్మిదో ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చి నమన్‌ను బౌల్డ్‌ చేయగా మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సూర్య బాధ్యతను తీసుకుని అడపాదడపా బౌండరీలు సాధించాడు. మరో ఎండ్‌లో లఖ్‌నవూ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో తిలక్‌ వర్మ (25) భారీ షాట్లు ఆడలేకపోయాడు. అటు రన్‌రేట్‌ కూడా పెరగసాగింది. ఈ స్థితిలో 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన సూర్యను పేసర్‌ అవేశ్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. అటు ముంబై అవకాశాలు కూడా సన్నగిల్లాయి. 12 బంతుల్లో 29 రన్స్‌ కావాల్సిన స్థితిలో 19వ ఓవర్‌లో శార్దూల్‌ ఏడు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అలాగే ఐదో బంతికి తిలక్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో శాంట్నర్‌ (2 నాటౌట్‌) క్రీజులోకి వచ్చాడు. ఇక సమీకరణం చివరి ఆరు బంతుల్లో 22 పరుగులకు మారింది. అవేశ్‌ తొలి బంతిని హార్దిక్‌ (28 నాటౌట్‌) సిక్సర్‌గా మలిచినా 9 పరుగులే రావడంతో ముంబై చేసేదేమీ లేకపోయింది.


మార్ష్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్‌ మార్ష్‌ రూపంలో మెరుపు ఆరంభం లభించింది. బాదడమే లక్ష్యంగా సాగిన అతడి ఎదురుదాడికి పవర్‌ప్లేలోనే 69 పరుగులు సమకూరాయి. ఇందులో మార్ష్‌ ఒక్కడివే 60 పరుగులు కావడం విశేషం. మరో ఓపెనర్‌ మార్‌క్రమ్‌ ఈ దశలో ఆరు బంతులే ఆడాడు. వాస్తవానికి మార్ష్‌ తొలి ఓవర్‌లోనే అవుట్‌ కావాలి. అతడి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతిని కీపర్‌ రికెల్టన్‌ అందుకున్నా ఎవరూ అప్పీల్‌ చేయలేదు. అశ్వని కుమార్‌ వేసిన ఆరో ఓవర్‌లో మార్ష్‌ 6,4,4,4తో 23 పరుగులు రాబట్టాడు. 27 బంతుల్లోనే ఈ సీజన్‌లో మూడో హాఫ్‌ సెంచరీని కూడా పూర్తి చేశాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే స్పిన్నర్‌ విఘ్నేష్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చడంతో తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అలాగే హార్దిక్‌ వరుస ఓవర్లలో ప్రమాదకర పూరన్‌ (12), కెప్టెన్‌ పంత్‌ (2)ను అవుట్‌ చేయడంతో ముంబైలో జోష్‌ కనిపించింది. కానీ ఈ దశలో మార్‌క్రమ్‌ బ్యాట్‌ ఝుళిపించగా, అతడికి బదోని సహకారం అందించాడు. హార్దిక్‌, విఘ్నేష్‌ ఓవర్లలో మార్‌క్రమ్‌ భారీ సిక్సర్లతో అలరించాడు. అటు బదోని 14వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో 15 రన్స్‌ సమకూర్చాడు. నాలుగో వికెట్‌కు 51 పరుగులు జత చేరాక బదోనిని అశ్వని అవుట్‌ చేశాడు. ఇక 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన మార్‌క్రమ్‌ను హార్దిక్‌ దెబ్బతీశాడు. అబ్దుల్‌ సమద్‌ (4) విఫలం కాగా..చివరి ఓవర్‌లో మిల్లర్‌ (14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 27) 6,4 బాది స్కోరును 200 దాటించాడు. అయితే మిల్లర్‌తో పాటు ఆకాశ్‌దీప్‌(0)ను అవుట్‌ చేసి హార్దిక్‌ 5 వికెట్లను పూర్తి చేశాడు.


స్కోరుబోర్డు

లఖ్‌నవూ: మార్ష్‌ (సి అండ్‌ బి) విఘ్నేష్‌ 60, మార్‌క్రమ్‌ (సి) రాజ్‌ బవ (బి) హార్దిక్‌ 53, పూరన్‌ (సి) చాహర్‌ (బి) హార్దిక్‌ 12, పంత్‌ (సి/సబ్‌) బాష్‌ (బి) హార్దిక్‌ 2, బదోని (సి) రికెల్టన్‌ (బి) అశ్వని 30, మిల్లర్‌ (సి) నమన్‌ (బి) హార్దిక్‌ 27, అబ్దుల్‌ సమద్‌ (సి) నమన్‌ (బి) బౌల్ట్‌ 4, శార్దూల్‌ (నాటౌట్‌) 5, ఆకాశ్‌దీప్‌ (సి) శాంట్నర్‌ (బి) హార్దిక్‌ 0, అవేశ్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 203/8; వికెట్ల పతనం: 1-76, 2-91, 3-107, 4-158, 5-173, 6-182, 7-200, 8-200; బౌలింగ్‌: బౌల్ట్‌ 3-0-28-1, దీపక్‌ చాహర్‌ 2-0-23-0, అశ్వని కుమార్‌ 3-0-39-1, శాంట్నర్‌ 4-0-46-0, విఘ్నేష్‌ పుతూర్‌ 4-0-31-1, హార్దిక్‌ పాండ్యా 4-0-36-5.

ముంబై: విల్‌ జాక్స్‌ (సి) బిష్ణోయ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 5, రికెల్టన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) శార్దూల్‌ 10, నమన్‌ (బి) దిగ్వేష్‌ 46, సూర్యకుమార్‌ (సి) సమద్‌ (బి) అవేశ్‌ 67, తిలక్‌ (రిటైర్డ్‌ అవుట్‌) 25, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 28, శాంట్నర్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 191/5; వికెట్ల పతనం: 1-11, 2-17, 3-86, 4-152, 5-180; బౌలింగ్‌: శార్దూల్‌ 4-0-40-1, ఆకాశ్‌దీప్‌ 4-0-46-1, అవేశ్‌ ఖాన్‌ 4-0-40-1, దిగ్వేష్‌ రాఠి 4-0-21-1, రవి బిష్ణోయ్‌ 4-0-40-0.


ఇవీ చదవండి:

ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు

రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్

ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2025 | 06:03 AM