Share News

Big Wheel Galaxy: శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోన్న బిగ్ వీల్.. ఏంటి దీని కథ

ABN , Publish Date - Apr 07 , 2025 | 02:06 PM

ఖగోళ శాస్త్రవేత్తలు బిగ్ వీల్ అనే భారీ గెలాక్సీని గుర్తించారు. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత.. విశ్వం పుట్టుక గురించి ఇప్పటి వరకు మనకు ఉన్న అభిప్రాయాలను ఇది సవాలు చేస్తుంది అంటున్నారు. ఆ వివరాలు..

Big Wheel Galaxy: శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోన్న బిగ్ వీల్.. ఏంటి దీని కథ
Big Wheel Galaxy

విశ్వంలో దాగున్న వింతలు ఎన్నో. ఈ విశ్వం గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. విశ్వం రహస్యాలను చేధించడానికి శాస్త్రవేత్తలు నిత్యం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇక విశ్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారం మనకు తెలుస్తూనే ఉంటుంది. తాజాగా విశ్వానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

సుమారు పన్నెండు బిలియన్ సంవత్సరాల క్రితం అనగా విశ్వం ప్రారంభ దశలోనే ఒక భారీ సర్పిలాకార గెలాక్సీ ఏర్పడటమేకాక.. అప్పటికే తిరుగుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. "బిగ్ వీల్" అనే ఈ గెలాక్సీ, ఊహించిన దానికంటే చాలా ముందుగానే ఏర్పడిందని తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుగొనబడిన బిగ్ వీల్ గెలాక్సీ.. ఇప్పటి వరకు మనకు విశ్వం పుట్టుక, గెలాక్సీ పరిమాణంపై మనకు ఉన్న అవగాహనను సవాలు చేస్తుంది అంటున్నారు. అంతేకాక విశ్వం ప్రారంభం గురించి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఊహించిన దానికన్నా.. చాలా నిర్మాణాత్మకంగా ఉండవచ్చనే అభిప్రాయాన్ని బిగ్ వీల్ ఆవిష్కరణ కలిగిస్తోంది అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.


బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం 1.7 బిలియన్ సంవత్సరాల తర్వాత బిగ్ వీల్ గెలాక్సీ ఏర్పడిందని.. ఆ సమయంలో విశ్వం దాని ప్రస్తుత వయస్సులో కేవలం 15 శాతం మాత్రమే ఉంది అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ సమాయానికి చాలా గెలాక్సీలు చిన్నవిగా, క్రమరహితమైనవిగా ఇంకా నిర్మాణ ప్రక్రియలోనే ఉన్నాయని తెలిపారు. అయితే, బిగ్ వీల్ అనేది పూర్తిగా అభివృద్ధి చెందిన సర్పిలాకార గెలాక్సీ.. ఇది మన పాలపుంత మాదిరిగానే ఉంటుందని.. అంతేకాక అప్పడు ఏర్పడిన గెలాక్సీల కన్నా ఇది చాలా పెద్దదని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

బిగ్ వీల్ ఆవిష్కరణ ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే సాంప్రదాయ నమూనాలు ప్రకారం చూసుకుంటే.. డిస్క్ గెలాక్సీలు ఏర్పడటానికి.. బిలియన్ల సంవత్సరాల సమయం పడుతుంది. పైగా ఇవి, వాయువు చేరిక, విలీనాల ద్వారా చాలా నెమ్మదిగా ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.


బిగ్ వీల్ అనేది సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉందని.. ఇక్కడ గెలాక్సీ సాంద్రత సగటు కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రద్దీ వాతావరణం బిగ్ వీల్ వేగవంతమైన నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. .

బిగ్ వీల్‌ గెలాక్సీని కనుగొనడం అనేది ఒక అరుదైన సంఘటన అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. దీని ఆవిష్కరణ వల్ల.. విశ్వం ప్రారంభంలో గెలాక్సీలు ఎలా అభివృద్ధి చెందాయి అనే అంశంపై ఖగోళ శాస్త్రవేత్తలు పునరాలోచించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందంటున్నారు. బిగ్ వీల్ గుర్తింపు అనేది విశ్వ చరిత్రపై మన అవగాహనను పూర్తిగా మార్చుతుంది అంటున్నారు.

ఇవి కూాడా చదవండి:

బట్టతలపై జట్టు మొలిపించే మందు.. క్యూ కట్టిన జనం.. తీరా చూస్తే..

ఇంట్లో అద్దం పగిలిపోవడం శుభమా.. లేదా అశుభమా.

Updated Date - Apr 07 , 2025 | 02:08 PM