Google Map: గూగుల్ మ్యాప్స్‌లో ఒక్కో రంగుకి ఒక్కో అర్థం.. ఏది దేనిని సూచిస్తుందో తెలుసుకుంటే..
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:48 PM
Google Maps Color Meaning: గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు. ఒకరి సాయం లేకుండా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లవచ్చు. అయితే, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే రకరకాల రంగులతో సింబల్స్, రూట్స్ కనిపిస్తుంటాయి. నిజానికి, చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. వీటి అర్థాలు మీకు తెలిస్తే గనక..

How To Understand Colors On Google Maps: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు రూట్స్, హోటల్స్, వెళ్లాల్సిన ప్రాంతాలు, ట్రాఫిక్ వివరాలు ఇలా ఎన్నో విషయాలు కనుగొనడానికి Google Maps పైనే ఆధారపడతారు. కానీ కొన్నిసార్లు మనం వెళ్లాలనుకున్న ప్రాంతం గురించి కనుక్కున్న తర్వాత కూడా మ్యాప్‌లో కనిపించే రేఖలు, రంగుల అర్థాన్ని గురించి తెలుసుకోలేకపోవడం వల్ల డెస్టినేషన్ చేరుకునేందుకు ఆలస్యం కావచ్చు. ఇది తెలుసుకంటే మీరు మీ మార్గాన్ని సులభంగా కనుగొనవచ్చు.
గూగుల్ మ్యాప్స్‌లో ఏయే రంగులు ఉంటాయి
గూగుల్ మ్యాప్స్‌లో నీలం, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలైన అనేక రంగుల రేఖలు కనిపిస్తాయి. ఈ రేఖలు, రంగులకు ప్రత్యేక అర్థం ఉంటుంది. ఇవి కొన్నిసార్లు ట్రాఫిక్, మరి కొన్నిసార్లు రోడ్లు, ఇంకొన్నిసార్లు అడవులు లేదా నీటిని చూపుతాయి. ఒక్కో రంగుకి గల అర్థం ఏంటే తెలుసుకుంటే Google Maps ని వీక్షించడం సులభమవుతుంది.
నీలం రంగు: నీలం రంగు మీరు వెళ్లాల్సిన మార్గాన్ని సూచిస్తుంది. ముదురు నీలం రంగులో ఉంటే మీరు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా హాయిగా వెళ్ళవచ్చు. లేత నీలం రంగు నదులు, సరస్సులు, సముద్రాలు మొదలైన నీటి వనరులను చూపిస్తుంది.
ఎరుపు రంగు: ఎరుపు రంగు ట్రాఫిక్ జామ్‌ను సూచిస్తుంది. రోడ్డు ఎర్రగా కనిపిస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని అర్థం. ముదురు ఎరుపు రంగులో ఉంటే ట్రాఫిక్ జామ్ కావచ్చు. అలాంటప్పుడు గమ్యం చేరుకునేందుకు ఇతర మార్గాలను వెతకడం మంచిది.
ఆకుపచ్చ రంగు: ఆకుపచ్చ రంగు అడవులు, తోటలు, జాతీయ ఉద్యానవనాలు లేదా పచ్చని ప్రాంతాలను సూచిస్తుంది. కొన్నిసార్లు ట్రాఫిక్ లేకుండా రోడ్డుపై సాఫీగా ప్రయాణం చేయవచ్చని కూడా ఈ రంగు సూచిస్తుంది.
నలుపు, బూడిద రంగులు: మూసివేసిన రోడ్లు లేదా ప్రమాద స్థలాలను నలుపు లేదా బూడిద రంగులు సూచిస్తాయి. ఈ రంగులు ఉంటే మార్గం క్లోజ్ చేసి ఉండవచ్చు లేదా ట్రాఫిక్ కారణంగా బయటపడటానికి దారి లేకపోవచ్చు.
పసుపు రంగు: పసుపు రంగు ప్రధాన రహదారిని సూచిస్తుంది. ఇది ట్రాఫిక్ తక్కువగా ఉండే పెద్ద రహదారి. ఎక్కువ రద్దీ లేకపోయినా డెస్టినేషన్ చేరుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు.
మీరు ఒక ప్రదేశానికి త్వరగా చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తుంటే అప్పుడు నీలం లేదా ఆకుపచ్చ రంగుల్లో కనిపించే రూట్లను ఎంచుకోండి. ఇక పసుపు రంగు రోడ్డులో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. ఎరుపు, నలుపు రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి కాబట్టి ఆ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నించకండి.