Share News

Rail Engines: రైల్ ఇంజిన్‌లో ఎన్ని రకాలుంటాయో తెలుసా.. ఎక్కువగా వాడే ఇంజిన్‌లు ఏవంటే

ABN , Publish Date - Apr 04 , 2025 | 09:48 AM

దూర ప్రయాణాలు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే ప్రయాణ సాధనం.. రైలు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కుతారు. అయితే రైల్వే శాఖ గురించి, వాటి పనితీరు గురించి మనలో చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా రైలు ఇంజిన్‌ల గురించి తెలియదు. ఇందుకు సంబంధించిన సమాచారం మీకోసం..

Rail Engines: రైల్ ఇంజిన్‌లో ఎన్ని రకాలుంటాయో తెలుసా.. ఎక్కువగా వాడే ఇంజిన్‌లు ఏవంటే
rail engines

దేశ రవాణా వ్యవస్థలో రైల్వే రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే రైలు ప్రయాణినికే ఓటేస్తారుచాలా మంది. పైగా ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పిస్తోన్న రంగంలో భారతీయ రైల్వే కూడా ఒకటి. అయితే రైల్వే రంగం గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. మరీ ముఖ్యంగా రైలు ఇంజిన్‌ల గురించి. భారతదేశంలో రైలు ఇంజిన్‌లను ప్రధానంగా డీజిల్, ఎలక్ట్రిక్ అనే రెండు రకాలుగా విభజించారు. గతంలో స్టీమ్(ఆవిరి) ఇంజిన్‌లు వినియోగంలో ఉండేవి. ఇక ఈ ఇంజిన్‌లను కూడా గేజ్ ఆధారంగా బ్రాడ్, మీటర్, నారో గేజ్‌లుగా.. అలానే శక్తి సామార్థ్యం, ఉపయోగం ఆధారంగా..ప్యాసింజర్, గూడ్స్, మిక్స్‌డ్ రకాలుగా వర్గీకరిస్తారు. ఇప్పుడీ కథనంలో మనం భారత్‌లో ఎన్ని రకాల రైలు ఇంజిన్‌లు ఉన్నాయి.. వాటిలో అధికంగా వినియోగించేవి ఏవి వంటి వివరాలు తెలుసుకుందాం.


రైలు ఇంజిన్‌ల రకాలు

భారత రైల్వేలో.. రైలు ఇంజిన్‌లను వాటి శక్తి సామార్థ్యం ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి..

స్టీమ్ లోకోమోటివ్‌లు..

మన దేశంలో రైల్వేలో ప్రథమంగా ఉపయోగించిన ఇంజిన్‌లు ఇవే. భారతదేశంలో మొదటి రైలు 1853లో బొంబాయి-థానే మధ్య ప్రారంభమైంది. అప్పటి నుంచి 1990ల వరకు ఈ స్టీమ్ ఇంజిన్‌లు వినియోగంలో ఉన్నాయి. డబ్ల్యూపీ, డబ్య్లూజీ వంటి తరగతులు బ్రాడ్ గేజ్‌లో ప్రసిద్ధి చెందాయి. 1995లో ఫిరోజ్‌పూర్-జలంధర్ మధ్య చివరి స్టీమ్ రైలు నడిచింది. ఆ తర్వాత వీటిని పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ఇవి హెరిటేజ్ రైళ్లలో మాత్రమే కనిపిస్తాయి.


డీజిల్ లోకోమోటివ్‌లు

స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ల తర్వాత అనగా.. 1957లో అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ (ఏఎల్‌సీఓ) నుంచి డబ్ల్యూడీఎమ్-1 దిగుమతి చేసుకోవడంతో.. మన దేశంలో డీజిల్ ఇంజిన్‌ల యుగం మొదలైది. డబ్ల్యూడీఎమ్-2, డబ్ల్యూడీఎమ్-3A, డబ్ల్యూడీపీ-4, డబ్ల్యూడీజీ-4 వంటి తరగతులు వీటిల్లో ముఖ్యమైనవి. ఇవి ఎలక్ట్రిఫై కాని ట్రాక్‌లపై ఎక్కువగా వినియోగిస్తారు.


ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు..

ఇవి బ్రిటీష్ కాలంలోనే పరుగులు తీయడం ప్రారంభంచాయి. 1925లో బొంబాయి-కుర్లా మధ్య మొదటి ఎలక్ట్రిక్ రైలు ప్రారంభమైంది. డబ్ల్యూఏపీ (ప్యాసింజర్), డబ్ల్యూఏజీ (గూడ్స్), డబ్ల్యూసీఏఎం (డ్యూయల్) వంటి తరగతులు ఈ రకంలోకి వస్తాయి. ప్రస్తుతం డబ్ల్యూఏపీ-7, డబ్ల్యూఏజీ-9, డబ్ల్యూఏజీ-12 వంటి వాటిని ఆధునిక ఎలక్ట్రిక్ ఇంజిన్‌లుగా గుర్తిస్తున్నారు. ఈ రకాలను గేజ్ (డబ్ల్యై-బ్రాడ్, వై-మీటర్, జడ్-నారో), ఉపయోగం (P-ప్యాసింజర్, జీ-గూడ్స్, ఎం-మిక్స్‌డ్, ఎస్-షంటింగ్), శక్తి సామర్థ్యం ఆధారంగా ఉపవిభాగాలుగా వర్గీకరిస్తారు. ఉదాహరణకు, డబ్ల్యూఏపీ-7 అంటే బ్రాడ్ గేజ్, ఎలక్ట్రిక్, ప్యాసింజర్ రైళ్ల కోసం రూపొందించిన ఇంజిన్.


మన దేశంలో ఎక్కువగా వాడే ఇంజిన్‌లు..

భారత రైల్వేలో 2024 నాటికి 14,800 లోకోమోటివ్‌లు ఉన్నాయి, వీటిలో 10,238 ఎలక్ట్రిక్‌వి కాగా.. 4,397 డీజిల్ ఇంజిన్‌లు. వీటిల్లో ఎక్కువగా ఉపయోగించే ఇంజిన్‌లు ఇవే.

డబ్ల్యూఏపీ-7 (ఎలక్ట్రిక్):

6,350 హార్స్‌పవర్ శక్తితో.. ప్యాసింజర్ రైళ్లలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.. రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లకు దీని వినియోగిస్తున్నారు. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ)లో తయారవుతుంది. దీని వేగం గంటకు 140 కి.మీ వరకు ఉంటుంది.

డబ్ల్యూఏజీ-9 (ఎలక్ట్రిక్):

6,350 హార్స్‌పవర్ శక్తితో ఉండే ఇది గూడ్స్ రైళ్లకు అత్యంత ప్రజాదరణ పొందిన ఇంజిన్. భారీ లోడ్‌లను లాగగల సామర్థ్యం అధికంగా ఉండటంతో.. దీన్ని ఫ్రైట్ కారిడార్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీని ఆధునిక వెర్షన్ డబ్ల్యూఏజీ-9హెచ్ కూడా ప్రసిద్ధి చెందింది.


డబ్ల్యూడీఎం-3ఏ (డీజిల్):

3,100 హార్స్‌పవర్ శక్తితో ఉండేఇది డీజిల్ ఇంజిన్‌లలో అత్యంత సాధారణమైనది. ఎలక్ట్రిఫై కాని రూట్‌లలో తిరిగే ప్యాసింజర్, గూడ్స్ రైళ్లకు ఎక్కువగా వినియోగిస్తారు. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యూ, వారణాసి)లో దీన్ని తయారు చేస్తారు.

డబ్ల్యూఏజీ-12 (ఎలక్ట్రిక్):

12,000 హార్స్‌పవర్ శక్తిని కలిగి ఉండే ఇది భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్. ఆల్‌స్టామ్ సహకారంతో మధేపుర (బిహార్)లో తయారవుతుంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.


ఎందుకు ఈ ఇంజిన్‌లకు అధిక ప్రాధాన్యత

భారత రైల్వేలో 96 శాతం బ్రాడ్ గేజ్ ట్రాక్‌లు 2024 నాటికి ఎలక్ట్రిఫై అయ్యాయి. దీంతో ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు (డబ్ల్యూఏపీ-7, డబ్ల్యూఏజీ-9, డబ్ల్యూఏజీ-12) ఎక్కువగా వాడుతున్నారు. ఇవి అత్యధిక ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణహితంగా ఉంటాయి. డీజిల్ ఇంజిన్‌లు (డబ్ల్యూడీఎం-3ఏ) ఇప్పటికీ గ్రామీణ, ఎలక్ట్రిఫై కాని ప్రాంతాల్లో కీలకంగా ఉన్నాయి. 2023-24లో రైల్వే 6.9 బిలియన్ ప్యాసింజర్లను, 1,588 మిలియన్ టన్నుల ఫ్రైట్‌ను రవాణా చేసింది. దీనిలో ఇంజిన్‌లదే ప్రధాన పాత్ర.


చివరగా..

భారత రైల్వేలో స్టీమ్ ఇంజిన్‌లు చరిత్రలో భాగమైనప్పటికీ, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు ప్రస్తుత రవాణా అవసరాలను తీరుస్తున్నాయి. డబ్ల్యూఏపీ-7, డబ్ల్యూఏజీ-9, డబ్ల్యూడీఉం-3ఏ, డబ్ల్యూఏజీ-12 వంటి ఇంజిన్‌లు వాటి శక్తి, సామర్థ్యం కారణంగా ఎక్కువగా ఉపయోగంలో ఉన్నాయి. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పూర్తయ్యే కొద్దీ ఎలక్ట్రిక్ ఇంజిన్‌ల ఆధిపత్యం మరింత పెరుగుతుందని నిపుణులు చెప్పుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రస్తుత స్థితిని లైట్ తీసుకుంటున్న అధ్యక్షుడు ట్రంప్

కరెన్సీ నోట్ల తయారీకి ముందు జరిగే ప్రక్రియ గురించి తెలుసా..

Updated Date - Apr 04 , 2025 | 09:58 AM