Kamareddy: కామారెడ్డి జిల్లాలో కాటేసిన కల్తీ కల్లు

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:34 AM

కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం కల్తీ కల్లు తాగి 32 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరందరినీ వెంటనే బాన్సువాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కాటేసిన కల్తీ కల్లు
  • కల్లు తాగి 32 మందికి అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం

నస్రుల్లాబాద్‌/బీర్కూర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం కల్తీ కల్లు తాగి 32 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరందరినీ వెంటనే బాన్సువాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని నసుల్ల్లాబాద్‌ మండలం అంకోల్‌ తండా, అంకోల్‌, దుర్కి, సంగం గ్రామాలతో పాటు బీర్కూర్‌ మండలం దామరాం గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగిన వారు ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు మెడ వంకర పోవడం, కాళ్లు చేతులు లేపలేని పరిస్థితికి చేరుకున్నారు.


ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వారందరినీ వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు, కల్తీ కల్లు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని నిర్ధారించారు. అంకోల్‌కు చెందిన రవి, మధుకుమార్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, బాధితుల్లో చాలా మంది రోజువారీ కూలీలే ఉన్నారు. కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని ఎక్సైజ్‌ సీఐ తెలిపారు.

Updated Date - Apr 08 , 2025 | 05:34 AM