సాగు భారం
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:08 PM
వ్యవసాయమే ప్రధాన జీవనధారమైన జిల్లాలో పంటలపై రోజురోజుకు సాగు భారం ఎక్కువ అవుతున్నది. యేటా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నదాతలు ఽఆందోళనకు గురవుతున్నారు.

- జిల్లాలో మొదలైన వేసవి దుక్కులు
- రోజురోజుకు రెట్టింపు అవుతున్న యంత్ర సామగ్రి ధరలు
-పెట్టుబడి వ్యయంతో రైతుల ఆందోళన
ఆసిఫాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే ప్రధాన జీవనధారమైన జిల్లాలో పంటలపై రోజురోజుకు సాగు భారం ఎక్కువ అవుతున్నది. యేటా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నదాతలు ఽఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో వానాకాలం పంటల సాగుకు చేలను సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వేసవి దుక్కుల పనులు జోరుగా సాగుతున్నాయి. పెట్రోల్,డిజిల్ ధరలు విపరితంగా పెరిగిపోవడంతో బక్క రైతుపై సాగు భారం మరింత పడుతోంది. కాడెద్దులు కనుమరుగై పోవడంతో ఆధునిక సాగు పద్ధతులతో పంటల సాగు చేపడుతున్నారు. గతంలో కాడెద్దులతోనే రైతులు సాగు పనులు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. దీంతో అందుబాటులో ఉన్న ట్రాక్టర్ యంత్రాల సహాయంతోనే సాగు పనులు చేపడుతున్నారు. ఒక్కో గ్రామంలో ఐదు నుంచి పది ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇంధన డిమాండ్ భారీగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు కొంత కాలంగా 100 రూపాయలు దాటే కనిపిస్తున్నాయి.పెరిగి పోయిన ఇంధనదరలతో పంటల సాగుచేయడం కష్టమవుతోందన్న అభిప్రాయలు వక్తమవుతున్నాయి. ఏటేటా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నా.. దానికి అనుగుణంగా మద్దతు ధరలు పెరుగకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
మండుతున్న ఇంధన రేట్లు...
జిల్లాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ 108.82 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 97.09 లుగా ఉంది. ప్రస్తుతం వేసవి దుక్కుల పనులు ఊపందుకోవడంతో గ్రామాల్లో ట్రాక్టర్లు కూడా బిజీగా మారిపోయాయి. ఇక పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ అమ్మకాలు కూడా ఎక్కువగానే కనిపిసున్నాయి. సీజన్ మొదలైన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులకు మరింత భారంగా మారింది. జిల్లాలో రైతులు వేసవి దుక్కులు చేపడుతూ పంట చేలను చదును చేసుకుంటున్నారు. ఎండలు ముదిరిపోవడం, ఈ సమయంలోనే వేసవి దుక్కులు చేపడితే మంచి ప్రయోజనం ఉంటుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
పెరుగుతున్న అద్దె ధరలు...
ఇందన ధరలకు అనుగుణంగానే ట్రాక్టర్ యజమానులు అద్దె ధరలను పెంచేయడంతో అన్నదాతలపై అదనంగా భారం పడుతోంది. యేటా గంటకు రూ.100 నుంచి రూ.200 వరకు అద్దెలను పెంచేస్తున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో తమకేమి గిట్టుబాటు కావడం లేదని ట్రాక్టర్ యజమానులు పేర్కోంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే విధంగా రైతులు సాగు పనుల్లో యంత్రాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతీ పనిని యంత్రాల సహాయంతోనే చేపడుతున్నారు. ప్రస్తుతం యంత్రాలతో వేసవి దుక్కులు దున్నడం, పంట చేలను చదును చేయడం, చెరువులు, కుంటల నుంచి నల్ల మట్టి, సేంద్రియ ఎరువులను తరలించడం, పత్తి కర్రలను తొలగించడం లాంటి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇంధన ధరలు పెరిగాయన్న సాకుతో ట్రాక్టర్ యజమానులు అద్దెలను అమాంతంగా పెంచేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
యేటా రూ.కోట్ల భారం...
ఇందన ధరలు పెరిగిపోవడంతో జిల్లా రైతాంగంపై యేటా కోట్ల రూపాయల భారం పడుతోంది. దీంతో పంటలు సాగుచేయడం కష్ట సాధ్యమేనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1,19,978 మంది రైతులు ఉండగా 4,50,000 ఎకరాల్లో ప్రతి యేటా వివిధ పంటలను సాగు చేస్తున్నారు. దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగి పోతున్నాయి. నాలుగైదు సంవత్సరల క్రితం వరకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం 20వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు పెట్టుబడి వ్యయం అవుతుందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు కూలీల కొరతతో యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగిపోతోందంటున్నారు. దీంతో యేటా కోట్ల రూపాయల భారం రైతులపై పడుతున్నది.
సాగు పనుల ధరలు పెరిగాయి.
- పుల్గం పోశం, రైతు, ఆసిఫాబాద్
పంటల సాగు పనుల ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందన ధరలతో పాటు ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. నాలుగైదు సంవత్సరల క్రితం వరకు ఎకరానికి 10వేల నుంచి 15 వేల రూపాయల వరకు ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం 20వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు పెట్టుబడి వ్యయం అవుతున్నది.