అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:37 PM
చిన్న నిర్లక్ష్యంతోనే పెద్దపెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేసవికాలం వచ్చిందంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఆకులు, గడ్డి పొదల్లో నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేసి వదిలేసిన బీడీ, సిగరెట్లే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

ప్రతీ ఒక్కరు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి
చిన్ననిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది
జిల్లాలో 2024 సంవత్సరంలో 68 అగ్నిప్రమాదాలు
మంచిర్యాల క్రైం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): చిన్న నిర్లక్ష్యంతోనే పెద్దపెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేసవికాలం వచ్చిందంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఆకులు, గడ్డి పొదల్లో నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేసి వదిలేసిన బీడీ, సిగరెట్లే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెద్దపెద్ద షాపింగ్ మాల్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఎక్కువ డంపింగ్ యార్డులు, గుడిసెలులో తరుచుగా అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. గోదాములు, గిడ్డంగులు వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తాత్కాలిక నిర్మాణాలు, పందిర్లు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎండిన గడ్డినే వాడుతారు. గడ్డివాములు గుడిసెలకు దూరం లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు గాలికి నిప్పురవ్వలు చెలరేగి ఎక్కువ ఆస్తినష్టం సంభవిస్తుంటాయి. పట్టణాల్లో షాపింగ్ మాల్స్‌లు నిర్మించినప్పుడు ఫైర్ ఇంజిన్ చుట్టు తిరిగేలా కనీసం ఐదు మీటర్లు రోడ్డును ఉంచి నిర్మాణాలు చేపట్టాలి. కానీ పట్టణాల్లో అవేమి పటి ్టంచుకోకుండా ఇష్టారీతిన భవనాలు నిర్మిస్తున్నారు. దానివల్ల ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఇంజన్ వెళ్లలేకపోవడంతో ఆస్తినష్టం ఎక్కువగా జరుగుతుంది. ఇంటిలో గ్యాస్‌కు సంబంధించిన పరికరాలు వాడినప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అలాకాకుండా నిర్లక్ష్యంతో ఒక్కొసారి గ్యాస్ పేలే అవకాశాలు కూడా ఉంటాయి. దీని వల్ల కూడ అగ్ని ప్రమాదాలు సంభవించే అకాశాలు ఉన్నాయి.
అగ్నిప్రమాదాల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు...
- వేసవి కాలంలో మండే వస్తువులకు దూరంగా ఉండాలి.
- విద్యుత్ వైరింగ్‌ను క్రమం తప్పకుండ తనిఖీలు చేయాలి.
- సర్క్యూట్‌లను ఓవర్‌లోడ్ చేయకుండ చూసుకోవాలి.
- అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో అగ్నిమాపక యంత్రాలను నిల్వ చేయాలి.
- అన్ని ఇళ్లకు, షాపింగ్ మాల్‌కు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఎలా బయటపడాలో తెలుసుకునేలా ఫైర్ ఎస్కేప్ ప్లాన్‌ను కలిగి ఉండాలి.
- షాపింగ్ మాల్‌లో, గిడ్డంగుల్లో పని చేసే వర్కర్లకు ఈ ప్లాన్‌ను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయించాలి.
మంచిర్యాలలో ఫైర్ సిబ్బంది...
మంచిర్యాల ఫైర్ స్టేషన్‌లో 15 మంది సిబ్బంది ఉన్నారు. ఒక ఫైర్ స్టేషన్ ఆఫీసర్, ఇద్దరు ఫైర్‌మెన్‌లు, ఇద్దరు డ్రైవర్ ఆపరేటర్లు, పది మంది ఫైర్‌మెన్స్ ఉన్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. జిల్లాలో ఐదు మండలాలు మంచిర్యాల పరిధిలోకి వస్తాయి. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్, హాజీపూర్, దొనబండ, లక్షెట్టిపేట, మందమర్రి ఫైర్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. మండలాలు ఎక్కువగా ఉన్నందున మరికొంత మంది సిబ్బందితో పాటు మరొక్క ఫైర్ స్టేషన్ అందుబాటులోకి తెస్తే ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ అధికారులు తరుచు షాపింగ్ మాల్స్, సినిమా టాకీస్, పెట్రోల్ బంక్, రద్దీ ప్రదేశాల్లో షాపింగ్‌మాల్‌లు ఎక్కువగా తనిఖీలు చేస్తూ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎలాంటి పరికరాలు వాడాలనే దానిపై అధికారులు అవగాహన కల్పిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. పారిశ్రామిక ప్రాంతాల్లో భవనాలకు తప్పనిసరిగా ఎన్‌వోసీ తీసుకోవాలి. పాతకాలం బిల్డింగ్‌లకు ఫైర్ సేఫ్టీ లేకుండానే నిర్మాణాలు చేపట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమస్య ఎక్కువగా అవుతుంది. ఫైర్ ఇంజన్ లోపలికి రాకుండా ఉండడం వల్ల అగ్నిప్రమాదాల నివారణ ఒక సవాల్‌గా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు జిల్లా కేంద్రంలో అన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎన్‌వోసీ అందజేయాలి. అప్పుడే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు.
నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువ...
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రమేశ్‌బాబు
ఎక్కువగా ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లనే సంభవిస్తాయి. మామిడితోటలు, ఇతర తోటల వద్ద ఎండిన గడ్డి, రాలిన ఎండు ఆకులు ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ చేసి వాటిని పడేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే గడ్డిని, ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఫైర్ గ్యాప్‌ను పాటించాలి. షాపింగ్ మాల్స్‌లో ఎక్కువగా ఓవర్‌లోడ్ వల్ల షార్ట్‌సర్క్యూట్ అవుతుంటాయి. ఎప్పటికప్పుడు వైరింగ్ కరెక్టు ఉందా లేదా ఓవర్‌లోడ్ లేకుండా చూసుకోవాలి. అలాంటప్పుడే ప్రమాదాలు నివారించుకోవచ్చు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సును కల్పిస్తున్నాం. ఎక్కడైన ప్రమాదాలు సంభవిస్తే స్టేషన్ ఫైర్ అధికారి ఫోన్ 8712699195, ఫైర్‌స్టేషన్ నంబర్ 8712699194 నంబర్లలో సంప్రదించాలి.
అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల విడుదల
మంచిర్యాల కలెక్టరేట్ (ఆంధ్రజ్యోతి): నస్పూర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.