Share News

ఎండలోనే ‘ఉపాధి’ పనులు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:05 AM

ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇలాంటి తరుణంలో మట్టి పనులు చేయటం ఉపాధిహామీ కూలీలకు కష్టసాధ్యమే.

ఎండలోనే ‘ఉపాధి’ పనులు

- పని ప్రదేశంలో కానరాని వసతులు

- ఇబ్బందులు పడుతున్న కూలీలు

వాంకిడి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇలాంటి తరుణంలో మట్టి పనులు చేయటం ఉపాధిహామీ కూలీలకు కష్టసాధ్యమే. పైగా పని ప్రదేశాల్లో నీడ సౌకర్యం ఉండటం లేదు. ఎవరకి వారే తాగునీటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అత్యవసర ఔషధాల కిట్లు అందుబాటులో ఉండటంలేదు. కూలీలకు పనిప్రదేశంలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఒక్కో కూలీకి రూ. 2.50 చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 91,721 జాబ్‌ కార్డులు ఉండగా 1,70,268 మంది కూలీలు పనిచేస్తున్నారు.

- నిలిచిన అలవెన్స్‌లు..

ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు గతంలో ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలు చేసిన పనికి 30 శాతం అదనపు భత్యం చెల్లించేవారు. ప్రయాణ, కరవు భత్యం (టీఏ,డీఏ) ఖర్చు కింద గడ్డపారకు పది రూపాయలు, తట్టకు ఐదు రూపాయలు, మంచినీటికి ఐదు రూపాయలు, ఐదు కిలోమీర్లకు పైగా దూరం నుంచి వచ్చేవారికి 20 రూపాయల చొప్పున ఇవ్వాలి. వీటితో పాటు పనిప్రదేశంలో నీడ కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

- నిబంధనలు బేఖాతరు

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అధికారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి. కూలీలకు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్‌ కిట్లు, తాగునీరు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. కాని జిల్లాలో ఎక్కడా ఐదేళ్ల కాలంగా ఈ సౌకర్యాలు కల్పించడంలేదు. దీంతో ప్రతీ సంవత్సరం 44, 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ల్లోను కూలీలు ఉపాధి పనులు చేస్తూ అవస్థలు పడాల్సి వస్తోంది. నీడ సౌకర్యం లేకపోవడంతో కూలీలు చెట్ల కిందనే సేదతీరుతున్నారు. గతంలో వేసవిలో కొందరు కూలీలు వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన, మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఉదయం 8 గంటలలోపే పనులకు వెళ్లే ఉపాధిహామీ కూలీలు మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు ముగించుకుని ఇంటికి వస్తుంటారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తమతో పాటు సీసాల్లో నీరు తీసుకువెళ్తుంటారు. పనులకు ఉపయోగించే పలుగు, పార, మంచినీటికి రోజువారీ అలవెన్సులు చెల్లిస్తున్నామని చెబుతున్నా అవి కూడా సకాలంలో అందిన సందర్భాలు లేవు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈసారైనా పనిప్రదేశాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఉపాధిహామీ కూలీలు కోరుతున్నారు.

- నిరాశలో కూలీలు

2022లో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు కేంద్రం 12 రూపాయలు పెంచింది. 2023లో 15 రూపాయలు అదనంగా చెల్లించారు. గతేడాది 28 రూపాయలు పెంచగా కనీస వేతనం 300 రూపాయలకు చేరింది. అయినా కూలీలు నిరాశతో ఉన్నారు. గతంలో ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు దినసరి కూలీతో పాటు వేసవి భత్యం చెల్లించేవారు. ఆ సమయంలో 15 నుంచి 30 శాతం వరకు అధికంగా ఉండేది. రెండేళ్ల నుంచి దీనిని తొలగించారు. పలుగు, పార భత్యాలు కూడా వారానికి ఒకసారి చెల్లించేవారు. దానిని కూడా ఆపివేశారు.

ఫ ఎదురయ్యే సమస్యలివి....

- ఎండలో ఎక్కువ సేపు పనిచేయటం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదముంది.

- పని ప్రదేశాల్లో తాగునీరు సరిపడాలేకపోవడంవల్ల నీరసం, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.

- మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవటంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతారు.

- ఎండల వల్ల చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటివి ఎదురవుతాయి.

ఫ స్వీయ జాగ్రత్తలే కీలకం....

- ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీలు తగినంత నీరు తాగాలి. శరీరం డీహైడ్రేషన్‌ కూడా చూసుకోవాలి.

- పని ప్రదేశాల్లో ఓఆర్‌ఎస్‌ ద్రావణం లేదా నిమ్మకాయనీళ్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పనిచేయటం మానుకోవాలి. ఉదయం, సాయంత్రం పనిచేయటం మంచిది.

- పనిమధ్యలో చిన్నచిన్న విరామాలు తీసుకోవాలి. శరీరం ఆటసిపోయినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి.

- తలనొప్పి, వాంతులు, అధిక చెమట వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుల సహాయం తీసుకోవాలి. బాధిత వ్యక్తిని నీడ ప్రదేశంలోకి చేర్చి నీటితో శరీరాన్ని తుడవాలి.

- ఉప్పు, చక్కెర కలిపిన ఆహారం లేదా పండ్లు తీసుకోవటం వల్ల శ రీరంలో శక్తి లవణాలు నిల్వ ఉంటాయి.

సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు

శ్రావణ్‌, ఏపీఎం, వాంకిడి

ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు పనిప్రదేశంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ప్రభుత్వ వైద్యశాల నుంచి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఆయా పంచాయతీ ఆశా వర్కర్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నాము. పనిప్రదేశంలో మంచినీరు, టెంట్‌ సౌకర్యాం కల్పించేందుకు చర్యలు తీ సుకుంటున్నాము. కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Mar 11 , 2025 | 12:05 AM