ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:56 PM
జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్య, వైద్య, ఆరోగ్య, రవాణా, ఆర్టీసీ, విద్యుత్, గ్రామీణనీటి సరఫరా, తపాల శాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్య, వైద్య, ఆరోగ్య, రవాణా, ఆర్టీసీ, విద్యుత్, గ్రామీణనీటి సరఫరా, తపాల శాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం ఈ నెల 20 నుంచి 26 వరకు జిల్లాలో జరుగనున్న పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతీ రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లు ఉంటాయన్నారు. పదోతరగతి పరీక్షల కోసం ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాగజ్‌నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో, ఒపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఆసిఫాబాద్‌లోని జక్కాపూర్ జిల్లా పరిషత్, కాగజ్‌నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, ఫర్నీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీ పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆర్టీసీ శాఖ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడిపించాలని సూచించారు. సమావేశంలో పరీక్షల కమిషనర్ ఉదయబాబు, డీఎంహెచ్‌వో సీతారాం, ఆర్టీసీ డీఎం రాంచందర్, విద్యుత్ శాఖాధికారి శేషరావు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
ఆసిఫాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంలో ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. బుధవారం నెల వారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం, రక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన బందో బస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఎన్నికల పర్యవేక్షకులు సునీల్‌నాయక్, తహసీల్దార్ శ్యాంలాల్, సిబ్బంది ఉన్నారు.