Share News

‘ప్రాణహిత’ను నిర్మించి సాగునీరందిస్తాం

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:32 PM

ప్రాణహిత ప్రాజెక్టును పునఃర్నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీరు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నిర్మించడం చేతగాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాన్ని వదిలేసిందని, రూ. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకలిందని డిప్యూటి సీఎం అన్నారు.

‘ప్రాణహిత’ను నిర్మించి సాగునీరందిస్తాం

- రూ. లక్ష కోట్లతో బీఆర్‌ఎస్‌ నిర్మించిన కాళేశ్వరం కూలింది

- రూ. వెయ్యి కోట్లతో మంచిర్యాల అభివృద్ధికి చర్యలు

- ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మంచిర్యాల, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత ప్రాజెక్టును పునఃర్నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీరు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నిర్మించడం చేతగాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాన్ని వదిలేసిందని, రూ. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకలిందని డిప్యూటి సీఎం అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన రూ. 565 కోట్ల విలువైన పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్స వాలు వర్చువల్‌గా చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా నిర్మిస్తున్న 360 పడకల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి పనులను పరిశీలించారు. అనంతరం ఐబీ చౌరస్తా నుంచి ఓవర్‌ బ్రిడ్జీ మీదుగా అర్చన చౌరస్తా నుంచి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ఓపెన్‌టాప్‌ జీపులో ప్రయాణిస్తూ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మంచిర్యాల నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని డిప్యూటి సీఎం చెప్పారు. తన సొంత నియోజకవర్గం మదిర ఎంత ఇష్టమో...అదే స్థాయిలో మంచిర్యాలను కూడ ఇష్టపడతానన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తాను సీఎల్పీ నేతగా పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో పాదయాత్ర నిర్వహించానని గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పిప్రీలో 2023 మార్చి16న పాదయాత్ర ప్రారంభించగా ఏప్రిల్‌ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు. ఆ సభకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిర్జున్‌ ఖర్గే హాజరై ప్రసంగిస్తూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారని, ఆయన చెప్పినట్టుగానే తమ ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. ఆనాటి మంచిర్యాల సభ తనకు కొత్త ఉత్తేజాన్నిచ్చిందన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి, తాను శ్రీధర్‌బాబు దొరలగడిని బద్దలు కొట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చామని తెలిపారు. మంచిర్యాలలో మాతా శిశు ఆరోగ్యకేంద్రం నీటమునిగి బాలింతలు ఇబ్బందులు పడుతుంటే చలించిన తాను కొత్త ఆసుపత్రి నిర్మిస్తానని మాట ఇచ్చానన్నారు. ఇచ్చిన మాట మేరకు ఐబీ చౌరస్తాలో రూ.350 కోట్లతో 360 పడకల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. రాళ్లవాగు ముంపు నుంచి కాలనీలను కాపాడేందుకు రూ.260 కోట్లతో రిటర్నింగ్‌ వాల్‌ నిర్మిస్తుండగా, ఈ రోజు పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు.

యంగ్‌ ఇండియా స్కూల్స్‌ ద్వారా నాణ్యమైన విద్య...

మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున యంగ్‌ ఇండియా స్కూల్స్‌ మంజూరు కాగా రూ. 660 కోట్లు ఒకేసారి మంజూరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆ స్కూల్స్‌ నిర్మాణం పూర్తయితే ప్రపంచస్థాయి నాణ్యమైన విద్య ఇక్కడి పేద విద్యార్థులకు అందుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డైట్‌ చార్జీలను 40 శాతం పెంచిందని, కాస్మొటిక్‌ చార్జీలను 200శాతానికి పెంచినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లకాలంలో మహిళలను మరిచిపోతే తమ ప్రభుత్వం అక్కున చేర్చుకుందన్నారు. మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఉచిత బస్సు సౌకర్యం, వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు, ఎలక్ర్టిక్‌ బస్సులు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నామని తెలిపారు. సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 163 రకాల చికిత్సలకు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు 2లక్షల రుణమాఫీ ఒకే సారి చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రూ. లక్ష మాఫీ చేస్తామని ప్రకటించిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడతల వారీగా కూడా చెల్లించలేకపోయిందని ఎద్దేవా చేశారు.

త్వరలో ఇండస్ర్టీయల్‌ పార్కు..

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ బాటలో నడువాలనే ఉద్దేశంతో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల రోజులుగా జైబాపు... జై భీమ్‌... జై సంవిధాన్‌ నినాదంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు రాజ్యాంగాన్ని బలహీన పరిచే విధానాలను పూనుకుంటున్నాయని, ఆయా పార్టీల కుట్రను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రాజ్యాంగం, అంబేద్కర్‌ విషయంలో చులకనగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దాదాపు రూ.760 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మంత్రిగా ఉండికూడా.. అంతమొత్తం నిధులు తాను తీసుకురాలేకపో యానని శ్రీధర్‌బాబు అన్నారు. ప్రేంసాగర్‌రావుకు పూర్తి స్థాయిలో తమ సహకారం ఉంటుందని, నియోజకవర్గంలో త్వరలో ఇండస్ర్టీయల్‌ పార్కుకు శంఖుస్థాపన చేస్తామని మంత్రి వివరించారు.

ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరిం చుకొని మంచిర్యాలలో విగ్రహావిష్కరణ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. బీజేపీ వారు అంబేద్కర్‌ విగ్రహాలకు ముసుగులు తొడిగి తమను నిందించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ వాళ్లకు అంబేద్కర్‌ను తాకే కనీస హక్కు లేదన్నారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జైబాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ కోఆర్డినేటర్‌ రుద్ర సంతోష్‌, సింగరేణి సీఎండీ బల్‌ రాం నాయక్‌, గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ కొట్నాక తిరుపతి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ పటిష్టానికి కృషి చేశా..

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ ఊపిరిసలపని పనుల్లో నిమగ్నమై ఉండి కూడా తమ ఆహ్వానం మేరకు మంచిర్యాలకు విచ్చేసిన ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం పదివేల మంది దరఖాస్తు చేసుకున్నారని అందరికి పథకం వర్తింపచేసే బాధ్యత ఉపముఖ్యమంత్రిపై ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయించారని అయితే దశలవారీగా 15వేల ఇళ్లను తన నియోజకవర్గానికి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. తాను పదేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పటిష్టానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, ఆ విషయం ప్రజలతో పాటు పార్టీ నాయకత్వానికి తెలుసునన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారి వచ్చిన నాయకులు ఇద్దరు మంత్రి పదవిని ఆశిస్తూ తన గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నారని చెన్నూర్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేకానంద, గడ్డం వినోద్‌లను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే ఒకే కుటుంబంలో మూడు పదువులు ఉన్నాయని నాలుగో పదవి కూడా ఇస్తారా ఆవేదన వ్యక్తం చేశారు. నాలుకలేని గిరిజనులు, ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రజల తరుపున తాను పోరాటం చేస్తున్నానని, తనకు అన్యాయం జరిగితే ఆయా వర్గాలకు కూడ అన్యాయం చేసినట్లవుతుందని పార్టీ అధిష్ఠానానికి సూచించారు.

Updated Date - Apr 14 , 2025 | 11:32 PM