Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల రహస్య భేటీలు

ABN, Publish Date - Mar 14 , 2025 | 05:43 AM

బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తమ పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు.

Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్‌ నేతల  రహస్య భేటీలు

ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా?

  • సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన ఆరోపణ

  • బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్‌ చెయ్యాలని వ్యాఖ్య

  • హోలీకి పోలీసు ఆంక్షలపై ఫైర్‌

  • ఇలా చేస్తే రేవంత్‌రెడ్డికీ కేసీఆర్‌కు పట్టిన గతేనని హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తమ పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఆ నేతలు ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీలోని పాత సామాను.. పార్టీ నుంచి బయటకు పోవాలని అన్నారు. పార్టీ అధిష్ఠానం ఈ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇది ‘నా పార్టీ’, ‘నా అయ్య పార్టీ’ అని అనే వాళ్లు తెలంగాణ బీజేపీలో చాలా మంది ఉన్నారని రాజాసింగ్‌ పేర్కొన్నారు. అలాంటి వారిని రిటైర్‌ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని, పలువురు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం కూడా ఇదేనని చెప్పారు. పార్టీలోని సీనియర్‌ నేతలు కొందరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన కీలక నేతలను, ముఖ్యమంత్రిని రహస్యంగా కలుస్తున్నారని ఆరోపించారు. అలాంటి నేతలను పార్టీ నుంచి దూరం పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే హిందువులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్‌.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉందని బాహాటంగా అన్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు ధీటుగా బీజేపీ ఎదగగలదని అధిష్ఠానానికి సూచిస్తూ నెల రోజుల క్రితం మరో లేఖ విడుదల చేశారు. అలాగే, ఇటీవల జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికపైనా అసహనం వ్యక్తం చేశారు.


హిందువుల పండుగలపైనే ఆంక్షలు ఎందుకు ?

హిందువులపై పండుగలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏడాదికి ఓసారి జరిగే పండగలపై వివక్ష చూపడం ఏంటనీ ధ్వజమెత్తారు. హోలీ పండుగ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజాసింగ్‌ గురువారం ఓ వీడియో విడుదల చేశారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్‌ పరిస్థితి ఏమైందో ఆలోచన చేయాలని, అదే పరిస్థితి మీకు(సీఎం రేవంత్‌) ఎదురవుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఏడో నిజాం మార్గదర్శనంలో వెళుతున్నారని ఆరోపించారు. హోలీ రోజున సమూహంగా ఉండొద్దని, మధ్యాహ్నం 12 గంటల లోపే పండుగ చేసుకోవాలని, ఇతరులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఉత్తర్వులు జారీచేయడం తగదన్నారు. 30 రోజుల పాటు జరిగే రంజాన్‌ పండుగ వల్ల రాత్రి వేళల్లో ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆ ఇబ్బందులు ప్రభుత్వం, పోలీసుల దృష్టికి రావడం లేదా ? అని ప్రశ్నించారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తు ప్రభుత్వం మరో వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. హిందువుల పండుగలపై వివక్షత చూపితే ప్రజలు హర్షించరని, రేవంత్‌ రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక, హోలీ పండుగ సమయంలో పొరపాటున ఎవరి మీదైనా రంగులు పడితే అన్యద భావించవద్దని రాజాసింగ్‌ కోరారు.

Updated Date - Mar 14 , 2025 | 05:43 AM