CM Revanth Reddy: బ్రాండ్‌గా తెలంగాణ!
ABN, Publish Date - Jan 03 , 2025 | 02:49 AM
‘‘రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలోని సిబ్బంది పనితీరు, వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు నివేదికలు సేకరించాలి. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక ‘క్యూఆర్’ కోడ్ ఇవ్వాలి.
ట్రాఫిక్ నుంచి డ్రగ్స్, గంజాయి నియంత్రణ వరకూ
అన్నింట్లో మన రాష్ట్రం ప్రత్యేకతను చాటాలి
ఠాణాకో క్యూఆర్ కోడ్.. స్కాన్ చేసి ఫిర్యాదులు
వాటిని క్రోఢీకరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
పేదలైనా, ధనికులైనా చట్టం, న్యాయం ఒకేలా ఉండాలి
ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీని వాడాలి
ఒకే గొడుగు కిందకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి
ప్రభుత్వంపై ప్రజలకు ఒక భరోసాను కల్పించాలి
పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలోని సిబ్బంది పనితీరు, వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు నివేదికలు సేకరించాలి. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక ‘క్యూఆర్’ కోడ్ ఇవ్వాలి. ఫిర్యాదు చేయడానికి ఎవరైనా పోలీసు స్టేషన్‌కు వెళ్లారని అనుకుందాం. అప్పుడు అక్కడి సిబ్బంది వారితో వ్యవహరించిన విధానాన్ని తెలిపేందుకు ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడనుంది. దానిని స్కాన్ చేయగానే.. ఫోన్‌లోనే పలు ప్రశ్నలతో కూడిన ఒక పేజీ రావాలి. సంబంధిత వ్యక్తులు తమ అభిప్రాయాన్ని అందులో నమోదు చేస్తారు. ఇలా వచ్చిన అభిప్రాయాలను క్రోఢీకరించి, వాటిపై ప్రభుత్వం ఒక నిర్ణయం.. ఆపై చర్యలు తీసుకుంటుంది’’ అంటూ పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. న్యాయం విషయంలో పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పేదవారైనా, ధనికులైనా ప్రభుత్వానికి అందరూ సమానమేనని, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ఏ ఒక్కరికీ చుట్టంగా వ్యవహరించకూడదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలతోపాటు ప్రభుత్వంపై ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకు అవలంభించాల్సిన విధానాలను వివరించారు. ‘‘ట్రాఫిక్ నియంత్రణ నుంచి మహిళల రక్షణ, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, డ్రగ్స్, గంజాయిని అరికట్టే అంశం వరకూ ప్రతీ విషయంలో తెలంగాణ ఒక బ్రాండ్‌గా మారాలి. అందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ఇతర రాష్ట్రాలు కూడా ఏదైనా అంశంపై అధ్యయనం చేయాలంటే రాష్ట్రంవైపు చూడాలి. ఆ విధంగా రాష్ట్రాన్ని ఒక బ్రాండ్‌గా తయారు చేద్దాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖల ఉన్నతాధికారులకు నిర్దేశించారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధిలో శాంతిభద్రతల విభాగానిదే కీలకపాత్ర అని, ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి కట్టడికి మరింత పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, తెలంగాణను గంజాయి లేని రాష్ట్రంగా మార్చాలని తేల్చి చెప్పారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘షీ టీమ్’లను మరింత పటిష్ఠం చేయాలని చెప్పారు. మహిళలకు ప్రభుత్వంపై ఒక భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీ
రాష్ట్రంతోపాటు ప్రధానంగా రాజధాని హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. దీనికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలతోపాటు టెక్నాలజీని మరింతగా వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇకపై ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో విధానాలపై చర్చించకూడదని, ఈ విషయంలో రాష్ట్రానికే ప్రత్యేక విధానం ఉండాలని వివరించారు. ‘‘ఇందుకు డ్రోన్ టెక్నాలజీని వాడుకోవాలి. ఏ కూడలిలో ఎన్ని వాహనాలు ఉన్నాయి? అవి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందనే అంశాన్ని బేరీజు వేసి సిగ్నల్స్ ఇచ్చే సెన్సర్లతో కూడిన డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చే విషయంపై దృష్టి సారించాలి. తద్వారా ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ వేగంగా కదిలేందుకు అవకాశం ఉంటుంది’’ అని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పెద్ద పెద్ద కమ్యూనిటీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల నుంచి ఉదయం, సాయంత్రం వచ్చి, వెళ్లే వాహనాలు, అవి ఒకేసారి బయటకు రావడంతో కలిగే ట్రాఫిక్ అంతరాయాల గురించి ప్రస్తావించినట్టు సమాచారం.
వాన నీటిని ఒడిసిపట్టాలి
హైదరాబాద్ మహా నగరంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన కన్హా శాంతివనాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న ‘రెయిన్ ఫారెస్ట్’ (వర్షపు నీటిని ఒడిసిపట్టే) విధానాన్ని వివరించినట్లు తెలిసింది. ఆ విధంగానే వర్షపు నీటిని ఒడిసిపట్టాలని జీహెచ్‌ఎంసీ, మునిసిపల్ శాఖ అధికారులకు సూచించారు. నగరంలోని రాజ్‌భవన్ రోడ్డులో, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న రెండు భూగర్భ వర్షపు నీటి ట్యాంకుల విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. నీటి విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదని సూచించినట్టు తెలిసింది. వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌వాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ వాటర్ బోర్డు, మెట్రో వ్యవస్థలన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం హైడ్రాతోపాటు ఈ శాఖలన్నీ ఒకే గొడుగు కింద ఉండి పని చేయాలన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 02:49 AM