CM Revanth Reddy: పాలమూరు-రంగారెడ్డిలో ప్రతిబంధకాలు తొలగించాలి
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:50 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్-ఏదుల ప్రధాన కాలువ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
నార్లాపూర్-ఏదుల లింక్ పనులు చేయించాలి
పుట్టంగండి లీకేజీలు అరికట్టాలి
రిజర్వాయర్ నుంచి 10 కి.మీ మేర గ్రావిటీ కెనాల్ లైనింగ్ చేపట్టాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్-ఏదుల ప్రధాన కాలువ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ-3 కింద నార్లాపూర్ నుంచి ఏదుల దాకా 8.235 కి.మీ మేర కాలువ తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. దీని సవరణ అంచనాలను రూ.416 కోట్ల నుంచి రూ.784 కోట్లకు పెంచుతూ, ఆమోదించాలని ఇటీవలే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చారు. సరిగ్గా లేకపోవడంతో ప్రతిపాదనలను మంత్రివర్గం పక్కనపెట్టింది. ఈ పనులను 2015-16 ఎస్‌ఎ్‌సఆర్ (స్టాండర్డ్ ఆఫ్ రేట్) ప్రకారం చేయలేనని, అంచనాలను సవరించాల్సిందేనని నిర్మాణ సంస్థ ఇదివరకే తేల్చిచెప్పింది. సవరణ అంచనాలను పద్ధతి ప్రకారం పంపించడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడాదిగా పనులు ముందుకు సాగడం లేదు. ఈ పనులు చేపడితేనే నార్లాపూర్ నుంచి ఏదులకు, అక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించే అవకాశాలుంటాయి.
దీనిపై బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఇతర అధికారులతో సీఎం చర్చించారు. ప్యాకేజీ-3 పనులను చేయించే బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రతిబంధకాలు తొలగించే బాధ్యత అధికారులదేనని నిర్దేశించారు. ఇక హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు న ల్లగొండ జిల్లాకు సాగునీటిని అందించే పుట్టంగండి రిజర్వాయర్‌లో లీకేజీలున్నాయని, అరికట్టకపోతే రిజర్వాయర్ దెబ్బతిని.. నీళ్లన్నీ పంప్‌హౌ్‌సను ముంచే ప్రమాదం ఉందని, దీనివల్ల హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి సరఫరా ఆగిపోయే అవకాశం ఉందని, అంతేకాకుండా నల్లగొండ జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు వస్తాయని సీఎంకు అధికారులు నివేదించారు. రిజర్వాయర్ మరమ్మతులతో పాటు పుట్టంగండి నీటిని తరలించేందుకు 10 కి.మీ మేర గ్రావిటీ కెనాల్ లైనింగ్ చేపట్టాల్సి ఉందని సీఎంకు అధికారులు చెప్పారు.
స్పందించిన సీఎం, వెంటనే ఈ అంశంపై వాటర్‌బోర్డు ఎండీతో ఫోన్‌లో మాట్లాడారు. నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి, సంయుక్త సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే అనంతరం పుట్టంగండి రిజర్వాయర్ లీకేజీతో పాటు 10 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ లైనింగ్ చేపట్టాలని నిర్దేశించారు. మరమ్మతులు చేసే క్రమంలో జంటనగరాల తాగునీటి అవసరాలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ వేయాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేయగా సంయుక్త సర్వే చేసి, తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటితో పాటు నల్లగొండ జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు రాకుండా మరమ్మతులకు ఉపక్రమించాలని అధికారులకు సూచించారు.
Updated Date - Jan 09 , 2025 | 04:50 AM