Share News

CM Revanth Reddy: పేదలకు ఇక పండగే

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:25 AM

తెలంగాణలోని పేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం అందించే పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని, పేదల ఇళ్లలో ప్రతిరోజూ పండుగ వంటివుంటుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు నష్టమైందని, ఇప్పుడు తమ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర, బోనస్ అందిస్తున్నదని వెల్లడించారు.

 CM Revanth Reddy: పేదలకు ఇక పండగే

3 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం.. చరిత్రలో శిలాశాసనంలా నిలిచిపోయే పథకం

ఏ ప్రభుత్వం వచ్చినా దీనిని కొనసాగించాల్సిందే

రూ.21 వేల కోట్ల వడ్లను తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం

7వేల కోట్ల ధాన్యం వేలమేస్తే వచ్చింది 3వేల కోట్ల ధాన్యమే

నల్లగొండకు నీళ్లివ్వాలనే ఆలోచనే బీఆర్‌ఎ్‌సకు లేదు

ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదు.. ఓట్లు సీట్లపైనే వారి ధ్యాస

కాళ్లలో కట్టె పెట్టి కింద పడేయాలని చూస్తున్నరు

మా కార్యకర్తలు కళ్లలో కారం కొడతారు: సీఎం రేవంత్‌

సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

నల్లగొండ/సూర్యాపేట/హుజూర్‌నగర్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం అన్నంతో రాష్ట్రంలోని పేదల ఇళ్లలో ఇక ప్రతిరోజూ పండుగ రోజు కానుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శ్రీమంతుల ఇళ్లలో తిన్నట్లే.. పేద ప్రజలు కూడా ప్రతిరోజూ సన్నబియ్యం తినేలా చేయాలనే సంకల్పంతోనే రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందించే పథకాన్ని ఉగాది రోజున ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం ప్రారంభించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభావేదిక నుంచి హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సంచులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. పేదలకు సన్నబియ్యం పథకం ఆషామాషీ పథకం కాదని, చరిత్రలో శిలాశాసనంలా నిలిచిపోయే పథకమని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు సీఎంగా ఉన్నా.. ఈ పథకాన్ని కొనసాగించి తీరాల్సిందేనన్నారు. ఇప్పటివరకు రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు దొడ్డు రకాల బియ్యం అందుతున్నాయని, ఇందుకోసం ప్రతి ఏటా రూ.10,565 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అయితే.. కాలక్రమేణా ప్రజలు దొడ్డు బియ్యం తినడం మానేయడంతో.. అవి పక్కదారి పడుతున్నాయన్నారు.

g.gif

దొడ్డు బియ్యం తిరిగి తిరిగి మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వానికే వస్తున్న విషయాన్ని గుర్తించి దానిని కట్టడి చేయాలని భావించామని, ఆ మథనం నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం రూ.21 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద తాకట్టు పెట్టిందని సీఎం అన్నారు. చివరకు రూ.7 వేల కోట్ల విలువైన ధాన్యానికి టెండర్లు వేస్తే ఇప్పటికి రూ.3 వేల కోట్ల విలువైన ధాన్యమే వచ్చిందన్నారు.


కేసీఆర్‌ ఈ ఆలోచన ఎందుకు చేయలేదు?

మాజీ సీఎం కేసీఆర్‌ పదేళ్లలో ఏనాడూ పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయలేదని సీఎం రేవంత్‌ విమర్శించారు. పైగా రైతులు వరి వేయవద్దని, వరి వేస్తే ఉరేనని బెదిరించారని, కానీ.. తన ఫాంహౌ్‌సలో మాత్రం వెయ్యి ఎకరాల్లో వరి పండించారని అన్నారు. ఆ ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.4500కు కావేరి సంస్థ కొనుగోలు చేసిందని, తాను పూర్తి ఆధారాలతోనే ఈ ఆరోపణ చేస్తున్నానని తెలిపారు. రైతులకు మాత్రం మద్దతు ధర కూడా ఇప్పించకుండా కేసీఆర్‌ గోస పెట్టించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు ధర ఇప్పిస్తున్నారని, సన్నవడ్లు పండించిన రైతులకు అదనంగా రూ.500 బోనస్‌ కూడా ఇప్పిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల కింద కలిపి దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని, మూడేళ్లలో రూ.లక్ష కోట్లు మెక్కారని సీఎం ఆరోపించారు. మూడేళ్లలో కూలిన ఏకైక వింత ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. వారు చేసిన పాపాలకు ఉరేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు.

fg.gif

నల్లగొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కాంగ్రెస్‌ హయాంలోనే 34 కిలోమీటర్లు పూర్తయిందని, గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చాకే పనులను తిరిగి ప్రారంభించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎ్‌సకు ఈ జిల్లా ఓట్లు, సీట్లు తప్ప నీళ్లివ్వాలనే చిత్తశుద్ది లేదని ఆరోపించారు.


సేవచేయాలని ఉన్నందునే సీఎం అయ్యాను..

ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పం తనకు ఉండబట్టే దేవుడు కరుణించాడని సీఎం రేవంత్‌ అన్నారు. అందుకే ఉద్ధండుల వంటి నేతలున్నా ప్రజల ఆశీర్వాదంతో తనకు సీఎంగా అవకాశం దక్కిందన్నారు. ఈ 15 నెలల పాలనలో ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామని, గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రైతుబంధు నిధులు రూ.7,625 కోట్లను కూడా రైతులకు అందజేశామని తెలిపారు. రుణమాఫీ విషయంలో కేసీర్‌కు, తనకు.. నందికి, పందికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం 15 నెలల్లో ఎన్ని చేయగలదో అన్నీ చేసిందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తామన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమన్నారు. దీనిని హుజూర్‌నగర్‌లో చేపట్టడం తమకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. కాగా, మంత్రి ఉత్తమ్‌ కోరిక మేరకు హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

f.gif

కోదాడ నియోజకవర్గానికి ఏటీసీ (అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌)ను మంజూరు చేస్తామన్నారు. మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండలకు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను మంజూరు చేస్తామని తెలిపా రు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి హెలిప్యాడ్‌లో దిగిన తర్వాత మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటితో కలిసి రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న 2065 సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల మోడల్‌ కాలనీని సందర్శించారు. ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని సన్నబియ్యం పథకంతో నిజం చేయాలన్నదే తన సంకల్పమని ‘ఎక్స్‌’లో సీఎం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 05:25 AM