Double bedroom houses: డబుల్ బెంబేలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:52 AM
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోంది. కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించకపోవడంతో పనులు ఆపేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నిలిచిపోయిన నిర్మాణం ఇప్పటికీ కొనసాగట్లేదు.

డబుల్ ఇళ్ల నిర్మాణంపై చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు
నిధుల విడుదల లేనే లేదు
లెక్కలు తేల్చాలని జీహెచ్‌ఎంసీకి కాంట్రాక్టర్ల లేఖలు
అసంపూర్తి పనులకు 3 వేల కోట్లు కావాలి
రెండేళ్లుగా అరకొరగా నిధుల విడుదల
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.. అరకొర మినహా రెండేళ్లుగా నిధులు రాకపోవడం.. బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కాంట్రాక్టు సంస్థలు పనులు మానేశాయి. అప్పులు తెస్తూ ఇళ్లు కట్టడం తమ వల్ల కాదని.. ఇప్పటిదాకా చేసిన పనులకు సంబంధించిన లెక్కలు తేల్చి.. పేరుకుపోయిన బకాయిలు ఇవ్వాలంటూ జీహెచ్‌ఎంసీ అధికారులకు కాంట్రాక్టర్లు విజ్ఞప్తిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పది మంది కాంట్రాక్టర్లు అధికారులకు లేఖలు అందజేసినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ హయాంలో గ్రేటర్ పరిధిలో రూ.9,714.59 కోట్లతో లక్ష రెండు పడకల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. 97 వేలకుపైగా. ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా 69 వేలకుపైగా పూర్తయ్యాయి. వీటిలో సుమారు 65 వేల ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. మరో 28 వేల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నిలిచిపోయిన పనులు చాలాచోట్ల తిరిగి ప్రారంభం కాలేదు. రూ.200 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం.. నిధుల విడుదల నిలిచిపోవడంతో ఇళ్ల నిర్మాణంలో అయోమయం నెలకొంది.
రూ.3 వేల కోట్లకుపైగా...
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి గ్రేటర్‌తోపాటు శివార్లలోని 109 ప్రాంతాలు గుర్తించారు. జీ ప్లస్ త్రీ,, స్టిల్ట్ ప్లస్ 5, 9, 10, 11 అంతస్తులుగా భవనాలు నిర్మించారు. ఒక్కో ఇంటికి అంతస్తులను బట్టి రూ.7.5, రూ.8.5, రూ.8.65 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున ఇవ్వనుండగా.. మిగతా వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. పూర్తయి కేటాయింపునకు సిద్ధంగా మరో 4,600 ఇళ్లు ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్న 28 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.2823.49 కోట్లు అవసరం అని అంచనా వేశారు. 2016, 17 సంవత్సరాల్లో జరిగిన అగ్రిమెంట్లు కావడంతో అప్పటి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్‌ఎ్‌సఆర్) ప్రకారం ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుత ధరల ప్రకారం రూ.3000 కోట్లకుపైగా అవసరం అని ఓ అధికారి తెలిపారు. కాంట్రాక్టర్ల లేఖల నేపథ్యంలో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ కాంట్రాక్ట్ ఏజెన్సీలు తప్పుకొంటే అసంపూర్తిపనులకు సంబంధించి తిరిగి ప్రతిపాదనలు రూపొందించి టెండర్ ప్రకటిస్తామని చెప్పారు. పనులు చేసినట్టు జీహెచ్‌ఎంసీ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కావాలనుకునే సంస్థలు మినహ ఇతర ఏజెన్సీలు పనుల నుండి తప్పుకుంటున్నట్టు సమాచారం.
కేటాయించిన ఇళ్లలో..
గతంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో కనీస వసతులు లేవు. విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో 70 శాతం ఇళ్లలోకి లబ్ధిదారులు వెళ్లలేదు. చోరీకి గురైన నల్లాలు, విద్యుత్తు వైర్లు తిరిగి అమర్చడంతోపాటు.. పాడైన లిఫ్టులు, మోటార్లను మరమ్మతు చేస్తున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా లబ్ధిదారుల ఎంపిక జరగ్గా... వసతుల విషయాన్ని అప్పట్లో పట్టించుకోలేదు. ఆ ఇళ్లలో ఉండలేమంటూ కొందరు ఇప్పటికే అమ్ముకోవడం గమనార్హం.
ఇదీ లెక్క...
గ్రేటర్‌లో నిర్మించాలనుకున్న రెండు పడకల ఇళ్లు - 100000
అంచనా వ్యయం - రూ.9,714.59 కోట్లు
ఖర్చు చేసిన నిధులు - రూ.6,891.10 కోట్లు
పనులు ప్రారంభించనవి - 97,629 (108 ప్రాంతాలు)
పనులు మొదలు పెట్టాల్సిన ఇళ్లు - 2,371
పూర్తయిన ఇళ్లు - 69,633 (73 ప్రాంతాలు)
జీహెచ్‌ఎంసీ పరిధిలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లు - 64,348
కేటాయింపునకు సిద్ధంగా ఉన్న ఇళ్లు - 1,933
గ్రేటర్ ఆవలి ప్రాంతాల్లో స్థానిక కోటా ఇళ్లు - 3,352
ఇందులో కేటాయించిన ఇళ్లు - 713
కేటాయింపునకు సిద్ధంగా ఉన్న ఇళ్లు- 2,639
అసంపూర్తిగా ఉన్న ఇళ్లు - 27,996
వీటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు - రూ.2823.49 కోట్లు
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News