Spot Valuation: అనుభవం తక్కువగా ఉన్నా.. పదో తరగతి మూల్యాంకనం విధులు
ABN, Publish Date - Apr 08 , 2025 | 05:44 AM
అనుభవం లేని ఉపాధ్యాయులకు పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్ డ్యూటీలు వేయడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21నుంచి ఏప్రిల్ 4వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించారు.

ఏడాది క్రితమే స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారికి వాల్యుయేషన్ డ్యూటీలపై అభ్యంతరాలు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): అనుభవం లేని ఉపాధ్యాయులకు పదోతరగతి స్పాట్ వాల్యూయేషన్ డ్యూటీలు వేయడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21నుంచి ఏప్రిల్ 4వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. సోమవారం నుంచి స్పాట్ వాల్యూయేషన్(జవాబు పత్రాల మూల్యంకనం) ప్రారంభమైంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 3.18 లక్షల జవాబు పత్రాలను దిద్దేందుకు హైదరాబాద్‌లోని రెండు చోట్ల క్యాంపులను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో మేజర్ క్యాంపుగా, ఎర్రగడ్డలోని సెయింట్ థెరిస్సా హైస్కూల్‌లో మైనర్ క్యాంపుగా నిర్ణయించారు. మేజర్ క్యాంపు(తెలుగు, ఇంగ్లిష్ మీడియం జవాబు పత్రాల మూల్యాంకనం)లో 212 మంది చీఫ్ ఎగ్జామినర్లు(సీఈలు), 1,112 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు(ఏఈలు-పేపర్లు దిద్దే స్కూల్ అసిస్టెంట్లు), 350 మంది స్పెషల్ అసిస్టెంట్ల(ఎ్‌సఈలు)ను నియమించారు.
మైనర్ క్యాంపు(ఉర్దూ, హిందీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ల మూల్యాంకనం)లో 52 మంది సీఈలు, 309 ఏఈలు, 98 మంది ఎస్‌ఈలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం చేసే ఏఈలకు ఆయా సబ్జెక్టులపై కనీసం రెండేళ్ల పాటు పదో తరగతి విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం మేజర్, మైనర్ క్యాంపుల్లో డ్యూటీలు వేసిన 1,421 మంది ఏఈల్లో 20 మందికి పైగా గతేడాది జరిగిన డీఎస్సీ ద్వారానే స్కూల్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరారు. అనుభవం లేని వీరితో జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేయిస్తారంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తగా స్కూల్ అసిస్టెంట్లుగా నియమితులైన వారికి ఏఈలుగా డ్యూటీలు వేయడంపై కొంతమంది నేతలు డిప్యూటీ ఈవోలు, డీఐఓఎ్‌సలను ప్రశ్నించినట్లుగా సమాచారం. దీంతో, జిల్లా విద్యాశాఖాధికారులు సోమవారం సాయంత్రం కొందరిని వాల్యుయేషన్ విధుల నుంచి తప్పించినట్లు తెలిసింది.
Updated Date - Apr 08 , 2025 | 05:44 AM