Share News

Telangana Government: సర్కార్‌ను బద్నామ్‌ చేయడానికే

ABN , Publish Date - Apr 16 , 2025 | 03:17 AM

తెలంగాణ ప్రభుత్వం మీద ఫేక్‌ పోస్టుల ప్రచారం కోసం విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని, 25 మంది కీలక పాత్రధారులు ఉన్నారని సైబర్‌ క్రైం బృందాలు తెలిపారు. ఈ కేసులో సంబంధిత న్యూస్‌ సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం

Telangana Government: సర్కార్‌ను బద్నామ్‌ చేయడానికే

  • సోషల్‌ మీడియాలో ఫేక్‌ పోస్టులు

  • భారత చట్టాలకు చిక్కకుండా ఉండేందుకే విదేశాల నుంచి పోస్టులు

  • 25 మంది కీలకం.. వారికి భారీ నిధులు

  • వెనకున్న పెద్దలపై ప్రభుత్వానికి నివేదిక

  • ఆయా సైట్లకు త్వరలో నోటీసులు

  • హెచ్‌సీయూ భూ వివాదం.. ఫేక్‌ పోస్టులపై పోలీసుల నిశిత విశ్లేషణ!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేయడానికి కొందరు పక్కా ప్లాన్‌ వేశారని, సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకుని ఫేక్‌ పోస్టులను రూపొందించి వదులుతున్నారని, వీరికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయని హెచ్‌సీయూ భూ వివాదానికి సంబంధించి ఫేక్‌ పోస్టులపై దర్యాప్తు జరుపుతున్న సైబర్‌ క్రైం బృందాలు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహరంలో 25 మంది కీలక పాత్ర పోషించారని, వారి బ్యాంకు లావాదేవీలు, వారి వెనుక ఉన్న పెద్దల పాత్ర గురించి ఇప్పటికే ప్రభుత్వానికి నిఘావర్గాలు సమగ్రమైన నివేదిక అందించాయని తెలుస్తోంది. ఫేక్‌ పోస్టులు పెడుతున్న వారు భారతచట్టాల నుంచి తప్పించుకోవడం కోసం దుబాయ్‌, ఆఫ్రికా తదితర దేశాల నుంచి తమ కార్యక్రమాలను సాగిస్తున్నారని, వారికి హవాలాతో పాటు ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని, ఇది డిజిటల్‌ మాఫియాగా విస్తరించిందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు సాధారణమైన వీడియోలతో ఫేక్‌ ప్రచారం చేసిన వారు కొత్తగా ఏఐ ఆధారిత ఫేక్‌ వీడియోలు, ఫొటోలు సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్న విషయాన్ని సాక్ష్యాధారాలతో సహ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజల్ని, మేధావుల్ని సైతం తప్పుదోవ పట్టించే విధంగా ఈ పోస్టులు ఉంటున్నాయి. హెచ్‌సీయూ భూ వివాదంపై సృష్టించిన వీడియోలను నిజమని నమ్మి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం వాటిని రీ పోస్టు చేశారంటే ఎంత బలంగా ఈ డిజిటల్‌ మాఫియా పనిచేస్తుందో స్పష్టం అవుతోందని పోలీసు అధికారులంటున్నారు.


ఇదీ పక్కా పథకంతో నడుస్తున్న కుట్ర అని, దీని వెనుక ప్రతిపక్ష పార్టీ పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అనేక యూ ట్యూబ్‌ చానళ్లు, న్యూస్‌ వెబ్‌సైట్లకు కోట్ల రూపాయల్లో నిధులు అందుతున్నాయని, ఈ డిజిటల్‌ మాఫియాను నియంత్రించడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరముందని మాజీ పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఫేక్‌ పోస్టులను పెట్టి డిలీట్‌ చేసిన న్యూస్‌ సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలకు సంబంధించి వాటి యూఆర్‌ఎల్‌ వివరాలను సైబర్‌ క్రైం బృందాలు సేకరించాయి. వీటిలో అత్యధికం బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ మద్దతిస్తున్నవేనని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పోలీసు అధికారులు పేర్కొన్నారు. కేసీఆర్‌ అడ్డా, పావనీ గౌడ్‌ బీఆర్‌ఎస్‌, రామ్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణ సైన్యం, తెలంగాణ వాయిస్‌, తెలంగాణ ఉద్యమ జ్యోతి, హరీష్‌ రెడ్డి, కెప్టెన్‌ ఫసాక్‌, ఆయూబ్‌ సోహైల్‌, వి టాక్స్‌, ధన, ఏజే స్వారో, థామస్‌ అగస్టిన్‌, జి.కిషన్‌ రెడ్డి, కట్టా జగదీశ్‌, రఘువీర్‌ రాథోడ్‌, రాజిరెడ్డి గారి అమ్మాయి, అఖిల్‌ రాయుడు, సూర్యకాంతం, పృథ్వీతేజ, రామజింగ్‌ మీమ్స్‌, వంశీకృష్ణారెడ్డి, మల్హర్‌, పల్లవి, ఇండియన్‌ రైటర్‌, సూరజ్‌ మెహ్రా పేర్లతో ఉన్న న్యూస్‌ సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారని, వాటిల్లో ఫేక్‌ పోస్టులు పెడుతున్నారని, వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నామని సైబర్‌ క్రైం బృందాలు తెలిపాయి.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 03:18 AM