Alleged Land Scam in Hyderabad: అక్రమబద్ధీకరణకు రెక్కలు!
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:03 AM
హైదరాబాద్‌లోని కుంట్లూరులో ప్రభుత్వ భూమిని అక్రమంగా క్రమబద్ధీకరించే ప్రయత్నం జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. 2015లో జారీ చేసిన జీవో 59 ద్వారా పేదల కోసం భూమి క్రమబద్ధీకరించబడినట్లు చెప్పి, కొంతమంది పెద్దలు ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ క్రమబద్ధీకరణలను తాజా ప్రభుత్వ ప్రభుత్వం నిరోధించింది.

200 కోట్ల ప్రభుత్వ భూమి కొట్టేసే ప్లాన్
కుంట్లూరు ఎక్స్ రోడ్డులో రెండెకరాలకు ఎసరు
2015లో 600 చదరపు గజాల క్రమబద్ధీకరణ
2022లో మరో 3,635 చ.గజాలకు దరఖాస్తు
నిర్మాణాల్లేకపోయినా అప్పటి సర్కారు గ్రీన్‌సిగ్నల్
క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలు
ప్రభుత్వం మారిపోవడంతో అటకెక్కిన ఫైలు
తాజాగా ఓ ఎమ్మెల్యేతో క్రమబద్ధీకరణకు పావులు
భూమి రెగ్యులరైజేషన్‌కు లైన్ క్లియర్!?
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అది రెండెకరాల ప్రభుత్వ భూమి! దాని విలువ దాదాపు రూ.200 కోట్లు! పేదల కోసం తీసుకొచ్చిన జీవో 59ను అడ్డు పెట్టుకుని దీనిని కొట్టేసేందుకు కొంతమంది పెద్దలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు! గత ప్రభుత్వ హయాంలో కొంత భూమిని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారు! మిగిలిన భూమినీ క్రమబద్ధీకరించుకునేందుకు పావులు కదిపారు! అ‘క్రమబద్ధీకరణ’కు రెవెన్యూ అధికారులు ఫీజులూ తీసుకున్నారు! కానీ, కన్వేయన్స్ డీడ్ ద్వారా కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి చేతులు మారే సమయంలో ప్రభుత్వం మారింది. రేవంత్ సర్కారు రావడంతో క్రమబద్ధీకరణ ఫైలు అటకెక్కింది! కానీ, ‘రంగారెడ్డి’ జిల్లా ఎమ్మెల్యేను మచ్చిక చేసుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఈ అ‘క్రమబద్ధీకరణ’కు రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు ఎక్స్ రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 24లో జరుగుతున్న భూ బాగోతమిది!
హయత్ నగర్ నుంచి కుంట్లూరుకు వెళ్లే మార్గంలో నాలుగు రహదారుల కూడలి (కుంట్లూరు ఎక్స్ రోడ్డు)లో ఎడమ వైపు రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. అది ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015లో జీవో నంబరు 59 తీసుకొచ్చినప్పుడు ఇందులో 600 చదరపు గజాలను క్రమబద్ధీకరించుకున్నారు. ఇక్కడి 600 గజాల్లో 360 గజాల్లో నిర్మాణాలు ఉన్నాయని చెబితే అధికారులు గుడ్డిగా అనుమతులు ఇచ్చేశారు. ఆ పేరుతో ఇక్కడి రెండెకరాల స్థలాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 59 జీవో కింద దరఖాస్తులను ఆహ్వానించగా.. గతంలో 600 చ.గజాలను క్రమబద్ధీకరించుకున్న కుటుంబమే ఈసారి ఏకంగా 3,635 చ.గజాలు క్రమబద్ధీకరించాలంటూ దరఖాస్తు చేసింది. కుటుంబంలో ఐదుగురి పేర్ల మీద ఒకరికి 820 చ.గజాలు, మరొకరికి 820 చ.గజాలు, ఇంకొకరికి 850 చ.గజాలు, ఇంకో ఒకరికి 850 చ.గజాలకు దరఖాస్తు చేశారు.
అంతేకాదు.. 2015లో 600 చ.గజాలు క్రమబద్ధీకరించుకున్న వ్యక్తి కూడా మరో 300 చ.గజాల ప్రభుత్వ స్థలాన్ని దక్కించుకోవడానికి దరఖాస్తు చేయడం గమనార్హం. నిజానికి, అక్కడ ఆ స్థాయిలో నిర్మాణాలు లేవు. కానీ, ప్రభుత్వం జీవో 59ని ఎన్నిసార్లు తీసుకొస్తే అన్నిసార్లూ తమ పలుకుబడితో క్రమబద్ధీకరణకు ప్రయత్నాలు చేశారు.
నిర్మాణాలు లేకపోయినా గ్రీన్ సిగ్నల్
జీవో 59 కింద ఇక్కడ 600 చదరపు గజాలను క్రమబద్ధీకరించడమే కాకుండా.. మూడు విడతల్లో అంటే.. 2023 నవంబరు 5న, డిసెంబరు 6న, 2024 జనవరి 6న దాదాపు 3,635 చ.గజాలను క్రమబద్ధీకరించడానికి రెవెన్యూ అధికారులు ఫీజులు తీసుకున్నారు. ఈ అక్రమబద్ధీకరణపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో, ఆయన ఆదేశాల మేరకు 2023 డిసెంబరు 8న అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్, గిర్దావర్ పరిశీలన చేసి తుది నివేదికను అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఖాళీగా ఉన్న ఆ స్థలంలో 40 చ.గజాల్లో, 30 చ.గజాల్లో చిన్న చిన్న నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని, కానీ, రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకున్నారని, జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేయడం ఏ మాత్రం సరికాదని ఆ నివేదికలో తహశీల్దార్ నిర్ధారించారు.
స్థలం ఒకచోట.. నిర్మాణం మరోచోట
సర్వే నంబరు 24లో క్రమబద్ధీకరించుకున్న 600 చదరపు గజాల్లో గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల నిర్మాణానికి 2017లో పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీకి దరఖాస్తు చేశారు. కన్వేయన్స్ డీడ్ ఆధారంగా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. కానీ, క్రమబద్ధీకరించుకున్న 600 చ.గజాల్లో కాకుండా ప్రభుత్వ భూమిలోనే మరోచోట దీనిని నిర్మించారు. ఈ అంశాన్ని గుర్తించిన పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ అధికారులు 2019 మే 30న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నుంచి క్రమబద్ధీకరించుకున్న 1-92/1/ఏ ఇంటి నంబరు స్థలంలో నిర్మాణం చేయకుండా మరో ప్రాంతంలో ఏవిధంగా చేస్తారని ప్రశ్నించారు. అనుమతులు పొందిన స్థలానికి, నిర్మాణం చేసిన స్థలానికి పొంతన లేదని, వారం రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులో స్పందించకపోవడంతో 2019 మే 12న నిర్మాణ అనుమతులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బట్లూనిబాయి కుంటకు ఎసరు
కుంట్లూరు సర్వే నంబరు 24ను ఆనుకునే రెండు రహదారులు వెళుతున్నాయి. అత్యధిక నివాసాలూ ఇక్కడే వచ్చాయి. దాంతో, ఇక్కడ చదరపు గజం భూమి లక్షల్లోనే పలుకుతోంది. ఇక, క్రమబద్ధీకరించాలని భావిస్తున్న స్థలంలో బట్లూనిబాయి కుంట ఉంది. హెచ్‌ఎండీఏ సైతం సర్వే చేసి చెరువు కుంటకు ఐడీ 1900/ఈఎన్/19ను నిర్ధారించింది. దీని విస్తీర్ణం 1.9 ఎకరాలుగా ఉంది. అక్రమబద్ధీకరణ ప్రక్రియతో చెరువు కుంట కూడా కనుమరుగయ్యే ప్రమాదముంది.
ఓ ఎమ్మెల్యేను మచ్చిక చేసుకోవడంతో లైన్ క్లియర్..?
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుపుకొన్న పేదలకు.. వారి పేరిటే ఆ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 కొందరు పెద్దలకు వరంగా మారిన సంగతి తెలిసిందే. పేదల కోసం తీసుకొచ్చిన జీవోను అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయల విలువజేసే భూములను కొందరు బడా నేతలు గద్దల్లా తన్నుకుపోయారు. ఎలాంటి నిర్మాణాలూ లేకపోయినా ఈ జీవో కింద అప్పనంగా కట్టబెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ అక్రమబద్ధీకరణలపై ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే వరుస కథనాలను ప్రచురించింది. దీంతో, రేవంత్ ప్రభుత్వం అక్రమబద్ధీకరణలకు బ్రేకులు వేసింది. గత ప్రభుత్వంలో జారీ చేసిన అక్రమబద్ధీకరణ స్థలాల కన్వేయన్స్ డీడ్‌లను సైతం నిలిపివేసింది. వాటి ఆధారంగా క్రయ, విక్రయాలను ఆపేసింది. భవన నిర్మాణాలకు అనుమతులివ్వకూడా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ, కుంట్లూరులో మాత్రం తమ 3,635 చ.గజాలను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తుదారులు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను మచ్చిక చేసుకున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ఎలాంటి విధానాన్ని అనుసరించారో.. ఈ ప్రభుత్వంలోనూ దానినే అనుసరించి స్థలాలను కొట్టేసేందుకు తెర వెనక పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా పలుకుబడి కలిగిన వ్యక్తులకు ఎమ్మెల్యేలైనా.. అధికార యంత్రాంగమైనా.. జీ హుజూరు అనే పరిస్థితి ఉందని వాపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News