Gurukula Society: స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చినా.. సీటు రాలే
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:27 AM
గురుకులాల సొసైటీ ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఏ విద్యార్థికీ అన్యాయం జరగదని ప్రకటించింది. దరఖాస్తు చేసే ముందు విద్యార్థులు అన్ని వివరాలను సరిచూసుకోవాలని సూచించింది

మరో 53 మంది విద్యార్థులదీ అలాంటి పరిస్థితే
బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన పిల్లలకు నిరాశ
జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పరీక్ష కోసం దరఖాస్తు చేసే సమయంలో జరిగిన పొరపాటు వల్ల.. మొదటి ర్యాంకు వచ్చినా ఓ విద్యార్థికి గురుకులంలో సీటు రాలేదు. అతనొక్కడే కాదు అలాంటి పొరపాటే చేసిన మరో 53 మంది పిల్లలు కూడా మంచి ర్యాంకులు వచ్చినా.. సీటు పొందలేకపోయారు. ఈ విషయంలో విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వానికి లేఖ రాశారు. బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్‌లోని ప్రగతి విద్యాలయం నుంచి 85 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 54 మందికి 1,000లోపు ర్యాంకులు వచ్చాయి. ఇందులో ఇ.ఆకాశ్ అనే విద్యార్థికి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు వచ్చింది. అయితే, దరఖాస్తు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వీరెవరికీ సీటు రాలేదు. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసే సమయంలో బీసీ జాబితాలో తాము ఏ కులమో వీరంతా స్పష్టం చేశారు. అయితే ‘‘మీ కులం ఎంబీసీ జాబితాలో ఉందా..?’’ అన్న ప్రశ్నకు ఎస్ అని పొరపాటున టిక్ చేశారు. దీంతో వీరంతా సీట్లకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీసీ కమిషన్‌కు లేఖ రాశారు. విద్యార్థులు బీసీలైనా.. వారి కులం ఎంబీసీ జాబితాలో లేనందున అధికారులు సీటు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణిని కలిసేందుకు ప్రయత్నించగా.. నిరాశ ఎదురైందని తెలిపారు. స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఏ విద్యార్థికీ అన్యాయం జరగదు: సొసైటీ
గురుకులాల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి అవకతవకలకు అవకాశమే లేదని గురుకులాల సొసైటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందు విద్యార్థులు అన్ని వివరాలు సరిచూసుకోవాలని పేర్కొంది. ప్రతిభ గల ప్రతి విద్యార్థికీ న్యాయం జరుగుతుందని, ఇందులో అనుమానాలకు తావులేదని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.