Formula E Race Case: న్యాయవాదిని అనుమతించాలన్న కేటీఆర్ వ్యాజ్యంపై కౌంటర్ వేస్తాం
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:12 AM
ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ తనతోపాటు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, హైకోర్టు న్యాయవాదిని "కనుచూపు మేర" ఉండేలా అనుమతించాలన్న ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, కేసులో 15 మంది సాక్షులను విచారించినప్పటికీ, విదేశాల నుండి డాక్యుమెంట్లు రావాల్సి ఉన్నాయని తెలిపారు.

ఫార్ములా ఈ రేస్ కేసులో విదేశీ డాక్యుమెంట్లు రావాల్సి ఉంది: ఏసీబీ
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు తనతోపాటు న్యాయవాదిని అనుమతించాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి అనుమతించాలని హైకోర్టుకు ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు రావాల్సిందిగా కేటీఆర్‌కు ఏసీబీ గతంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. విచారణకు తనతోపాటు న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు అంగీకరించిన హైకోర్టు.. మాటలు వినపడకుండా కనుచూపుమేరలో న్యాయవాది ఉండేలా అనుమతించాలని ఏసీబీకి ఆదేశాలు జారీచేసింది. కేటీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ మరోసారి జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏసీబీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది బాలమోహన్‌రెడ్డి.. ఈ కేసులో ఇప్పటివరకూ 15 మంది సాక్షులను విచారించామని, విదేశాల నుంచి కొన్ని డాక్యుమెంట్లు రావాల్సి ఉందని, వాటి కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
కేటీఆర్ తరఫున న్యాయవాది ఏ ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. ఏసీబీ కేటీఆర్‌ను మళ్లీ విచారణకు పిలిచే పరిస్థితి ఉన్నందున ‘కనుచూపు మేర వరకు న్యాయవాదిని అనుమతించాలి’ అని ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అలాగే కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ వాదనను ఏసీబీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. విచారణకు పిలిచిన రోజు వరకే న్యాయవాదిని అనుమతించాలనే ఆదేశాలు వర్తిస్తాయని.. ఈ మేరకు తాము కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఏసీబీ కౌంటర్ తర్వాత విచారణ చేపడతామని పేర్కొంటూ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News