Commissioner Ranganath: హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:44 AM
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం డ్రా కారణంగా పడిపోయిందని చెప్పడం తప్పు అని అన్నారు. మార్కెట్‌లో స్తబ్దతకు హైడ్రా బాధ్యత వహించదని, హైడ్రా ఏర్పాటుకముందే అమ్ముడుపోని ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు.

మార్కెట్లో స్తబ్దతకు బాధ్యత వహించదు
మరో 15 రోజుల్లో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్10 (ఆంధ్రజ్యోతి): హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందనడం సరికాదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. మార్కెట్‌లో స్తబ్దతకు హైడ్రా బాధ్యత వహించదని, హైడ్రా ఏర్పాటుకు ముందే అమ్ముడుపోని ఫ్లాట్లు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రజా ఆస్తులను రక్షించడం, పారదర్శకతను పెంపొందించడమే తమ పాత్ర అన్నారు. ఎల్‌బీనగర్‌లో హెచ్‌ఆర్‌సీఎ్‌స ఇండియా గురువారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. మరో 15 రోజుల్లో హైడ్రా పోలీ్‌సస్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెరువుల ఆక్రమణలు, ఫుల్ ట్యాంక్ లెవెల్స్ (ఎఫ్‌టిఎల్)ను గుర్తించేందుకు శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వినియోగించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎ్‌ససీ)తో ఒప్పందం చేసుకోవాలని హైడ్రా యోచిస్తోందన్నారు. ఎఫ్‌టీఎల్ అంటే చాలా మందికి తెలియదని, హైడ్రా వచ్చే వరకు తనకూ తెలియదని చెప్పారు. ఎఫ్‌టీఎల్ భూమి ఎక్కడ ఉందో హైడ్రా వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా కొరల నుంచి కాపాడేందుకు హైడ్రా వచ్చిందన్నారు. కొంత మంది రియల్ ఎస్టేట్ స్వార్థపరుల వల్ల ప్రజలు మోసపోతున్నారని, ప్రజలకు మంచి చేసే వారికి హైడ్రా అండగా ఉంటుందని చెప్పారు.
హెచ్‌ఆర్‌సీఎ్‌స ఇండియా ఉచిత సేవలు..
హైదరాబాద్‌లో ఆస్తులను కొనాలనుకునే సందర్భంలో ప్లాట్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్‌జోన్ పరిధిలోకి వస్తుందేమోనని ఆందోళన చెందేవారికి హెచ్‌ఆర్‌సీఎ్‌సఇండియా.కామ్ ఉచితంగా తగిన సేవలందిస్తుందని సంస్థ సీఈవో హర్షవర్ధన్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కచ్చితమైన, పారదర్శకమైన సమాచారాన్ని ఉచితంగా అందించనున్నట్టు చెప్పారు. ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోళ్లలో సందేహాలను నివృత్తి చేయడంతోపాటు రుణాలు పొందడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తామని తెలిపారు.