Bhu Bharati: భూ భారతిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 14 , 2025 | 08:10 PM
Bhu Bharati: తెలంగాణలో భూ భారతి పోర్టల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికగా ఈ పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ ప్రారంభమైంది. సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ఈ భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నామని స్పష్టం చేశారు. 69 లక్షల రైతు కుటుంబాలకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నామన్నారు. తెలంగాణలో జరిగిన పోరాటాలన్ని భూమి చుట్టూ తిరిగాయని ఆయన గుర్తు చేశారు. జల్.. జంగిల్.. జమీన్ నినాదంతోనే కుమురం భీమ్ పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో భూమి కోసం, విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ధరణి కారణంగా తహశీల్దార్‌పై దాడి కూడా జరిగిందన్నారు. ఇదే ధరణి కారణంగా తెలంగాణలో జంట హత్యలు సైతం జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి భూస్వాముల నుంచి.. మిగులు భూములను సేకరించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. సేకరించిన మిగులు భూములను పేదలకు పంచింది ఇందిర ప్రభుత్వమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చట్టాన్ని రద్దు చేసి ధరణి తెచ్చిందని మండిపడ్డారు. అనాలోచితంగా తెచ్చిన ధరణి చట్టం ఎన్నో సమస్యలకు కారణమైందని విమర్శించారు. రెవెన్యూ సిబ్బందిని కేసీఆర్ ఎన్నో రకాలుగా అవమానించారని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది అంటే ప్రజలను దోచుకునే వారిగా గతంలో చిత్రీకరించారని.. తద్వారా ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టే వ్యవహారం చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు.
గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే ఉద్యోగులను సైతం తొలగించారన్నారు. రెవెన్యూ సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. కొందరి వల్ల మొత్తం రెవెన్యూ శాఖను తాను దోషిగా చూడనని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం,అధికారులు వేర్వేరు కాదని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వం కలిసి నడిస్తేనే ఏదైనా సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. ప్రతి మనిషికి ఆధార్ వలే.. ప్రతి భూమికి భూధార్ తెస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రతి భూమికి కచ్చితమైన సరిహద్దులతో రిజిస్ట్రేషన్ చేద్దామని ఆయన పిలుపు నిచ్చారు. ప్రతి భూమికి కొలతలు.. హద్దులు వేసి రైతులకు ఇద్దామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తొలుత ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పోర్టల్ అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తోంది. అయితే ఈ పోర్టల్‌ను అప్ డేట్ చేసేందుకు ప్రజల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా లేదన్నారు. దొరలకు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్‌ను రూపొందించారని విమర్శించారు.గత ప్రభుత్వం రైతులకు కంటి మీద నిద్రలేకుండా చేసే చట్టం చేసిందని మండిపడ్డారు. ధరణి ఆరాచకాల ఫలితం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల వేళ.. ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్ తీసుకు వచ్చామని చెప్పారు. ప్రజలు ఆమోదించని చట్టం కాబట్టే.. ధరణిని పక్కన పాడేశామన్నారు. కలెక్టర్ దగ్గర ఉన్న అధికారాలను వికేంద్రీకరణ చేశామని.. అలాగే వివిధ రాష్ట్రాల్లోని భూచట్టాలన్నింటినీ అధ్యయనం చేసి.. ఉత్తమమైన చట్టం రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు వంటి నేతల సూచనలు సైతం తమ ప్రభుత్వం స్వీకరించామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News