TG Highcourt: ఆ షోలు రద్దు చేశామంటూ మళ్లీ ఏంటిది.. హైకోర్టు అసంతృప్తి
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:25 PM
TG Highcourt: స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోలపై దాఖలపై పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్, జనవరి 10: గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టులో (Telangana highcourt) శుక్రవారం విచారణ జరిగింది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా... బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే తొక్కిసలాట ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఇకపై బెన్‌ఫిట్‌షోలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Telangana CM Revanth Reddy) కలువగా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు సీఎం. ఇదిలా ఉండగా... శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా టికెట్‌ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అర్ధారత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు అనుమతించని ప్రభుత్వం.. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల షోకు అనుమతినిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిన్న (గురువారం) ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారించగా.. గేమ్ చేంజర్ సినిమా స్పెషల్ షోకు అనుమతి ఇవ్వడంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ పెంపుపై ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. దీనిపై విచారణను ఈరోజు వాయిదా వేసిన కోర్టు.. నేటి విచారణలో ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 24కు హైకోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
Game Changer: అసెంబ్లీలో చెప్పింది ఒట్టిదేనా.. సీఎంపై హరీష్ రావు ఫైర్..
TG News: షాకింగ్ న్యూస్.. పది అడుగుల లోతులో పడ్డ భారీ ట్రక్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 10 , 2025 | 04:27 PM